1, సెప్టెంబర్ 2014, సోమవారం

కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్


(సెప్టెంబర్ రెండో తేదీ  వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
  
దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.


(ఎనభయ్యవ దశకంలో వైయస్సార్ తో నేను)



కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు  ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి  కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.


(ముఖ్యమంత్రి వైయస్సార్ తో నేను)

వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా  రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. (01-09-2014)



11 కామెంట్‌లు:

  1. oka donga ni meeru intha pogadatam edo virakthi ga undhi

    రిప్లయితొలగించండి
  2. సమాజం ఎంత దిగజారి పోయిందో ,ఒక వ్యక్తి తనకు ఇంకో వ్యక్కి కి సంబందించిన విషయాలు రాస్తే ,మీరు పొగడం తప్పు, అనడం ఎంతవరకు సమజసం ,శ్రీనివాస్ రావు గారు రాసిన్దనిలో ప్రజలకు గాని ప్రభుతాన్కి సంబందించిన విష్యం లేదు ,కేవలం శ్రీనివాస్ రావు గారు చుసిన రాజశేఖర్ రెడ్డి మాత్రమే ,టైటిల్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి మందహాసం గురుంచి , ఈ అజ్ఞాత వ్యక్తీ కి రాజశేఖర్ రెడ్డి పాలనలో కష్టం కలిగి ఉండవచ్చు దానికి రచయత,రాజశేఖర్ రెడ్డి గారి సాంగత్యం కు ఏమి సంబంధం , ఈ లాంటి వాక్యాలు పేరు కూడా చెప్పుకోలేని వారె రాయగలరు ,

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. NAGA.భజనలు నేటి రాజకీయ"చంద్రులు" చేస్తుంటారు, విలేఖరులకు అవసరం ఏముంటుంది, అందునా మరణించిన వ్యక్తి, అదికారంలో లేని పార్టీ, భజన ఎలా అవుతుంది Ramu Lanka garu. వేలాది చిట్టి పొట్టి చిన్నారుల ప్రాణాలను నిలపటంకోసం First time in india ఆరోగ్యశ్రీకారం పథకం అమలు చేసాడు YSR.

    రిప్లయితొలగించండి
  5. దొంగలు ఎవరు కాదు,
    వేలాది చిట్టి పొట్టి చిన్నారుల ప్రాణాలను నిలపటంకోసం,భారతధేశం లోనే మరే రాష్ట్రంలో కూడా లేని, మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకారం పథకం అమలు చేసాడు YSR,
    YSR మరణించలేడు, ప్రతి చిన్నారి చిరునవ్వుల్లొ వున్నాడు.

    రిప్లయితొలగించండి
  6. రాజకీయ నాయకులని దొంగలని (ఏ పార్టీ వారినైనా ) అనడం కరెక్ట్ కాదు . ప్రజల చే ఎన్నుకోబడిన ,లేక ప్రతిపక్షం లో ఉన్నా అభిమానించే వాళ్ళు ఉంటారు .
    అవినీతి అనేది చూసే దృష్టి ని బట్టి ఉంటుంది . గెలుపు కోసం డబ్బులున్న వాళ్లకి టికెట్ ఇవ్వడం కరెక్ట్ అనే ప్రజలు గెలిపిస్తున్నప్పుడు ,ప్రజలు వారి నుండి
    ఏమి అసీస్తున్నారో మనకు తెలుసు . ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే ముందు ఎవరైనా అవినీతి పరులు (సమాజం లెక్కలో ) గా మారాల్సిందే . సంపాదించిన సొమ్ముని
    పిల్లలకి ఇవ్వకుండా ,లాటరి లాంటి రాజకీయాల్లో డబ్బులు ,వయసు అన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూసి జాలిపడాలి . ప్రజలు ,సమాజం అని మీడియా చెబుతున్నది ఏది లేదు . ఉన్నదల్లా నువ్వు .నీకు నచ్చితే పొగుడు లేదా ఊరుకోవడం మంచిది . పొగిడితే ఆరోగ్యం గా ఉంటాం . కోపం ,కసి పెంచుకుంటే అనారోగ్యం పలవుతం . కాబట్టి నచ్చితే పొగడండి ,నచ్చక పొతే వదిలేయండి ,ఆరోగ్యంగా ఉండండి . ఎవరి గురించి ఒక మంచి చెప్పినా వెంటనే తిట్టడం నెట్ లో ,మీడియాలో అలవాటైపోయింది . (వాక్భుషణం భూషణం )

    రిప్లయితొలగించండి
  7. Appatlo teesukonna " mellu " ki yee raata oka najaraana ...

    రిప్లయితొలగించండి
  8. @sigguleni raata,appatlo teesukunna melluki ee raata o najaraanaa,ఈ వ్యాఖ్యలు చేసిన అజ్ఞాత గారికి - వైయస్సార్ గురించి రాసిన ఈ వ్యాసంపై మరొకరు వైయస్ రాజకీయ ప్రత్యర్ధి గురించి అచ్చులో రాయలేని భయంకరమైన వ్యాఖ్య రాసారు. దాన్ని నేను తొలగించాను. వైయస్సార్ కు భజన చేసే ఉద్దేశ్యం వుంటే ఆ పని చేసివుండేవాడినికాదు. అలాగే మీరు రాసిన వ్యాఖ్యలు అలాగే ఉంచేశాను. కారణం అవి నా గురించి రాసినవి. నేను రాసిన వాటిని అందరూ నచ్చాలని రూలేమీ లేదు. అందుకే ఆ విమర్శలు డిలిట్ చేయలేదు. ఒక జర్నలిష్టుగా అది నా బాధ్యత కూడా. పొతే మీ వ్యాఖ్యలకు బదులివ్వడం అంటే వాటిని ఎంతో కొంత నేను వొప్పుకున్నట్టే. కాబట్టి వాటిని ఇగ్నోర్ చేస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  9. శ్రీనివాసరావు గారూ .. నాయకుడు కాని నాయకుని గురించి ,మీడియా పెంచిన నాయకుని గురించి వీరుడు శూరుడు అని చెప్పండి సార్ మీకు లైకులే లైకులు.అబద్దాలు మాత్రమే మాట్లాడాలి సార్ మీరు. నిజాలు ఏ మాత్రం చెప్పకూడదు.చెబితే తట్టుకోలేరు.ఇప్పుడంతా అబద్దాల సీజను నడుస్తూ ఉంది కదా సార్! సీజను బట్టి పొండి శ్రీనివాసరావు గారు ...

    రిప్లయితొలగించండి