30, అక్టోబర్ 2014, గురువారం

స్విస్ బ్యాంకుల కధాకమామిషు

(Published in 'SURYA' daily in its Edit page on 31-10- 2014, SUNDAY)

కధ ముగిసింది. కానీ మళ్ళీ  మొదలయింది.
స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న 'కుబేరుల జాబితా' వంద రోజుల్లో బయట పెడతా అన్న బీజేపీ నాయకత్వం అన్న మాట కాస్త అటూ ఇటూగా నిలబెట్టుకుంది. సుప్రీం ఆదేశం ప్రకారమో, ఇచ్చిన మాట ప్రకారమో మొత్తం మీద ఆ జాబితా సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టు చేతిలో పెట్టి చేతులు కడిగేసుకుంది. సుప్రీం కూడా దాన్ని తెరిచి చూడకుండానే దర్యాప్తు సంస్థ
'సిట్' అధికారులకి అందించి  మార్చిలోగా దర్యాప్తు పూర్తిచేయమని ఆదేశించింది. 'ఆ జాబితా కొత్తదేమీ కాదు, పరమ  పాతదే' అని 'సిట్' చైర్మన్ స్వయంగా చెప్పినట్టు మీడియాలో వచ్చింది. మన మధ్యనే ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా డబ్బుని విదేశాల్లోని బ్యాంకులకు తరలించిన వారెవ్వరో తేలిపోతుందని, తెలిసిపోతుందని దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లినట్టయింది. కొండను తవ్వారు, కానీ ఎలుక తోక కూడా కనబడడం లేదు. మరి ఎందుకింత లాయలాస పడ్డట్టొ అర్ధం కాని విషయం. ఇక మరికొన్నాళ్ళపాటు  ఊహాగానాలు తప్పవు. ఆ ఊహాగానాలపై రాజకీయ చర్చోపచర్చలకు కొదవుండదు.  



     
జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవారికి ఓ దృశ్యం గుర్తుండేవుంటుంది. 'బాండ్ ...జేమ్స్ బాండ్' అని చెప్పుకునే ఈ హాలీవుడ్ గూఢచారి, స్పెయిన్ లో ఒక స్విస్ బ్యాంక్ కి  వెడతాడు. బ్యాంకర్ ని కలిసేముందు అక్కడి భద్రతా సిబ్బంది జేమ్స్ బాండ్ ను పూర్తిగా జేబులూ అవీ తడిమి చూసిన తరువాతనే  లోపలకు పంపుతారు.  డా విన్సీ కోడ్ సినిమాలో రోబో హస్తంతో  ఒక త్రిభుజాకారపు తాళం చెవితో  రహస్యంగా గోడలో  దాచివుంచిన స్విస్ బాంక్  సేఫ్ లాకర్ తెరవడం కనిపిస్తుంది.
అయితే స్విస్ బ్యాంకుల్లో నిజానికి ఇలాటి దృశ్యాలు  ఏవీ కనబడవు. అవన్నీ సినిమాలకోసం చేసిన కల్పనలు. అలాగే స్విస్ బ్యాంక్  ఖాతాలు గురించి కూడా  ఎన్నెన్నో అభూత కల్పనలు ప్రచారంలో వున్నాయి. స్విస్ బ్యాంకుల్లో అన్ని బ్యాంకుల  మాదిరిగానే భద్రతా ఏర్పాట్లు వుంటాయి. కానీ సినిమాల్లో చూపించినట్టు రోబోలు గట్రా  కనబడవు. ఖాతాదారులు బ్యాంకుకు  వచ్చినప్పుడు నఖశిఖ పర్యంతం తడిమిచూడడం కూడా ఈ కల్పనల్లో ఒకటి.    
స్విస్ బ్యాంక్ ఖాతాదారులందరూ  పన్నులు ఎగ్గొట్టి  సొమ్ములు కూడబెట్టినవారనే అపప్రధ వుంది. ఆ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వాళ్ళందరూ   అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించిన నేరస్తులో లేదా ప్రభుత్వ అధికారులనో అపోహ వుంది.  కోటికి పడగలెత్తిన  వాళ్ళే ఆ బ్యాంకుల గుమ్మం తొక్కగలరనే సందేహాలు  వున్నాయి. అత్యంత సంపన్నులయిన వారికి తమ మాజీ భార్యలతో డబ్బు లావాదేవీల చీకాకులు ఎక్కువ. అలాటి వారు విడాకులు తీసుకున్న తమ మాజీ భార్యల చేతికి చిక్కకూడదనే ఉద్దేశ్యంతో స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం కద్దు. వీళ్ళే కాదు ఆ బ్యాంకుల  ఖాతాదారుల్లో  సాధారణ స్విస్ పౌరులు కూడా వుంటారు. ఈ బ్యాంకుల పట్ల మోజు పెరగడానికి మరో కారణం వుంది. అనేక దేశాల్లో ఈనాటి పరిస్తితులు రేపు వుండవు. అస్తిర ప్రభుత్వాలు రాజ్యం ఏలే దేశాల్లోని కుబేర స్వాములు, తమ డబ్బుకు స్వదేశంలో  భరోసా వుండదన్న అభద్రతాభావంతో స్విస్ బ్యాంకుల వైపు చూస్తుంటారు. కారణం ఒక్కటే. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఇక గుండె మీద చేయివేసుకుని నిద్రపోవచ్చు. 'ఎక్కడిదీ డబ్బు' అని అడిగేవారుండరు.  అడిగినా చెప్పే నాధులు ఆ బ్యాంకుల్లో వుండరు. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు  వడ్డీ రాదు. నిజమే. కానీ అసలుకు మోసం రాదు. అదీ సంగతి.

'భద్రత, గోప్యత' అనే రెండే రెండు  సూత్రాల మీద ఆధారపడి నడుస్తున్న స్విస్ బ్యాంకుల చరిత్ర ఈనాటిది కాదు. ఫ్రెంచ్ విప్లవం కాలంలో సంపన్న వర్గాల వారు దేశాన్ని విడిచి పారిపోయేటప్పుడు తాము కూడబెట్టుకున్న డబ్బును పదిలంగా దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు  ఉపయోగపడ్డాయి. ప్రధమ ప్రపంచ సంగ్రామం, దరిమిలా ప్రపంచ దేశాలను కమ్ముకున్న తీవ్ర  ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో, ఆర్ధికంగా బాగా చితికిపోయిన తమ ఆర్ధిక వ్యవస్థలకు  ఊపిరి పోయడానికి జర్మనీ, ఫ్రాన్స్ ప్రభుత్వాలకు స్విస్ బ్యాంకుల్లో సంపన్నులు దాచుకున్న సొమ్ముపై కన్ను పడింది. 1932లో పారిస్ లోని స్విస్ బ్యాంకు శాఖపై ఫ్రెంచ్ అధికారులు దాడి చేసి స్వదేశంలో పన్నులు ఎగవేసి స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వ్యక్తుల ఖాతాలను పట్టుకున్నాయి. అలా ఆ రోజుల్లోనే ఆ విధంగా పట్టుపడ్డ డబ్బు కొన్ని కోట్ల ఫ్రాంకులు.   దరిమిలా జర్మనీ  కూడా ఇదే పద్దతి మరింత కఠినంగా అనుసరించింది. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నట్టు తెలిస్తే అటువంటివారికి ఏకంగా మరణ శిక్ష విధించాలని చట్టం చేసింది. చట్టం చేసి చేతులు దులుపుకోకుండా అటువంటి వారు పట్టుపడ్డప్పుడు ఆ శిక్షలను  అమలుచేసి కూడా  చూపించింది.
అయితే స్విట్జర్లాండ్ ఈ బెదిరింపులకు అదరలేదు,  బెదరలేదు. రెండు ప్రపంచ యుద్దాల కాలంలో కూడా  నిష్టగా పాటిస్తూ వచ్చిన స్విస్ బ్యాంకుల వ్యాపార సూత్రాలనే మరింత పటిష్టంగా అమలుచేయాలని  నిర్ణయించింది. ఫ్రాన్స్ జర్మనీల చర్యలను  పట్టించుకోకపోవడమే కాకుండా 1934 లో బ్యాంకు ఖాతాల  గోప్యతకు మరింత చట్టబద్దత కల్పిస్తూ ఒక శాసనం చేసింది. బ్యాంకు ఖాతాదారుడు మినహా అతడి ఖాతాకు సంబంధించిన  ఎలాటి వివరాలను మూడో వ్యక్తికి తెలపాల్సిన అవసరం లేకుండా ఈ  చట్టం బ్యాంకులకు అధికారం ఇచ్చింది.
ఈ నిబంధన పన్నుఎగవేత దారులకు బాగా ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో 1984 లో స్విట్జర్లాండ్ రిఫరెండం నిర్వహించింది. బ్యాంకు ఖాతాల వివరాలను పన్ను వసూలుచేసే అధికారులకు బహిర్గతం చేయాలా అనే అంశంపై నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చారు. 'స్విస్ బ్యాంకుల గోప్యత నిబందనను కొనసాగించాల్సిందే' అని 73 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమంలో - తొంభయ్యవ దశకం నాటికి  ఈ నిబంధన కారణంగా అనేక ఆర్ధిక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఈ వేడి అటూ ఇటూ తిరిగి అమెరికాను కూడా తాకింది. అమెరికా కన్నెర్ర చేయడంతో, పన్నులను ఎగవేసి స్విస్ బ్యాంకుల్లో  డబ్బు దాచుకున్న అమెరికా పౌరుల వివరాలను ఆ దేశానికి ఇవ్వడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంగీకరించింది. ఇది జరిగింది 2008 లో.
ఆ తరువాత, స్విట్జర్లాండ్ ఆర్ధిక సహకార అభివృద్ధి సంస్థతో ఒక వొప్పందానికి వచ్చింది. ఆ ఆ సంస్థకు చెందిన సభ్య దేశాలకు తమ బ్యాంకుల్లోని ఖాతాల  వివరాలను అందచేయడానికి  ఆ బ్యాంక్ వొప్పుకుంది. ఈ సభ్య దేశాల్లో భారత దేశం ఉందా లేదా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటె ఈ దిశగా అడిగినవాళ్ళూ లేరు, జవాబు చెప్పిన వాళ్ళూ లేరు. వీళ్ళిద్దరూ ఒకవేళ వున్నా ఆ సమాచారం జనాలకు తెలిసే వీలూ లేదు.
ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓమారయినా మోరల్’ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే 'ఏది తప్పో ఏది ఒప్పో' చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు కూడా వెనుక ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక ఓ పక్క తామే తప్పులు చేస్తూ తమ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేకదాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. 'ఎంత సంపాదించావు' అన్నది ప్రధానం కానీ 'ఎలా' అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది, భయపడాల్సింది  మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి. నల్ల డబ్బును గురించి కాదు.
(30-10-2014)

NOTE : Cartoon Courtesy "Modi Bharosa.com"

1 కామెంట్‌:



  1. ఎక్కువ ,అంటే లక్షలకోట్ల డబ్బేమీ బయటపడదు.కొద్ది వేలకోట్లు బయటపడితే పడవచ్చునేమో!ఈ పాటికే చాలాడబ్బు ఇతర Tax havens కితరలిపోయివుంటుంది. మీరన్నట్టు అంత ధనమూ చట్టవిరుద్ధమైనది కాకపోవచ్చును. బయటపడ్డ ధనము తీసుకు రాడానికి ఎన్నిపాట్లు,ఎంతకాలం పట్టుతుందో!

    రిప్లయితొలగించండి