12, నవంబర్ 2014, బుధవారం

నాయకులు - నమ్మకాలు


(Published by 'SURYA' telugu daily in its edit page on 13-11-2014, Thursday)
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ విడుదలచేసిన 'జన్మభూమి - మా వూరు' పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చేతిలో మైకు పట్టుకుని, మరో చేతిని ప్రజలకు చూపుతూ కానవస్తారు. అందులో విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ దాన్ని పరిశీలనగా చూస్తె చంద్రబాబు నుదుటిపై ఎర్రటి బొట్టు కనిపిస్తుంది. ఆయన్ని చాలా ఏళ్ళుగా తెలిసిన వాళ్ళకు మాత్రం చిత్రంగానే అనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత లేదా ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా గతంలో పాలించిన రోజుల్లో కూడా తన వ్యక్తిగత విశ్వాసాలను ఇంటికే పరిమితం  చేసుకునే వారు. వాస్తు, జాతకం వంటి నమ్మకాలు వున్నా వాటిని బహిరంగంగా బాహాటంగా ప్రదర్శించేవారు కారు. చంద్రబాబు ముఖ్యమంత్రి  అయినందువల్ల నుదుటిపై బొట్టు పెట్టుకోవడం అపరాధం అని చెప్పడం కానీ,  పొరబాటు అని సూత్రీకరించడం కానీ ఈ వ్యాసకర్త  ఉదేశ్యం ఎంతమాత్రంకాదు. లోగడ ఎప్పుడూ  ఇటువంటివాటిని పది మంది ముందు ప్రదర్శించడం ఆయనకు అలవాటులేని పని. అయితే పదేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన అనంతరం కొన్ని నమ్మకాలపట్ల ఆయనకున్న నమ్మకం మరింత పెరిగిందన్నది మాత్రం వాస్తవం.
పదవీ ప్రమాణ స్వీకారాలకు మాత్రమే  ప్రస్తుతం పరిమితం అయివున్న ముహూర్తాలను  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈసారి శాసన సభ తొలి సమావేశం ప్రారంభానికి కూడా విస్తరించారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ విషయాల్లో నాలుగాకులు ఎక్కువే చదివారు. అయితే వాస్తు, ముహూర్తాలు మొదలయిన విషయాల్లో ఆయన యెప్పుడూ గోప్యత పాటించిన దాఖలా లేదు. ఏదిఏమైనా ఇటువంటివన్నీ వ్యక్తిగత నమ్మకాలు. వాటిని తప్పుబట్టి ఎత్తి చూపే హక్కు ఎవ్వరికీ వుండదు. కాకపొతే తమ నమ్మకాలు, విశ్వాసాలు తమ వరకే పరిమితం చేసుకుని తద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా చూసుకోగలిగితే ఎవ్వరూ వారిని  వేలెత్తి చూపే అవకాశం కూడా వుండదు.
దేశ విదేశాల్లో సయితం రాజకీయ నాయకులకు కొన్ని విశ్వాసాలు వుండడం కొత్త విషయం ఏమీ కాదు. హిట్లర్, ముస్సోలినీల కాలంలో కూడా ఇవి వున్నాయి. హిట్లర్ కి సంఖ్యా శాస్త్రం పట్ల నమ్మకం ఎక్కువ. ఏడు అంకె తనకు బాగా కలిసి వస్తుందని విశ్వసించేవారు. అంతే  కాదు యుద్ధ వ్యూహాల విషయంలో కూడా హిట్లర్ జ్యోతిష్కులను సంప్రదించేవాడని  ప్రతీతి. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే జర్మనీ సైన్యాలు ఎలా, ఏ దిక్కుగా కదులుతున్నాయో తెలుసుకోవడానికి మిత్ర దేశాల సైన్యాధిపతులు హిట్లర్ హారోస్కోప్ ని ఆధారం చేసుకునేవారని ఆరోజుల్లో కధలుగా చెప్పుకునేవరకూ వెళ్ళింది.       
అలాగే మరో నియంత ముస్సోలినీ. హిట్లర్ కి మంచి స్నేహితుడు కూడా. అంచేతేనేమో ముస్సోలినీకి కూడా ఈ పట్టింపులు జాస్తి. విమానాల్లో తోటి ప్రయాణీకుల మీద అనుమానం కలిగిందంటే చాలు ఆ విమానం దిగి మరో విమానం ఎక్కేవాడు. తోటి ప్రయాణీకుడి మీద అనుమానం తన ప్రాణాలు తీస్తాడని కాదు. ఆ ప్రయాణీకుడివి పిశాచ నేత్రాలు అన్న సందేహం తోటే.   
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన రొనాల్ద్ రీగన్ గురించి కూడా ఇదే విధమైన ప్రచారం వుంది. వెయిట్ హౌస్ లో ఏదయినా కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు రీగన్, కాలిఫోర్నియాలో వుండే ఒక మహిళను సంప్రదించేవారు. ఆవిడ ప్రెసిడెంట్ రీగన్ జాతక చక్రం చూసి, గ్రహాలూ, వాటి స్థానాలను బట్టి వాటికి  అనుగుణంగా వుండే సలహాలు, సూచనలు ఇచ్చేవారుట. వైట్ హౌస్  నిర్ణయాలు కూడా తదనుగుణంగా మారిపోయేవట. అక్కడ ఇవన్నీ బహిరంగ రహస్యాలు. అలాగే ముందుగా నిర్ణయమైన  ప్రెసిడెంట్ పర్యటనలు, ప్రసంగాలు, విలేకరుల సమావేశాలు సయితం 'ఆ రోజు జాతకరీత్యా  మంచిది కాదు' అనే కారణంతో రద్దయిన సందర్భాలు ఉండేవి.   
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే మాదిరి. ఎలెక్షన్ జరిగే రోజున ఆయన ఎన్ని పనులున్నా మానుకుని బాస్కెట్ బాల్ ఆట ఆడతారు. అలా చేస్తే ఎన్నికలలో విజయం వరిస్తుందని ఒబామా నమ్మకం. కాకపొతే ఒక్కసారి మాత్రం ఈ మంత్రం పనిచేయలేదు. న్యూ హాంప్ షైర్  ప్రైమరీ ఎలెక్షన్ రోజున బరాక్ ఒబామా బాస్కెట్ బాల్ ఆడారు కానీ, ఫలితం మాత్రం వేరేగా వచ్చింది. అయినా సరే ఆయన మాత్రం తన నమ్మకాన్ని వొదులుకోలేదు.
కమ్యూనిస్ట్ చైనాలో కూడా ఈ నమ్మకాలకు కొదవలేదు. అక్కడి వారికి ఎనిమిది సంఖ్య అదృష్టం తెస్తుందని విశ్వాసం. 2008 లో బీజింగులో జరిగిన ఒలింపిక్స్ పోటీల ప్రారంభ ముహూర్తాన్ని  ఆగస్టు ఎనిమిదో తేదీ, రాత్రి ఎనిమిది గంటలకు నిర్ణయించడం వెనుక ఎనిమిది అంకె మీదగల మమకారమే అని నోళ్ళు నొక్కుకున్న వాళ్ళు లేకపోలేదు.
ఇక మన దేశం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి విశ్వాసాలకు పుట్టిల్లు అనే పేరు పడిన దేశం మనది.
బీహారు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  రాజకీయంగా కలిసి రావడంలేదని ఇంట్లో వున్న స్విమ్మింగ్ పూల్ ని  రాత్రికి రాత్రే ఇసుకతో  పూడ్పించారు.
ఈ మధ్య బీహార్ లో జరిగిన ఉపఎన్నికల సభల్లో లాలూ మహాశయులు ఈ నమ్మకాలపై తనకున్న నమ్మకాన్ని మరో రకంగా ప్రదర్శించే ప్రయత్నం చేసారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం మంచిదికాదని అయన సెలవిచ్చారు.  ఉత్తరాంచల్ లో ఆకస్మిక వరదల్లో హైదరాబాదు విద్యార్ధుల మరణానికి  ఆ ముహూర్తమే కారణమని ముడిపెట్టారు. మోడీ నేపాల్ పర్యటనకు వెళ్ళగానే అక్కడకూడా వరదలు వచ్చిన విషయాన్ని లాలూ ప్రస్తావించారు.
ఇక చత్తీస్ ఘర్  మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకే వేసారు. ఓసారి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రంలో 'కాంగ్రెసేతర అభ్యర్ధి గుర్తుపై మీట నొక్కితే ఎలెక్ట్రిక్ షాక్ కొడుతుంద'ని గిరిజనులను బెదరగొట్టారు.     
కర్ణాటకలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ నమ్మకాలు మెండుగా వున్నాయి. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు చొక్కా మీద చొక్కా అలా ఎనిమిది చొక్కాలు వేసుకుని వెడితే మంచిదనే నమ్మకంతో ఒక నాయకుడు ప్రతి ఎన్నికలో ఇదే సూత్రాన్ని విధిగా పాటిస్తూ వస్తున్నారు.


అందుకే, తెలివితేటలతో పుట్టడం కంటే అదృష్టంతో పుట్టడం మంచిదని డాక్టర్ గో కెంగ్ స్వీ ఏనాడో చెప్పారు. (12-11-2014)

1 కామెంట్‌:

  1. నమ్మకాలు, జాతకాలు అంటే హిట్లర్ మీద చదివిన జోకొకటి గుర్తొస్తోంది.
    హిట్లర్ జ్యోతిష్కుల్ని పిలిపించి తను ఏ రోజు చనిపోతాడో చెప్పమని అడిగాడట. వాళ్ళు కొంచెం ఆలోచించి యూదుల పండగ రోజున చనిపోతారు అని చెప్పారట. హిట్లర్ కి అది నచ్చలేదు. నేను యూదుల పండగ నాడు చనిపోవటమేమిటి, మరోసారి జాగ్రత్తగా చూసి చెప్పండి అని మండిపడ్డాడట. అయ్యా, మేము చెప్పేది నిజమే, మీరు ఏ రోజున చనిపోయినా అది యూదులకి పండగ రోజే అవుతుంది కదా అని జ్యోతిష్కులు మనవి చేస్కున్నారట.

    రిప్లయితొలగించండి