5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దాసుగారి బెజవాడ ముచ్చట్లు రెండో భాగం



ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను"

(దాసుగారి బెజవాడ ముచ్చట్లు మరికొన్ని మరోసారి) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి