(దేవుడ్ని
నమ్మని శ్రీ నరిసెట్టి ఇన్నయ్య గారికి, దేవుడ్ని
నమ్మే నాలాటి వారికి ఇది అంకితం)
దేవుడు
లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని
నమ్మేవాళ్ళంటారు.
దేవుడు
పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు
లేడని చెబుతూ ఆ పేరుతొ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.
నాకయితే ఇద్దరూ కరక్టే అనిపిస్తుంది.
దేవుడ్ని
నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని
నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు
తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం
ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం
ఇస్తూనే వుంటారు.
వీరుకాక
మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని
వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా
నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే
గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, దేవుడంటే నమ్మకం లేని వీళ్ళను ఆ భగవంతుడూ
కనుక్కోడు. దేవుడ్ని నమ్మే వీళ్ళనూ ఆ దేవుడూ
పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా
వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు
దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, లేదా దేవుడికోసం పోట్లాడడం
వీరికీ, వారికీ
బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో
లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే.
ఆస్తికులు, నాస్తికుల
మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు
దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు. నమ్మనివాళ్లదీ నమ్మకమే. నమ్మే
వాళ్లదీ నమ్మకమే.
అందుకే
అంటారు, తొక్కితే రాయి – మొక్కితే
సాయి అని. అంతా నమ్మకమే.
దేవుడ్ని
నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.
దేవుడు
పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం
కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే
గొప్పవాడు, శక్తిమంతుడు
మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం
గుర్తించేవారు, వారు నాస్తికులు కావచ్చు
కాని భగవంతుడో మరొకడో ఏ పేరు అయితేనేం తమకంటే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే
పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా
విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని
సందేహపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు, పందొమ్మిదో
రీలు తరువాత కానీ 'సిరికిన్ చెప్పడు....తరహాలో' ఏనుగు రక్షణకు రాడు.
దేవుడ్ని
నమ్మని గోరాగారు ‘దేవుడు
లేదు’ అనేవాడు. ‘లేదు’ ఏమిటండి ‘లేడు’ అనాలిగా
అంటే ‘అసలు ‘లేని’ వాడు పుంలింగం అయితే ఏమిటి స్త్రీ లింగం అయితే
ఏమిట’ని
ఎదురు ప్రశ్న వేసేవారు. ఆయన వ్యక్తిత్వశోభ ముందు అలా చెల్లిపోయింది. కాకపోతే
ఇప్పుడు బెజవాడ నాస్తిక కేంద్రం వారికి గోరానే దేవుడు. ఆ మాటకొస్తే దేవుళ్ళందరూ
ఇలా అవతరించిన వాళ్ళేనేమో. వాళ్ల వాళ్ల కాలంలో తమ గుణగణాలచేత విఖ్యాతులయిన వాళ్లు
తదనంతర కాలంలో దేవుళ్ళుగా కొలవబడ్డారేమో.
కానీ ఒక
విషయంలో నాకు దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు
కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత
పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో
చర్చ)
‘నేను సర్వవ్యాపితుడిని.
ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని
దేవుడు ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
‘చెట్టులో, పుట్టలో
అంతటా నేనే’ అన్నా
విన్నదెవరు?
చిన్నదో
పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారాయన్ని.
మా
చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి.
అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని
వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ
రూమ్ వుందా?’ అన్నది
ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.
పూర్వం
పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో
తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్
రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి
రద్దీ పెరిగిందంటే పెరగదా!
పోతే, ఈ
దేవుడి సమస్యకు ఒకటే పరిష్కారం.
దేవుడ్ని
నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని
వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద
లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష
మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము
చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం
తగ్గిపోతుంది.
సమాజం
ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు.
నిజానికి మనమే ఆయనకు సమస్య.
NOTE: Courtesy Image Owner
"దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
రిప్లయితొలగించండినమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు."
మొదటిది జరిగితే రెండోది ఆటోమేటిగ్గా జరుగుతుంది. ఎటొచ్చీ మొదటివారు వీధులకెక్కి శబ్దకాలుష్యం చేస్తుంటే రెండోవారు దాన్ని వ్యతిరేకించకా తప్పదు.