23, సెప్టెంబర్ 2014, మంగళవారం

కారు వాడకపోతే డాలరు దిగొస్తుంది (ట)



మీ దగ్గర వున్న ఓ పది నోటు తీసిచూడండి. 'ఇది తీసుకువచ్చిన వాడికి పది రూపాయలు ఇస్తాన'ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో కూడిన హామీ (ఒక రకంగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు) కనబడుతుంది. సాంకేతిక అంశాలను అంత క్లుప్తంగా వివరించడం సాధ్యం కాకపోవచ్చు కాని పది రూపాయలకు బదులు అంతే విలువకలిగిన బంగారం ఇస్తామన్న హామీ అన్నమాట.
అంటే భారత దేశం ఆర్ధిక వ్యవస్థ బంగారం నిల్వలపై  ఆధారపడివుందనుకోవాలి. మరి ఈ కారు గొడవ  యేమిటి అన్న అనుమానం రావచ్చు.
ఒక డెబ్బయ్యేళ్ల  క్రితం  వరకు అమెరికా కూడా తన డాలరు విలువను బంగారం నిల్వల ప్రాతిపదికగా లెక్కకట్టేది. పెట్రోలు కూడా బంగారం మాదిరిగా ప్రియమైనది(మన దేశంలో బంగారం మరో రకంగా ప్రియమైనది అనుకోండి) అన్న జ్ఞానోదయం ముందు కలిగిన దేశం  కనుక  అమెరికా  ముందు జాగ్రత్త పడి  పెట్రోలు ఉత్పత్తి చేసే మధ్య ప్రాచ్య దేశాలతో ఒక వొప్పందం కుదుర్చుకుంది. అదేమిటంటే వాళ్లు పెట్రోలు ఏ దేశాలకు అమ్మినా డాలర్లలోనే అమ్మాలి. ఏవిటి దీనివల్ల వాళ్లకు లాభం? ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
మన పెట్రోలియం మంత్రిగారు చమురు కొనుగోళ్ళ కోసం ఓ మధ్య ప్రాచ్య దేశానికి వెళ్ళారనుకుందాం. కాని వాళ్లు మన మన కరెన్సీ వొప్పుకోరు. డాలర్లు కావాలంటారు. అప్పుడు మన మంత్రి గారు డాలర్లకోసం అమెరికా వైపు చూస్తారు. వాళ్ల సొమ్మేం పోయింది. టకటకా తెల్లకాగితంపై (కరెన్సీ ముద్రణకు వాడే కాగితమే కావచ్చు)  డాలర్లు ప్రింటు చేసి మనకు ఇస్తారు.
ఈవిధంగా వచ్చిన డాలర్లతో మనం పెట్రోలు కొనుగోలు చేస్తాం.
ఇక్కడో తిరకాసు వుంది. 'మాకీ డాలర్లు అక్కరలేదు, తిరిగి  ఇచ్చేస్తాం తీసుకోండిఅంటే అమెరికా రిజర్వ్ బ్యాంక్ వొప్పుకోదు. డాలర్ల బదులు మాకు బంగారం ఇవ్వండి అంటే ఆ దేశం ఎంతమాత్రం అంగీకరించదు.  'డాలర్ బదులు తిరిగి ఏదయినా ఇస్తామని హామీ ఏమైనా ఇచ్చామా చెప్పండి' అని ఎదురు ప్రశ్న వేస్తారు.  మన కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హామీ లాగా వాళ్ల డాలర్ మీద అలాటి పూచీకత్తు ఏమీ వుండదు. అందుకే డాలర్లు ముద్రించాలంటే తగిన బంగారం నిల్వలు వున్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఆ దేశానికి వున్నట్టు  లేదు. మరయితే, తాను కొనుగోలు చేసే పెట్రోలుకు  అమెరికా అయా దేశాలకు చెల్లింపులు ఏ కరెన్సీలో చేస్తుందనే అనుమానం రావచ్చు.   
వాళ్లకు ఇక్కడ ఓ సౌలభ్యం వుంది. ఆ దేశాల రాజులనండి, సుల్తానులనండి తమ ఆస్తులను సామ్రాజ్యాలను కాపాడడం కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి. అలాగే ఆయా దేశాల్లో అమెరికా నిర్మించిన రహదారులు మొదలయిన నిర్మాణాలకు అయిన ఖర్చు తాలూకు చెల్లింపులతో పెట్రోలు చెల్లింపులు సరి.   
సరే! అది వాళ్ల ఏర్పాటు.  మన సమస్య అమెరికా డాలర్లు. ఆ డాలర్ల ముద్రణకు అమెరికా ఉపయోగించే తెల్ల కాగితం విలువా, మన బంగారం నిల్వల విలువా సమానం అనుకోవాలేమో.
అంటే ఏమిటన్న మాట. మనం పెట్రోలు దిగుమతులపై పెట్టే ఖర్చు తగ్గించుకోగలిగితే డాలర్ విలువ మన రూపాయి మారకం విలువతో పోల్చినప్పుడు తగ్గుతుందన్న మాట. అంటే మరో ఏమిటన్న మాట. మనం కనుక ఒక్క మాట మీద నిలబడి ఓ వారం రోజుల పాటు కార్లను రోడ్లకు దూరంగా వుంచి వాటికి విశ్రాంతి ఇవ్వగలిగితే  చాలు కొండెక్కి కూర్చున్న డాలరు దానంతట అదే  దిగివస్తుందని సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకడు మన నెటిజెన్ల చెవిన వేయడం,   ఆంగ్లంలో వున్న ఆ విషయాలనన్నింటినీ కుదించి  ఇలా  తెలుగులోకి అనువదించి రాయడమైనది. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ.


NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి