5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

బెజవాడ - ఒక స్పందన అమెరికా నుంచి


(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు -  భండారు శ్రీనివాసరావు )
   
బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన కృష్ణ లీలసినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో వరవిక్రయంవచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

(దాసుగారి బెజవాడ ముచ్చట్లు మరికొన్ని మరోసారి)

3 కామెంట్‌లు:

  1. దాసుగారేంరాసారో చదవలేదు కానీ, బెజవాడంటే సినిమాలూ, హాళ్ళేనా (నేటికీ అలాగే ఉందేమో లెండి)?!

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత - ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే విషయంలో నాకు నలభయ్ ఏళ్ళ పై చిలుకు అనుభవం వుంది. అయినా ఇప్పటికీ ఏదయినా అనుమానం వస్తే మీవంటి పెద్దల సలహా తీసుకునే రాస్తాను. ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో - ఇప్పటి జ్యోతి కాదు, నార్లగారి ఆంధ్రజ్యోతి - ప్రతి రోజూ కాలాలకు కాలాలు అనువాదం చేసి ఎడిటర్ చేత 'కాలాంతకుడు' అనే బిరుదు పొందినవాడిని.కాబట్టి సందేహించనక్కరలేదు అజ్ఞాత గారు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి



  3. ఎందుకో,సీనియర్లు కూడా ఈ తప్పుచేస్తుంటారు.సినిమా పేరు ' మాలపిల్ల ';మాలపల్లి కాదు. మాలపల్లి నవల.మాలపిల్ల సినిమా.రెండిట్లో కథ కూడా వేరు.

    రిప్లయితొలగించండి