1, సెప్టెంబర్ 2014, సోమవారం

వంద రూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు


(03-09-2014 తేదీ 'సూర్య'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
ఏదో సినిమాలో లాగా కాస్త ముందూ వెనక్కీ వెళ్ళాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బాంక్ చైర్మన్ గా అత్యంత సమర్ధుడయిన అధికారిగా పేరుతెచ్చుకున్న తల్వార్ గారు వుండేవారు. బాంకులో పనిచేసే అన్ని శ్రేణుల  అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదులోని బేగం పేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేసారు. దాన్ని ప్రారంభించడానికి అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ చవాన్ తో పాటు తల్వార్ గారు కూడా హైదరాబాదు వచ్చారు. ప్రారంభోత్సవం అదీ బాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.
ఈ విషయాన్ని ఇక్కడ వొదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లా వెళ్లోద్దాం.
స్టేట్ బాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రంరాజుగారనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెడుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణ మంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరు సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిష్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్ధుడు. ఆయన ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ వ్యవహారాన్ని గమనిస్తున్నాడు. ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. అదేమిటంటే పేద రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ, లేదా వారి వారి తాహతు కొద్దీ వంద రూపాయలనుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు. ఆ విలేకరి వాళ్ళు పూర్తిచేసిన ఒక ధరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూసారు. ఒక్కొక్కదానిపై నాలుగువందల వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధృవపరచుకున్న ఆ విలేకరి క్షణం ఆలస్యం చేయకుండా   పోస్ట్ ఆఫీసుకు వెళ్లి వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.
మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే....
వందరూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు అంటూ యూ ఎన్ ఐ పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది.  స్టేట్ బాంక్ చైర్మన్ తల్వార్ గారు పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫోటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ మహాశయుల దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీసారు. వంద రూపాయలకు నాలుగు వందల సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమే అని విచారణలో తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణ మంజూరీ పద్దతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని 'గమనించడం' అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఇక మళ్ళీ వర్తమానంలోకి వద్దాం. ఒక చిన్న వార్తతో పెను మార్పులకు కారణం అయిన ఆ జర్నలిష్టు ఎవరంటే నిన్ననో మొన్ననో తొంభయ్యవ పడిలో అడుగిడిన  వృద్ధ బాలకుడు వీ. హనుమంతరావు గారు. డెబ్బయ్ ఏళ్ళుగా ఆయన కలం రాస్తూనే వుంది. రాయడం, రాస్తూవుండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం. ఈనాటి నవ యువ జర్నలిష్ట్ తరానికి మార్గ నిర్దేశనం చేయగల చేవకలిగిన హనుమంతరావుగారు, తొంభయ్యవ యేట కూడా పాఠాలు నేర్పడానికి సిద్ధంగానే వున్నట్టు కానవస్తున్నారు. శతమానం భవతి అంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుందాం. 


(తొంభయ్ ఏళ్ళ యువకుడు హనుమంతరావు గారు) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి