19, జూన్ 2014, గురువారం

ఒక రేడియో అభిమాని ఆవేదన - ఆలోచన


మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో  గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీత కారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని. వుండాలని  కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.



"ఇప్పడు రేడియోలు ఎక్కడ దొరుకున్నాయండీ" అనే ప్రశ్నకు జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియో ఇచ్చి 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక  జోకు ప్రచారంలో వుంది.  మొన్నీమధ్య ఆదిత్య ప్రసాద్ గారు రాజభవన్ లో గవర్నర్  నరసింహన్ గారిని కలుసుకున్నప్పుడు ఏకంగా వారికి ఒక రేడియో కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట. నిన్న రేడియో ప్రాంగణంలో డాక్టర్ పద్మనాభరావు గారు  రచించిన 'అలనాటి ఆకాశవాణి'  పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.  
రేడియో శ్రోతల సంఖ్య పెరగాలన్న ఆదిత్య ప్రసాద్ గారి కోరిక నెరవేరాలని కోరుకుందాం. అయితే కేవీ రమణాచారి గారు చెప్పినట్టు 'హాయ్ ఓయ్ రేయ్' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. అందుకు నాందిగా ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరుకానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.

1 కామెంట్‌: