10, అక్టోబర్ 2014, శుక్రవారం

అవును కదా!



ఎదుగుదలలో కూడా ఇబ్బందులు వుంటాయి. అభివృద్ధిలో కూడా కొత్తసమస్యలు పుట్టుకొస్తాయి. ఒక రహదారిని బాగుచేయాలని అనుకుంటే కొన్నాళ్ళు ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తప్పవు. తప్పవు కదా అని రోడ్డు బాగుచేయకుండా అలాగే  వొదిలేస్తే కుదరదు కదా. అలాగే నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకు రావడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోగలిగితేనే సకాలంలో అనుకున్న లక్ష్యాలను సాధించడం వీలుపడుతుంది. అలాకాకుండా సమస్యలను పక్కన బెట్టి అభివృద్ధి సాధించాలనుకుంటే అది అరకొర ప్రయత్నమే అవుతుంది. ఉదాహరణకు హైదరాబాదులో రహదారుల విస్తరణ కార్యక్రమం తీసుకుంటే బహుశా మరే ఇతర నగరంలో లేనట్టుగా ఈ కార్యక్రమాన్ని ఈ నగరంలో పెద్దఎత్తున చేపట్టారు. అనేక ప్రధాన రహదారులు చాలా విశాలమైన రూపును సంతరించుకున్నాయి. అయితే ఈ క్రమంలో జరిగిన పొరబాట్లవల్ల విస్తరణ పధకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది. మూడునాలుగు వరసలుగా వాహనాలు పోగలిగిన తీరులో విస్తరించిన రహదారులు హఠాత్తుగా  కుంచించుకు పోయి ఒకటి రెండు వరసలకే పరిమితమయిపోవడం అనేక చోట్ల కానవస్తుంది. అంతవరకూ సజావుగా సాగిన వాహనాల కదలికకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడినట్టు అవుతుంది. వీటికి కారణం రోడ్ల విస్తరణలో ఎదురయిన న్యాయపరమయిన చిక్కులు కావచ్చు మరో మరో సహేతుక కారణం కావచ్చు. కారణం ఏదైనా విస్తరణ ప్రయోజనం ఆ దారిలో లేకుండా పోయినట్టే. 


ముంబై సంగతి చూడండి. అక్కడి రోడ్లు హైదరాబాదుతో పోల్చి చూస్తె వెడల్పులో తక్కువే కావచ్చు. కానీ వున్నట్టుండి కుంచించుకుపోయే అవకాశం లేనందువల్ల కాస్త వేగం మందగించినా వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్ళే అవకాశాలు అక్కడ వున్నాయి. మన దగ్గర అలాకాదు, వీలున్న చోట కుందేలు పరుగు, లేనిచోట  తాబేలు నడక.  సరయిన ప్రణాలికలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడితే ఎలాటి చిక్కులు ఎదురవుతాయో అన్నదానికి హైదరాబాదు రోడ్ల విస్తరణ కార్యక్రమం సరైన ఉదాహరణ. (10-10-2014)

1 కామెంట్‌:

  1. ఎంత insult తాబేళ్ళతో పోలుస్తారా?
    అవి మా నత్తలకన్నా గొప్పవా?
    మీ హైదరాబాదు కార్లకన్నా తీసిపోయాయా?
    ఆయ్ఁ?

    రిప్లయితొలగించండి