19, జూన్ 2014, గురువారం

అలనాటి ఆకాశవాణి


నిన్న పుట్టింటికి వెళ్ళి వచ్చాను. మగవాళ్ళకి పుట్టిల్లు వాళ్లు మొదట్లో పనిచేసిన ఆఫీసులే కదా. అలా రేడియో స్టేషన్ కు వెళ్లాను. పుట్టిల్లు కదా. వాయినాలు బాగానే ముట్టాయి. మంచి పుస్తకం చేతికి వచ్చింది. రేడియో స్టేషన్ లో పుస్తకాలు ఏమిటి అన్నదానికి కూడా ఒక కధ రెడీగా వుంది.
ఆకాశవాణిలో అలనాడు ఎన్నడో చేరి అంచెలంచెలుగా ఎదిగి దూరదర్శన్ అదనపు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు తన అనుభవాల సమాహారాలను గుదిగుచ్చి 'అలనాటి ఆకాశవాణి' అనే పేరుతొ గ్రంథస్తం చేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికే నేను వెళ్ళింది. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు శ్రీ కె వీ రమణాచారి ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ వీ ఎస్ రెడ్డి పాల్గొన్నారు.


(శ్రీ ఎన్వీ ఎస్ రెడ్డి, డాక్టర్ పద్మనాభ రావు, శ్రీ ఆదిత్య ప్రసాద్) 

వూపిరి తిరగని బాధ్యతలతో ఎప్పుడూ తలమునకలుగా వుండే మెట్రో రైల్ ఎండీ శ్రీ ఎన్.వీ. ఎస్. రెడ్డి ఆకాశవాణి పట్ల తమ అభిమానాన్ని చాలా బాగా  వ్యక్తం చేశారు. 'వాణిజ్య కాలుష్యం సోకని సంస్థ నాటి ఆల్ ఇండియా రేడియో' అంటూ ఒక్క ముక్కలో గొప్పగా చేప్పేశారు.


(ప్రసంగిస్తున్న శ్రీ రమణాచారి)

ఇక రమణాచారిగారు. ఆకాశవాణితో తనకున్న మమకారాన్ని  ఏమాత్రం భేషజానికి పోకుండా బయట పెట్టేశారు.  ఐ.ఏ.ఎస్.లో చేరకముందు అతి పిన్న వయస్సులోనే సైఫాబాద్ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్న రోజులనుంచే ఒక్కసారయినా రేడియో ప్రోగ్రాం లో పాల్గొనాలని ఆయన కోరికగా వుండేదట. అందుకని కాలేజీ పని కాగానే నడుచుకుంటూ వచ్చి రేడియో స్టేషన్ పక్కనేవున్న ఝం ఝం కేఫ్ ఇరానీ హోటల్ నుంచి రేడియో ప్రహరీ గోడ వెంట నడుచుకుంటూ మెయిన గెట్ వద్ద వరకు వచ్చేవారట. లోపలకు పోవాలంటే గేటు దగ్గరే కాపలా మనిషి. ఇక పని కాదనుకుని మళ్ళీ వెనక్కు తిరిగి ఝం ఝం కేఫ్ వరకు, మళ్ళీ  గేటు వరకు అటూ ఇటూ అనేక మార్లు పచార్లు చేసేవారట. ఎలాగయితేనేం ఒక రేడియో నాటకంలో వేసి తన చిరకాల కోరిక తీర్చున్నారట. ఆయన ధారణ శక్తి అపూర్వం. రేడియో దిగ్గజాల పేర్లు ఆయన అలవోకగా స్మరించుకుంటూ పోతుంటే ఆ సమావేశంలో కూర్చున్న రేడియో వారికే మతులు పోయాయి.
పోతే, ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ శ్రీ ఆదిత్యప్రసాద్ ప్రస్తావించిన 'ఆకాశవాణి ప్రచార సభ' పధకం గురించి వింటుంటే ఒకనాడు ఆ సంస్థలో పనిచేసిన నా కళ్ళు చమర్చాయి. ఆ విశేషాలు మరో సారి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి