పనికోసం వెళ్ళిన అతడికి
యజమాని గొడ్డలి చేతికి ఇచ్చి చెట్ల మొద్దులు నరికే పని వొప్పచెప్పాడు. గిట్టుబాటు
అయ్యే కూలీ కూడా బాగానే ఉండడంతో అతగాడు ఉత్సాహంగా మొదటి రోజునే ఇరవై మొద్దులు నరికేసాడు. 'బాగా చేసావ్' అని యజమాని
మెచ్చుకున్నాడు. ముందు చెప్పిన దానికన్నా ఎక్కువ కూలీ అతడి చేతిలో పెట్టాడు.
మరునాడు రెట్టించిన
ఉత్శాహంతో అతడు ఎక్కువ మొద్దులు నరికి కొట్టి యజమాని మెప్పుతో పాటు మరిన్ని డబ్బులు
సంపాదించాలని అనుకున్నాడు. కానీ రోజల్లా కష్టపడ్డా పదిహేను మొద్దులే నరకగలిగాడు. మూడో
రోజు పది మొద్దులు కొట్టేసరికే ప్రాణాలు
ఠావులు తప్పినంత పనయింది. ఆ సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. కారణం అంతుపట్టలేదు కానీ కంగారు పెరిగిపోయింది.
యజమాని దగ్గరకు వెళ్లి
చెప్పుకున్నాడు, 'వొంట్లో సత్తువ తగ్గిపోతోంది, మునపటిలా పనిచేయలేని నిస్సత్తువ
ఆవరిస్తోంది, కారణం అర్ధం కావడం లేదు' అని.
అంతా విని యజమాని ఒకే ఒక
ప్రశ్న అడిగాడు, 'గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళయిందని'
'పదును పెట్టడమా! అంత తీరిక
ఏది ? పొద్దస్తమానం చెట్ల మానులు నరకడంతోనే సరిపోతోంది'
అతడే
కాదు మనలో చాలామందిమి అదే చేస్తాం. గానుగెద్దులా పని చేయడం ఒక్కటే కాదు మధ్య మధ్య
కాసింత విశ్రాంతి తీసుకుంటూ వుండాలి. 'చేసే పనిని మరింత బాగా ఎలా చేయొచ్చు' అని ఆలొచిస్తూ
వుండాలి. వీలయితే కాస్త ధ్యానం, యోగం చేస్తూ వుండాలి. స్టీఫెన్ కోవే అన్నట్టు, 'పదును' పెట్టే తీరిక
చేసుకోలేకపోతే, చెట్లు కొట్టేవాడి కధలో మాదిరి మనలో నిస్సత్తువ పెరిగిపోతుంది. పనిలో పాటవం
తగ్గిపోతుంది.
(ఒక
ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)
NOTE: Courtesy Image Owner
పదును పెట్టటానికి విశ్రాంతితో సామ్యం బాగాలేదు.
రిప్లయితొలగించండిపదును పెట్టటానికి సామ్యం నైపుణ్యాన్ని మెఱుగుపరుచుకోవటంతో ఉంది.