8, అక్టోబర్ 2014, బుధవారం

సదస్సులతో సాధించేది ఏమిటి?



హైదరాబాదు  నగరానికి అంతర్జాతీయ సదస్సులు కొత్తకాదు. కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్ర రాజధానిగా హైదరాబాదు నగరం  మొదటిసారిగా ఒక అంతర్జాతీయ సదస్సుకు - 'మెట్రోపాలిస్' మేయర్ల సదస్సుకు ఆతిధ్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు కూడా ఈ సదస్సు నిర్వహణను  ప్రతిష్టామకంగా తీసుకుని  ఏర్పాట్లు చేసినట్టుగా కానవస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. తెలంగాణా కొత్త రాష్ట్రం. డానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నప్పటి నుంచి పధక రచనలు చేస్తూనే వున్నారు. ఇప్పుడీ అంతర్జాతీయ సదస్సును ఉపయోగించుకుని తెలంగాణా రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఏర్పాట్లు చేశారని భావించడానికి అవకాశాలు వున్నాయి. తెలంగాణా సంస్కృతిని, ఆతిధ్యరంగంలో తెలంగాణాకు వున్న ఘన సంప్రదాయాలను విదేశీయులకు ప్రదర్శించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం ప్రస్పుటంగా సదస్సు మొదలయిన మొదటి రోజునే ప్రస్పుటంగా కానవచ్చింది. తెలంగాణా చరిత్ర సంస్కృతీ సంప్రదాయాలను, కళారూపాలను  ప్రతిబింబించే  'ఆర్ట్ ఎట్ తెలంగాణా' అనే  పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని సదస్సు అధ్యక్షుడు జీన్ పాల్ హంకాన్ కు అందచేసారు.  1914 నుంచి 2014 వరకు వందమంది తెలంగాణా కళాకారుల వివరాలు ఇందులో పొందుపరిచారు.  ఈ సదస్సుకు ప్రత్యెక అతిధిగా  హాజరయిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్  కలాం ఈ పుస్తకం పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించడం ఓ విశేషం. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కళాఖండాలు కూడా విదేశీయులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. అబ్దుల్ కలాం  కొద్దిసేపు ఆ చిత్రాలను పరిశీలనగా చూస్తూ అక్కడే గడిపారు.
ఈ క్రమంలోనే,  గాంధీ జయంతి మరుసటి రోజు నుంచి తెలంగాణలో ప్రారంభించిన కల్లు దుకాణాలకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలని ఉద్దేశించారేమో  తెలియదు కానీ, సమావేశం మందిరంలో ప్రత్యేకించి కల్లు కేంద్రం ఏర్పాటు చేసి  తెలంగాణా కల్లును  విదేశీయులకు కూడా రుచి చూపించారు.
తదనంతరం, 'అందరికీ నగరాలు' అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న అబ్దుల్ కలాం - నగరాలు కేవలం అందంగా వుంటే సరిపోదనీ, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే పొర సమాజానికి అవి  ఉపయుక్తంగా ఉంటాయని  అభిప్రాయ పడ్డారు. ఇటీవల రాజకీయ నాయకుల నోట ప్రముఖంగా వినబడుతున్న 'స్మార్ట్ సిటీ' లను గురించి ప్రస్తావిస్తూ, 'స్మార్ట్ సిటీలయినా, ఓవర్ స్మార్ట్ సిటీలయినా జనం ఆరోగ్యంగా  జీవించేందుకు అనువుగా వుండాల'ని పేర్కొన్నారు. 'అద్భుతమైన సమ్మిళిత సంస్కృతికి ఆటపట్టుగా నిలచిన హైదరాబాదు నగరం, పాత సంస్కృతిని పరిరక్షించుకుంటూనే మరో పక్క శాటిలైట్  టౌన్ షిప్ ల నిర్మాణానికి నడుం బిగించాలని ఉద్బోధించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన  గవర్నర్  శ్రీ నరసింహన్,  ముఖ్యమంత్రి కేసీయార్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వలసలతో నగరాలపై పెరిగిపోతున్న  భారానికి తగినట్టుగా వసతులను కూడా  పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు అందుతాయన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ప్రసంగిస్తూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణా జనాభాలో దాదాపు నలభయ్  శాతం పట్టణాల్లోనే ఉంటున్నారని చెప్పారు. హైదరాబాదు సమగ్రాభివృద్ధితో పాటు ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి  ప్రణాలికలు సిద్దం చేస్తున్నట్టు చెప్పారు.  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయగలిగితేనే నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించగలదని చెప్పారు.  
 సరే! అతిధుల ప్రసంగాలు, ఆతిధ్య ప్రభుత్వంపై వారి ప్రసంశలు ఇటువంటి సదస్సులలో షరా మామూలే. వివిధ దేశాలకు చెందిన మేయర్లు, అక్కడి నిపుణులు ప్రసంగాలతో, పత్రాల సమర్పణతో సదస్సు నిర్విఘ్నంగా సాగిపోతుంది. అంతటితో  సరా! వీటివల్ల సాధించేది ఏమైనా ఉందా అనేదే శేష ప్రశ్న.


(క్రికెట్ జట్టుకాదు, సదస్సు భద్రత కోసం తెలంగాణా పోలీసులు)  

ఎటువంటి నేపధ్యంలో ఈ అంతర్జాతీయ సదస్సు హైదరాబాదులో జరుగుతోంది అనేది కూడా ప్రాముఖ్యత కలిగిన అంశమే. రాష్ట్రం రెండుగా విడిపోయి ఎన్నాళ్ళో కాలేదు. హైదరాబాదు నగరానికి నాలుగువందల సంవత్సరాల పైచిలుకు చరిత్ర వుంది  కానీ కొత్తగా ఊపిరిపోసుకున్న తెలంగాణా రాష్ట్రం ఇంకా పసికూనే. ఒక పక్క కరెంటు కష్టాలు, మరోపక్క ఆ కష్టాలను తీర్చడానికి కొత్త ప్రభుత్వం పడుతున్న కష్టాలు. అన్నీ కుదురుగా వున్నప్పుడు జరుపుకోవాల్సిన ఇలాటి వేడుకలు ఇంకా ఏదీ సరిగా కుదురుకోక ముందే జరుగుతూ వుండడం కొంత ఇబ్బందే అయినా కాలంతో పరుగులు పెట్టి సదస్సు జయప్రదం చేయడానికి సంబంధిత అధికారులు, సిబ్బంది   చాలా శ్రమ పడ్డారు. ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు, క్రీడోత్సవాలు జరిగినప్పుడు కొన్ని నిధులు అదనంగా అందుతాయని అంటారు. మరిప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ నగరాన్ని 'పెళ్ళిల్లు' మాదిరిగా అందంగా తయారు చేసారు. రోడ్లు అన్నీ కాకపోయినా కొన్నయినా  కొత్త హంగులను సమకూర్చుకున్నాయి. ఈ సదస్సుకు హాజరయ్యేవారి భద్రత బాధ్యతలు నిర్వహించే పోలీసు సిబ్బంది ఏకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త యూనిఫారాల్తో కనబడుతున్నారు. వారి చేతుల్లో  అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల ప్రతినిధులకు ఇవన్నీ వింత కలిగించకపోవచ్చు కాని, అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలవారు ఈ ఏర్పాట్లు చూసి కొంత ముగ్ధులు కావచ్చు. వాళ్ళ సంగతి సరే! ఇంత పెద్ద సదస్సు నగరంలో జరుగుతుంటే స్థానిక మీడియాను  సదస్సు ప్రాంగణానికి ఓ మోస్తరు దూరం వరకే  అనుమతించే అంశం కొంత కలకలం రేపుతోంది.
ఈ ఏర్పాట్లనన్నింటినీ నగర పౌరులు మాత్రం మౌనంగా గమనిస్తున్నారు. ఎవరో వస్తారని, ఏదో చూస్తారని చేస్తున్న ఈ సదుపాయాలు నగరంలో శాశ్వితంగా లభించే  కాలంకోసం వారు ఎదురు చూస్తున్నారు. రంగవల్లుల మాదిరిగా అందంగా తీర్చిదిద్దిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చట కాకుండా కనీసం కొంతకాలం అయినా మన్నితే చాలని ఆశ పడుతున్నారు. నగరాలు ఎదుర్కునే సమస్యలు ప్రపంచంలో ఎక్కడయినా ఒకే మాదిరిగా వుంటాయి. ఒక్కొక్కచోట అనుసరించే పరిష్కార మార్గాలు మాత్రం విభిన్నంగా వుంటాయి. నలుగురు  కలిసికూర్చుని మాట్లాడుకునేటప్పుడు  ఇటువంటి పరిష్కార మార్గాల అన్వేషణపై దృష్టి సారిస్తే కొంత ఉపయోగం వుంటుంది. వేర్వేరు చోట్ల అనుసరించే విధానాలు స్థానిక సమస్యలకు అన్వయం కుదిరేలా ఆలోచన చేయగలిగితే మరికొంత ప్రయోజనం వుంటుంది. లేకపోతే, విందులు వినోదాలు, ప్రసంగాలు, ప్రశంశలు, ప్రచారాలు, ఆర్భాటాలు వీటితోనే ఈ సదస్సులకు 'శుభం' కార్డు పడుతుంది.   (08-10-2014)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి