20, సెప్టెంబర్ 2014, శనివారం

నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం


'బ్రిటన్ తో కలిసి వుండాలా విడిపోవాలా' అనే అంశంపై స్కాట్ లాండ్ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. మూడువందల ఏళ్ళకు పైబడిన బంధాన్నే వారు బ్రిటన్ తో కోరుకున్నారు. స్కాట్ లాండ్ పార్ల మెంట్  తీర్మానం ప్రకారం ఈనెల పద్దెనిమిదో తేదీన  నిర్వహించిన ప్రజాభిప్రాయ  సేకరణలో సుమారు పదకొండు శాతం తేడాతో వేర్పాటువాదులు వోడిపోయారు.
14 వ శతాబ్దంలో ఇంగ్లాండ్, స్కాట్ లాండ్ దేశాలనడుమ వరుసగా అనేక యుద్ధాలు జరిగాయి. 1653లో ఈ రెండు సామ్రాజ్యాలు పరస్పరం సంధి చేసుకుని ఒకే ప్రభుత్వం కింద తాత్కాలికంగా ఏకమయ్యాయి. 1707లో స్కాట్ లాండ్ , ఇంగ్లాండ్ లు గ్రేట్ బ్రిటన్ పేరుతొ ఒక్కటయ్యాయి. తరువాత 1801లో ఐర్లాండ్ ని కూడా కలుపుకుని యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గా అవతరించింది. కాని, 1922 లో ఐర్లాండ్ లోని అనేక ప్రాంతాల వారు ఆ సామ్రాజ్యం నుంచి వేరు పడిపోయారు. అయితే స్కాట్ లాండ్ మాత్రం గ్రేట్ బ్రిటన్ లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. లేబర్ పార్టీ ప్రభావంతో స్కాట్ లాండ్ లో వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యాయి. స్కాట్ లాండ్ కు ప్రత్యేక పాలన కోరిన లేబర్ పార్టీ తదనంతర కాలంలో తన విధానాన్ని మార్చుకుంది. దానితో 1934లో ఈ బాధ్యతను కొత్తగా పురుడుపోసుకున్న స్కాటిష్ నేషనల్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. కాని పాతికేళ్ళవరకు ఈ కొత్త పార్టీ తన లక్ష్యాల దిశగా గట్టిగా అడుగులు వేయలేకపోయింది. 1970 నుంచీ స్కాటిష్ ప్రజానీకంలో వేర్పాటువాదం పుంజుకోవడం మళ్ళీ మొదలయింది. జిమ్ కేలగాన్ నేతృత్వంలో ఏర్పడ్డ లేబర్ ప్రభుత్వం మద్దతుతో ఈవాదానికి మరింత బలం చేకూరినట్టయింది.
1979 లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. వేర్పాటువాదులకు అనుకూలంగా ప్రజాతీర్పు వచ్చింది. కానీ, మొత్తం వోటర్లలో నలభయ్ శాతానికి మించి వోట్లు వస్తేనే ఆ తీర్పుకు విలువ వుంటుందన్న నిబంధన కారణంగా స్కాటిష్ వేర్పాటువాదానికి తొలి వోటమి ఎదురయింది. 1977 లో తిరిగి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సంస్కరణలు గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఆ ఏడాది మరో రిఫరెండం నిర్వహించారు. కేంద్రం నుంచి బదలాయించిన అధికారాలు కలిగిన స్కాటిష్ పార్ల మెంటు ఏర్పాటుకు అనుకూలంగా మెజారిటీ ప్రజలు వోటు వేసారు. దరిమిలా  1988 స్కాట్లాండ్ చట్టం ప్రకారం 1999 మే ఆరోతేదీన మొట్టమొదటి స్కాటిష్ పార్లమెంటు ఏర్పాటయింది. స్కాట్ లాండ్ కు సంబందించిన శాసనాలు సొంతంగా చేసుకునే అధికారాన్ని ఈ పార్ల మెంటుకు దఖలు పరిచారు.     
2007 స్కాటిష్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి.  ఇంగ్లాండు నుంచి వేర్పాటు కోరుతూ 2010 లో తిరిగి రిఫరెండం నిర్వహిస్తామన్న ఎన్నికల వాగ్దానంతో స్కాటిష్ నేషనల్ పార్టీ  స్కాటిష్ పార్ల మెంటులో ఎక్కువ సీట్లు పొందిన పార్టీగా అవతరించింది. అలెక్స్ సాల్మండ్ నేతృత్వంలో ఆ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలింది. ఆ ప్రభుత్వం తన వాగ్దానానికి అనుకూలంగా మూడు ప్రత్యామ్నాయాలతో కూడిన ఒక బిల్లును తయారు చేసి పార్ల మెంటులో ప్రవేశపెట్టింది. దురదృష్టవశాత్తు  మొత్తం సభ్యులు  129 మందిలో  50 మంది సభ్యులు మాత్రమె రిఫరెండానికి అనుకూలంగా వోటు చేసారు. సరయిన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమయిన ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది.
అయితే, స్కాటిష్ నేషనల్ పార్టీ అంతటితో నిరుత్సాహపడకుండా  2011 ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ రిఫరెండం వాగ్దానాన్ని పొందుపరిచింది. ఆ ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి తిరుగులేని ఆధిక్యతను ప్రజలు కట్టబెట్టారు. మొత్తం 129 సీట్లలో ఆ పార్టీ  69 స్థానాలు గెలుచుకుంది. తద్వారా రిఫరెండం జరపాలన్న తమ ఎన్నికల వాగ్దానానికి ప్రజల మద్దతును సయితం కూడగట్టుకుంది.
2012 జనవరిలో రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్ల మెంటుకు యునైటెడ్ కింగ్ డం ప్రభుత్వం అంగీకరించింది. అయితే అందుకు కొన్ని షరతులు విధించింది. న్యాయమైన రీతిలో, చట్టబద్ధంగా, నిర్ణయాత్మకంగా రిఫరెండం జరపాలని కోరింది.
రిఫరెండంలో ఎవరు వోటు వెయ్యాలి, ఎవరు దీన్ని నిర్వహించాలి మొదలయిన విధి విధానాలను ముందుగానే ఖరారు చేయాలని సూచించింది. న్యాయపరమయిన అంశాలను, రిఫరెండం నిర్వహించే తేదీని ఖరారు చేసే  పనిలో యూకే ప్రభుత్వం ఉండగానే, మరోపక్క  సాల్మండ్ 2014 లో రిఫరెండం జరుగుతుందని హడావిడిగా ప్రకటించారు. స్వాతంత్రేచ్చను వ్యక్తం చేసే రిఫరెండం యాక్టును స్కాటిష్ పార్లమెంటు ఆమోదించింది. 2013 ఆగస్టు ఏడో  తేదీన దీనికి బ్రిటిష్ రాణి ఆమోదం లభించింది. స్కాట్లాండ్ ను స్వతంత్ర దేశంగా మార్చుకునే ఉద్దేశ్యం కలిగిన ఒక శ్వేత పత్రాన్ని కూడా సాల్మాండ్ ప్రభుత్వం విడుదల చేసింది. 2014 సెప్టెంబర్ 18 వ తేదీన రిఫరెండం నిర్వహించడం జరుగుతుందని షెడ్యూల్ కూడా ప్రకటించింది. అదే సంవత్సరం స్కాట్ లాండ్ లో కామన్ వెల్త్ దేశాల క్రీడోత్సవాలకు స్కాట్ లాండ్ ఆతిధ్య దేశంగా వ్యవహరించాల్సి వుంటుంది అనే అభ్యంతరాలను సయితం కూడా  సాల్మాండ్ ఖాతరు చేయలేదు. ఈ రిఫరెండంలో పాల్గొనే వోటర్ల కనీస వయస్సును 18 నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది. స్కాట్ ల్యాండ్ వెలుపల నివాసం ఉంటున్న స్కాట్ జాతీయులకు కూడా వోటింగ్ హక్కు ఇవ్వాలనే  డిమాండ్ ని కూడా లెక్కపెట్టలేదు. ఇలాటి వారి సంఖ్య సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా. స్కాట్ లాండ్ స్వాతంత్రానికి సంబందించి  నిర్వహించే రిఫరెండంలో బ్రిటన్ లోని పౌరులకు కూడా అవకాశం కల్పించాలని యూకే పెద్దల సభలో గట్టిగా వాదనలు వినిపించాయి. అయితే దీన్ని బ్రిటిష్ ప్రభుత్వమే తిరస్కరించింది. యునైటెడ్ కింగ్ డం ని వొదిలి పెట్టి వేరుపడాలా లేక కలిసి వుండాలా అన్నది స్కాటిష్ ప్రజలు మాత్రమె తేల్చుకోవాలని స్కాట్ లాండ్ అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనను బ్రిటిష్ ప్రభుత్వం సమర్ధించింది. అంతే  కాకుండా 2014 డిసెంబర్ లోపు రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్లమెంటుకు అధికారం ఇస్తూ ఎడెన్ బర్గ్ వొప్పందంపై  సంతకాలు చేసింది. దీనితో బ్రిటన్ తో కలిసి వుండాలా, వేరుపడి స్వతంత్ర దేశంగా ఏర్పడాలా అనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి స్కాట్ లాండ్ ప్రజలకు అవకాశం లభించింది.
దరిమిలా ఈనెల పద్దెనిమిదో తేదీన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రిఫరెండం జరిగింది. 'స్కాట్ లాండ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని మీరు కోరుకుంటున్నారా?' అని ప్రశ్న అడగాలని ముందు స్కాటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రశ్న తీరులోనే వోటర్లను ఎలా జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నారో తెలిసిపోతుందని ఎలక్షన్ కమీషన్  దాన్ని త్రోసిపుచ్చింది. 'స్కాట్ ల్యాండ్ స్వతంత్ర దేశంగా వుండాలనుకుంటున్నారా?' అని ఆ ప్రశ్న రూపాన్ని మార్చాలని భావించింది. ఈ ప్రశ్నకు వోటర్లు 'అవును' అనికానీ, 'లేదు' అని కానీ క్లుప్తంగా  జవాబు ఇవ్వాల్సి వుంటుంది. మొత్తం దేశం యావత్తు ఈ 'అవును' కాదు' అనే బృందాలుగా విడిపోయి ఉదృతంగా ప్రచారం కొనసాగింది.
ఎట్టకేలకు జరిగిన రిఫరెండంలో 'కలిసి ఉండాలని కోరుకునే' వారికే మెజారిటీ లభించింది.

(20-09-2014)

6 కామెంట్‌లు:

  1. "నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం" హెడింగ్ సరీగ్గా అసలు సంగతి చెప్పటల్లేదని నా ఉద్దేశం. దానిలోనుండి ప్రజలు అనే పదం తీసెయ్యండి చాలు సరిపోతుంది. అది కొందరి స్వప్నం మాత్రమే అందరి ప్రజల స్వప్నం కాదు.


    మీ పోస్టులో చివరి లైన్ లో చెప్పినట్లే "ఎట్టకేలకు జరిగిన రిఫరెండంలో 'కలిసి ఉండాలని కోరుకునే' వారికే మెజారిటీ లభించింది." అందుకని ఎక్కువ మంది ప్రజలు కోరుకోవటం మూలంగా వేర్పాటు వాదం వీగిపోయింది.

    రిప్లయితొలగించండి
  2. "నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం"
    By putting this kind of Heading, you are imputing that the result that came in the referendum is not reflecting the Peoples' Will. People who voted in majority not to separate from Great Britain also are People. When that is the case whose separatist dream did not come to be true!

    As rightly pointed out by Shri Lakkaraju it is కొందరి స్వప్నం మాత్రమే అందరి ప్రజల స్వప్నం కాదు.

    I hope you will change the very misleading heading.

    రిప్లయితొలగించండి
  3. @SIVARAMAPRASAD KAPPAGANTU - లక్కరాజు వారి అభిప్రాయం సరయినదే అని నేను వెంటనే స్పందించాను. పొతే, స్కాటిష్ ప్రజల చిరకాల స్వప్నం అని ఎందుకు హెడింగ్ పెట్టాల్సి వచ్చిందో తెలియచేప్పడానికే అన్ని వివరాలు రాసాను. ప్రగాఢమైన ఆ వాంఛ కాలగమనంలో ఎలా తగ్గుతూ వచ్చిందో చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  4. "ప్రస్తుతానికి ఇంకా నెరవేరని స్కాటిష్ స్వాతంత్ర్య స్వప్నం" అని మార్చాలి.

    రిప్లయితొలగించండి
  5. ఇంకా నెరవేరని 'స్కాటిష్ స్వాతంత్ర్య స్వప్నం' కాదు, 'గొట్టిముక్కల విడగొట్టుడు స్వప్నం' అని పెట్టాలి. గులాబీ కళ్ళు ఎక్కడ చూసినా అదే స్వప్నం.

    రిప్లయితొలగించండి