12, నవంబర్ 2014, బుధవారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?



మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌  బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన  వాళ్ళు  కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు.  మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌  రాళ్ళు  రోడ్లపై  వెలిసాయి.  ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు  నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు  నమ్ముతారా?? కళ్లతో చూసిందే  నమ్ముతాం  అని వాళ్లంటే మీరేం చేస్తారు?




16 -7-2008 (Note: Courtesy Image Owner)



9 కామెంట్‌లు:

  1. నోస్టాల్జియా పాట Those were the days my friend అని 1960 వ దశాబ్దంలో వచ్చిన పాట గుర్తొచ్చింది.
    మా చిన్నతనంలో మేం పెరిగిన ఇళ్ళు, పరిసరాలు, జీవన విధానం ఇలాగే ఉండేవి. బాగా వర్ణించారు. చివరి వాక్యం మరీ బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీనివాస రావు గారూ, బ్లాగుల్లో రోబోట్లు ఏం వస్తాయి గాని ఆ వెరిఫికేషన్ తీసేద్దురూ.

    రిప్లయితొలగించండి
  3. @ విన్నకోట నరసింహారావు గారికి - 'బ్లాగుల్లో రోబోట్లు ఏం వస్తాయి కానీ ఆ వెరిఫికేషన్ తీసేయమని' రాసారు. రోబోట్లు అనగా ఏమిటి? వాటిని తీసేయడం ఎలా అన్నది కూడా దయచేసి సలహా ఇవ్వండి - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  4. @ విన్నకోట నరసింహారావు గారికి - 'బ్లాగుల్లో రోబోట్లు ఏం వస్తాయి కానీ ఆ వెరిఫికేషన్ తీసేయమని' రాసారు. రోబోట్లు అనగా ఏమిటి? వాటిని తీసేయడం ఎలా అన్నది కూడా దయచేసి సలహా ఇవ్వండి - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  5. శ్రీనివాస రావు గారూ, మీ బ్లాగులో ఏదైనా టపా మీద వ్యాఖ్య పెడదామనుకుంటే ఓ హెచ్చరిక వస్తుంది "మీరు రోబోట్ కాదని నిరూపించండి" అంటూ. నేను అన్నది ఆ రోబోట్ల గురించి.
    దాని కింద ఓ బాక్స్ వస్తుంది - దాంట్లో చిత్ర విచిత్రమైన పదాలు, నెంబర్లు వగైరా వస్తాయి, వాట్లని యధాతధంగా అక్కడ టైపు చెయ్యమని మనల్ని బలవంత పెడతాయి. నేను చెప్పినది ఈ వెరిఫికేషన్ గురించి.
    సాంకేతికంగా దాన్ని ఎలా తీసెయ్యాలో ఆ వెరిఫికేషన్ పెట్టిన మీకే బాగా తెలియాలి. కాని కామెంట్లు వ్రాసేవారికి ఈ వెరిఫికేషన్ మహా చికాకుగా ఉంటుందనేది నిజం. అందుకని దాన్ని తీసెయ్యమని మిమ్మల్ని కోరాను. ఆ పై మీ ఇష్టం.

    రిప్లయితొలగించండి
  6. విన్నకోట నరసింహా రావు గారికి - వేనవేల కృతజ్ఞతలు. ఇందులో ఇంత 'గోల' వున్న విషయం మీరు రాసేదాకా నాకు తెలవదు. ఏదో రాయడం పోస్ట్ చేయడం మినహా 'కామెంట్లు' పెట్టేవారిని ఇంత ఇబ్బంది పెడుతున్నానన్న సంగతి కూడా తెలవదు. నన్ను మన్నించాలి. మీరో సాయం చేసి పెట్టగలరా? ఈ రోబోల గోల వొదిలించుకోవడం ఎలానో దయచేసి సలహా ఇవ్వండి. నమస్కారాలతో - భండారు శ్రీనివాస రావు

    రిప్లయితొలగించండి
  7. భండారు శ్రీనివాస రావు గారూ మీరు కొత్త పోస్ట్ వేసేటప్పుడు New Post ని క్లిక్ చేసే ముందర క్రింద విధంగా ఉంటుంది: Posts and comments నొక్కి
    word verification ని No గ మార్చండి.


    New Post
    Settings › Posts and comments
    Show word verification ?
    No

    word verification -- yes నుండి No గ మార్చండి. మీ ప్రాబ్లం పోతుంది.

    రిప్లయితొలగించండి
  8. నా విన్నపానికి వెంటనే స్పందించి వ్యాఖ్యలకి వర్డ్ వెరిఫికేషన్ తొలగించినందుకు ధన్యవాదాలు శ్రీనివాస రావు గారూ.

    రిప్లయితొలగించండి
  9. @ Rao S Lakkaraju - Dear Shri lakkaraju garu. I followed your advise. There are options like 'Allow readers comments and Dont allow' I marked for 'Allow'. Is it sufficient? I raised this doubt again because, I came across these two options only. There is no'NO' or 'YES' Any how thanks for your kind response.

    రిప్లయితొలగించండి