7, సెప్టెంబర్ 2014, ఆదివారం

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. ప్రస్తుతం జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడే వారికి తక్షణ వైద్యసాయం అందించే పధకం అమల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
తీరికసమయాల్లో ఇంగ్లీష్ లో రాసుకున్న జ్ఞాపకాల్లో  కొన్నింటిని ఏరి పోస్ట్ చేస్తున్నాను. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఉద్దేశ్యం)    
ఖమ్మంలోని , మామిళ్ళగూడెంలో కట్టుకున్న మా కొత్త ఇంటి గృహప్రవేశం 1950 లో జరిగింది. పూజా పునస్కారాలు రోజల్లా సాగాయి. అసలు గృహ ప్రవేశం అర్ధరాత్రో తెల్లవారు ఝామునో జరిగింది. మేము అప్పటివరకు వుంటున్న అద్దె ఇంటినుంచి మేళ తాళాలతో  వూరేగింపుగా బయలుదేరి కొత్త ఇంటికి వెళ్ళాము. వెంట తీసుకు వెళ్ళిన కపిల ఆవుని ఇల్లంతా తిప్పి, అది  పేడ వేసేవరకు లోపలే వుంచారు. కొత్త ఇంటిలో ఆవు పేడ  వేస్తె శుభప్రదమని ఓ నమ్మకం. ఇంటి వాకిలిపై బూడిద గుమ్మడి కాయను వేళ్ళాడదీశారు. పూజ బాగా జరిగింది. చుట్టపక్కాలతో కొత్త ఇల్లు పెళ్ళిల్లు  మాదిరిగా కళ కళ లాడింది. వూరబంతి పెట్టిన గుర్తు. అంటే వూరిలో తెలిసినవారినీ, బీదాబిక్కీని పిలిచి భోజనాలు పెట్టడం అన్నమాట. కొత్త గడపలో ఎన్ని విస్తళ్ళు లేస్తే అంత మంచిదనేవాళ్ళు. 
1950  వ సంవత్సరంలో ఖమ్మంలోని గవర్న్ మెంట్   హై స్కూల్ లో చేరాను. నన్ను ఐదో క్లాసులో చేర్చుకున్నారు.  కాకపొతే, మాది బ్రాంచ్ స్కూలు. మెయిన్ స్కూలుకు కొంత ఎడంగా వుండేది. ఆ రోజుల్లో తాలూకా మొత్తానికి ఒకే ఒక  హై స్కూలు, అదీ ఖమ్మంలో వున్న మా స్కూలే. మిగిలినవన్నీ మిడిల్ స్కూళ్ళు.
మేముండే మామిళ్ళ గూడెంలో హై స్కూలుకు వెళ్ళేవాళ్ళం  మొత్తం పదిమందిమి. పొద్దున్న తొమ్మిదికల్లా టంచనుగా నడుచుకుంటూ స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూలుకు వెళ్లి సాయంత్రం అయిదుకు ఇళ్లకు చేరేవాళ్ళం. 
మా ఇల్లు వూరికి దూరంగా పొలిమేరల్లో వుండేది.(ఇప్పుడది ఖమ్మంలో పెద్ద సెంటరు) అగ్గిపెట్టె కావాలన్నా కిలోమీటరు నడిచి వెళ్ళాలి. సరయిన రోడ్డు కాదుకదా దారిమధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు ఉండేవి.  వీధిలో అక్కడక్కడా కర్ర గుంజలు పాతి వాటికి వీధి దీపాలు తగిలించేవాళ్ళు.  ఇంట్లో పెద్దపిల్లాడిని కావడంతో చిన్నా చితకా పనులన్నీ నాపైనే పడేవి. ఆరోజుల్లో మా చుట్టపక్కాలు  అందరికంటే మామిళ్ళగూడెంలో ముందు కట్టింది మా ఇల్లే. 
ఖమ్మానికి ఇరుగుపొరుగు గ్రామాలనుంచి బస్సులు నడిచేవి. రైలు సౌకర్యం ఎప్పటినుంచో వుంది.

(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి