18, ఫిబ్రవరి 2014, మంగళవారం

నిష్టూరం అనిపించినా ఇదే నిజం.


రాష్ట్రంలో ఒక చారిత్రిక ఘట్టానికి తెర లేచే సమయం ఆసన్నమౌతోంది. మరి కొన్నింటికి తెరలు దించాల్సిన తరుణం కూడా ఇదే.
ఈరోజు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు పై చర్చ, ఆమోదం అంటూ మీడియా కోయిలలు ముందస్తుగా కూత పెడుతున్నాయి. సోనియా గాంధీ కూడా నాలుగ్గంటల పాటు జరిగే చర్చలో పాల్గొంటారని కూడా వార్త. చర్చ జరుగుతుందని ఎలాటి అత్యాశలు లేవు కాని,  ఇది నిజం కావాలని మాత్రం  భవదీయుడి ఆశ. ఎందుకిలా నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో, ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకుపోవాల్సి వచ్చిందో జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అందరికంటే కూడా సోనియాపై ఎక్కువ వుంది. అలాగే ఈ నిర్ణయం వల్ల మనస్తాపం చెందుతున్న మనస్సుల్లో చెలరేగుతున్న భయాందోళనలను నివృత్తి చేయడానికి ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తీరాలి. మాట్లాడడానికి వీలు లేని పరిస్థితులు తలెత్తితే, కనీసం లిఖిత పూర్వక ప్రకటన అన్నా చేయాలి.
రాష్ట్రాన్ని విభజించడంతో పని పూర్తయిందని అనుకోకూడదు. ఈ ఘడియ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళపై మరింత బాధ్యత వుంది. సంయమనంతో వ్యవహరించి - 'విడిపోయి కలిసుందాం' అని ఇన్నాళ్ళుగా చెబుతూ వస్తున్న మాటల్లో ఏమాత్రం డొల్లతనం లేదని నిరూపించుకోవాలి. అద్దంలో చందమామ మాదిరిగా ఇన్నేళ్ళుగా వూరిస్తూ వచ్చిన లక్ష్యం దగ్గర పడుతున్నప్పుడు కావాల్సింది అవతలివారిపట్ల రవంత సానుభూతి. అడ్డగోలుగా అడ్డం పడుతున్నారని , మళ్ళీ అడ్డగోలు ప్రకటనలు, ఆరోపణలు చేయడానికి ఇది ఎంతమాత్రం తరుణం కాదు.  
ఇప్పుడు కావాల్సింది కాసింత సంయమనం. కొద్ది సర్దుబాటు మనస్తత్వం. కాదు కూడదు అనుకుంటే -దీపనిర్వాణగంధం సామెత  మిగులుతుంది. నిష్టూరం అనిపించినా ఇదే నిజం.  
(18-02-2014 - 9 AM)

2 కామెంట్‌లు:

  1. where are previous comments?
    Have you removed? why

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత - ఈ అజ్ఞాత పేరుతొ ఇలా ప్రాణాలు తీయడం ఏమిటో. కామెంట్స్ యెందుకు తీసేశారని ఈ ఆరోపణలు ఏమిటో! నాకలా చేతయితే ఈ కామెంటు కూడా కనబడేది కాదుకదా!. నేనొక జర్నలిస్టుని. దాగుడుమూతలు, ఈ ముసుగులో గుద్దులాటలు ఏవీ తెలియవు. హాయిగా బయటకు వచ్చి కామెంట్లు పెట్టవచ్చుకదా! గట్టు తగాదాలు ఏవీ లేవుకదా!

    రిప్లయితొలగించండి