5, మార్చి 2014, బుధవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 15

మాస్కో గోంగూర 




మాస్కోలో పాలకు కొదవలేదు. ఉన్నదల్లా పెరుగుకే. అక్కడ దొరికే కిఫీర్ అనేది అటు పెరుగు ఇటు మజ్జిగ కాని బ్రహ్మపదార్ధం. పాలు తోడు పెట్టి పెరుగు చేసుకోవచ్చు. కానీ తోడుకు పెరుగేదీ?
డిల్లీనుంచి ఎవరో తెలిసిన పెద్దమనిషి వస్తుంటే ఓ గిన్నెడు పెరుగు పట్రమ్మని కోరాము. అలా దిగుమతిచేసుకున్న పెరుగుతో ప్రారంభించిన 'తోడు' ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే విజయవంతమయి, సొంతంగా ఇంట్లోనే పెరుగు ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించగలిగాము.దాంతో  ఇక మాస్కోలోని తెలుగులోగిళ్ళలో  పెరుగు వడలు,పెరుగు పచ్చళ్ళు ,ఆవకాయకారంతో పెరుగన్నాలు,  మజ్జిగ పులుసులు - స్వైరవిహారం చేయడం మొదలెట్టాయి. గొప్పచెప్పుకోవడం కాదు కానీ, రీనక్ గోంగూర,మాస్కో పెరుగుకు పేటెంట్ ఇవ్వాల్సివస్తే అది మా ఆవిడకే ఇవ్వాలి.



పెరుగు సమస్య తీరిపోవడంతో బియ్యంపై దృష్టి పెట్టాము. అక్కడ దొరికే బియ్యం చాలా చాలా కారు చవక. అయితే పేరుకు బియ్యమే కానీ వండితే వచ్చేది అన్నం కాదు. తినడానికే కాదు చూడడానికి కూడా పసందుగా లేని రష్యన్ బియ్యం బదులు మామూలు బియ్యం సంపాదించడం ఎల్లా అన్నది మా దినసరి సమస్యగా మారింది.

శ్రీ రాయపాటి

 ఆ సమయంలో మాస్కో వచ్చిన రాజ్య సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు - ఒక రోజు సాయంత్రం నగరంలోని డిల్లీ రెస్టారెంట్ లో తెలుగు వాళ్ళందరికీ విందు ఇచ్చారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆ హోటల్ లో బాస్మతి బియ్యంతో చేసిన ఫ్రయిడ్ రయిస్ వడ్డించారు.



మాస్కోలో మా ఇంట్లో శ్రీ రాయపాటి

వెంటనే  ఆ రెస్టారెంట్ మేనేజర్ ను కదిలించి చూసాను.
 వాళ్లకు డిల్లీ నుంచి వారానికి ఒకసారి బియ్యం బస్తాలలో వస్తుంటాయట. బియ్యంకోసం మేము పడుతున్నపాట్లు విన్నవాడయి- మనసు కరిగిన వాడయి - నెలకిన్ని కిలోలని బియ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఐ టీ డీ సీ నడిపే బాంబే రెస్టారెంట్ నుంచి మరికొంత నెలసరి బియ్యం కోటా సంపాదించుకునే తెలివితేటలను 'అవసరమే' మాకు నేర్పింది.




. కొంత ఎక్కువ ఖర్చయినప్పటికీ రెండు ప్రధాన సమస్యలు తీరిపోవడంతో - మాస్కోలో చదువుకునే తెలుగు పిల్లలకు శనాదివారాల్లో  మా ఇల్లు తెలుగు భోజనశాలగా మారిపోయింది. వాళ్ళంతా మా ఆవిడను అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. ఇళ్ళకు దూరంగా, ఇంటి భోజనానికి  మరీ దూరంగా నాలుక చవిచచ్చిన ఆ పిల్లలు - మా ఆవిడ వడ్డించే  'రీనక్ గోంగూర పచ్చడి, గడ్డపెరుగు అన్నం' తినడానికి చాలా చాలా దూరాలనుంచి చచ్చీచెడీ వచ్చేవారు. వాళ్ళ ఆటా పాటలతో మా ఇల్లు సందడే సందడి.  రెండు రోజులు యిట్టే సరదాగా గడిచిపోయేవి. ఒకరికి పెట్టడంలోవున్న హాయినీ, ఆనందాన్నీ ఒక జీవితానికి సరిపడా మాస్కో జీవితం మాకు అందించింది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
(శంకరాభరణం  శంకర శాస్త్రి గారి నోట రష్యన్ మాట - ఆ కధా కమామిషు మరోసారి)  

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి