19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పాలకొల్లు నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సంగీత కెరటం మాండలిన్ శ్రీనివాస్

(Published in Andhra Jyothy, Telugu Daily in its Edit page today)
ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. "ప్రసిద్ధ భారతీయ సంగీత  విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం"టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.
బీబీసీలో ఈవార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్ అనే నలభయ్ అయిదేళ్ళ ఈ పాలకొల్లు కుర్రవాడు ఏ స్థాయికి ఎదిగాడన్నది సులభంగా అర్ధం చేసుకోవచ్చు. పాశ్చాత్య సంగీత పరికరం మాండలిన్ పేరే శ్రీనివాస్ ఇంటిపేరుగా మారిపోయిందంటే దానిపై ఈ గ్రామీణ ప్రాంతపు, చదువూ సంధ్యా లేని కుర్రాడు యెంత పట్టు సాధించాడో తెలిసిపోతుంది.


పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు పాలకొల్లులో తన తండ్రి సత్యనారాయణతో కలిసి చిన్నతనంలోనే  బ్యాండ్ మేళాలలో శ్రీనివాస్ వాయిస్తూ వుండేవాడు. బాల్యంలోనే తాను  స్వయంగా నేర్చుకున్న సంగీత విద్యతో నలుగురినీ  మెప్పించేవాడు. పాలకొల్లు అంటేనే  సంగీతాభిమానుల పుట్టిల్లు. క్లారినెట్ వాయించే ఒక సాధారణ వ్యక్తి శిలావిగ్రహం ఆ వూరి నడిబొడ్డులో ప్రతిష్టించడం  సంగీతంపట్ల ఆ వూరివారలకు వున్నఆదరాభిమానాలకు నిదర్శనం.
బ్యాండ్  మేళంలో వాయిస్తున్న శ్రీనివాస్  అలనాటి సంగీత విద్వాంసుడు  రుద్రరాజు సుబ్బరాజు గారి కంటపడడం శ్రీనివాస్ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కుర్రాడిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను చెన్నైలో  స్తిరపడిన ఆ విద్వాంసుడు  చప్పున గుర్తించగలిగారు. వెంటనే తండ్రితో సహా ఆ కుర్రాడిని వెంటబెట్టుకుని మద్రాసు తీసుకువెళ్ళారు. దగ్గర  వుంచుకుని స్వయంగా  సంగీతంలోని మెళకువలను బోధించారు. అసలే దైవదత్తమైన సంగీతం శ్రీనివాస్ కు పుట్టుకతోనే అబ్బింది. పూవుకు సువాసన తోడయినట్టు సుబ్బరాజుగారి గురు కటాక్షం సిద్దించింది. మట్టిలో దాగున్న మాణిక్యం వెలుగులోకి వచ్చి నలుదెసలకు తన కాంతులను వెదజల్లింది.  ఇంతింతయి వటుడింతయి అన్నట్టు సంగీత ప్రపంచంలో  శ్రీనివాస్ ఎదుగుదలకు అడ్డులేకుండా పోయింది. అంతవరకూ కర్నాటక సంగీతంలో మాండలిన్ వంటి పాశ్చాత్య పరికరానికి చోటులేదు. సంగీత కచ్చేరీలలో ఎక్కువగా కానవచ్చే 'హార్మోనియం' కూడా  ఆకాశవాణి గుర్తింపు పొందడానికి దాదాపు యాభయ్ ఏళ్ళు పట్టింది. అలాటిది, తమిళనాడులోని సంగీత విద్వాంసులందరి మూకుమ్మడి  ప్రశంసలు పొందిన శ్రీనివాస్,  మాండలిన్ సమేతంగా ఆకాశవాణి స్టూడియోలో సగౌరవంగా అడుగుపెట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన  అవసరం లేకుండా పోయింది. పాలకొల్లులో పుట్టి అనేక ప్రపంచదేశాలలో మాండలిన్ ప్రదర్శనలు  ఇచ్చి, అనేకానేక పురస్కారాలు పొంది, సమకాలీన సంగీత దురంధరుల సరసనే సముచిత స్థానం సంపాదించుకున్న శ్రీనివాస్ అకాల మృత్యువు వొడికిచేరడం నిజంగా విచారకరం. సామాజిక అసమానతలు మనుషులలోని అసలయిన ప్రతిభను అణచిపెట్టలేవు అనడానికి మాండలిన్ శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం.
-ఆర్వీవీ  కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు     

(19-09-2014)

2 కామెంట్‌లు: