8, సెప్టెంబర్ 2014, సోమవారం

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు - 2


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావుగారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు)  


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు) 

"ఖమ్మంలో వున్న సర్కారు దవాఖానాలో ఒకే ఒక్క డాక్టర్ వుండేవాడు. వూరిమొత్తంలో మరో ఇద్దరు క్వాలిఫయిడ్ డాక్టర్లతో పాటు అయిదుగురు ఆర్ ఎం పీలు వుండేవారు. 
వస్తువులు కొనుక్కోవాలన్నా, కోర్టు పనులు పడ్డా, వైద్యం కోసమయినా చుట్టుపక్కల వూళ్లల్లో వుండే మా చుట్టాలు, తెలిసిన వాళ్ళు  ఖమ్మం వస్తుండేవారు. మా ఇల్లు పెద్దది కావడం వల్ల, అల్లా వచ్చినవాళ్ళు నేరుగా మా ఇంట్లో దిగేవాళ్ళు. ఒక్కోసారి రోజుల తరబడి వుండిపోయేవారు. దానికి తోడు  మా నాన్న రాజకీయాల్లో తిరుగుతూ వుండడం వల్ల ఆయన అనుయాయులు, అనుచరులు, నాయకులు ఇంటికి రావడం ఆనవాయితీగా మారింది. రోజూ పదిమందికి తక్కువ కాకుండా ఇంట్లో భోంచేసేవారు. ఇంట్లో పెద్ద పిల్ల వాడిని నేనే. దాంతో ఇంటికి వచ్చే వాళ్ళ పనులు కూడా నేనే చక్కపెట్టాల్సిన పరిస్తితి. అంటే మంచి నీళ్ళు అందించడం, సిగరెట్లు తెచ్చిపెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయించడం, పక్కలు వేయించడంవంటి పనులన్నమాట. 
1949 లో నా చెల్లెలు  లలిత   పుట్టింది. కానీ ఎక్కువ కాలం బతక లేదు. మా తాతగారి వూరు కంభంపాడులో 1954 లో చనిపోయింది. జబ్బుతో వున్న మా తాతయ్య భండారు రాఘవరావు గారిని చూడడానికి మా అమ్మ పిల్లలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళింది. నేను ఖమ్మంలోనే వుండిపోయాను. 
ఆ పల్లెటూళ్ళో ఎందుకో ఒక రోజు వున్నట్టుండి లలితకు వొళ్ళు పెట్లిపోయేలా  బాగా జ్వరం రావడం, కోమాలోకి వెళ్లడం, మరునాడే చనిపోవడం అంతా  గంటల్లో జరిగిపోయింది. మా నాన్న అప్పుడు హైదరాబాదులో వున్నారు. 
లలిత  చనిపోయింది రాత్రిపూట. కబురు అందించడానికి యే సౌకర్యం లేని వూళ్ళో. కొద్ది మైళ్ల దూరంలో వున్న రైలు స్టేషన్ కు మనిషిని పంపించి టెలిగ్రాం ఇప్పించారు. మరునాటి వుదయం అది ఖమ్మం చేరింది.  అది వచ్చినప్పుడు ఇంట్లో నేనొక్కడినే వున్నాను. టెలిగ్రాం ఇంగ్లిష్ లో వుంది. లలిత  ఎక్స్ ఫై ర్డ్  స్టార్ట్ ఇమ్మీడియట్ ట్లీ.  ఎక్స్ ఫైర్డ్ అనే పదానికి అర్ధం తెలియదు. పెద్దవాళ్ళని వాకబు చేస్తే విషయం తెలిసింది. మనసంతా గందరగోళంగావుంది. ఆలోచనలన్నీ లలిత గురించే. ఆ సాయంత్రం నాన్న ఖమ్మం వచ్చారు. ఇద్దరం కలసి  పాసింజరు రైల్లో బోనకల్లు వెళ్ళాము. కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణరావుగారి వూరు. మా బంధువు కూడా. విషయం తెలుసుకున్న ఆయన మమ్మల్ని చూడడానికి స్టేషనుకు వచ్చి పరామర్శించారు. పది మైళ్ల  దూరంలో వున్న వత్సవాయి వెళ్ళడానికి అప్పటికప్పుడు ఓ ప్రయివేటు బస్సు ఏర్పాటుచేశారు. వెంట తోడుగా ఒక మనిషిని ఇచ్చారు. తినడానికి భోజనం, చీకటి పడితే ఇబ్బంది అని టార్చ్ లైట్ పట్టుకొచ్చారు. భోజనం ముగించుకుని  బస్సులో వత్సవాయి చేరుకున్నాము. వాన పడుతోంది. చీకటిలోనే నడుచుకుంటూ బయలుదేరాము. బాట సరిగాలేదు. కీచురాళ్ళ చప్పుళ్ళ మధ్య ఆ బురద బాటలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అర్ధరాత్రి కంభంపాడు చేరుకున్నాము. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. మమ్మల్ని చూడగానే అంతా భోరుమన్నారు. చిన్నారి లలితను తలచుకుంటూ ఒకరి నొకరు సముదాయించుకుంటూ రాత్రి గడిపాము. మర్నాడు తెలతెలవారుతూనే లలితను పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళాము. ఆమె జ్ఞాపకాలను వెంటబెట్టుకుని ఖమ్మం తిరిగివచ్చేసాము. 

చక్కటి తెలివితేటలు, ఎంతో మంచి భవిష్యత్తు వున్న లలిత  ఎలాటి వైద్య సదుపాయం లభించకుండా అలా కన్ను మూయడం నా మనసును కలచివేసింది. నా చిట్టి చెల్లెలు లలిత  మాదిరిగా ఇంకా ఇలా  ఎంతమంది సరయిన వైద్యం సరయిన సమయంలో దొరక్క చనిపోతున్నారో అన్న దిశగా నాలో ఆలోచన మొదలయింది. ఇంగ్లాండ్ లో పై చదువులు ముగించుకుని తిరిగి వచ్చిన తరవాత గవర్నమెంటు డాక్టరుగా ఖమ్మంజిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి బహుశా ఈ ఆలోచనే ప్రేరణ అయిందేమో. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి