6, జూన్ 2013, గురువారం

రేడియో రోజులు


(నిజానికి ఇక్కడ రేడియో రోజులు అంటే నేను రేడియోలో పనిచేసిన రోజులని కాదు. ఆ రోజుల్లో రేడియో అని. నాకన్నా ముందు పనిచేసిన వారి జ్ఞాపకాలు మరింత ఆసక్తిగా వుంటాయని వారిలో కొందరితో  ముచ్చటించినప్పుడు తెలిసింది. వాళ్లు వయస్సులో చాలా పెద్దవాళ్ళు కావడం మూలాన పేర్లూ తారీఖులూ సరిగా గుర్తురావడం లేదని వారే చెప్పారు. అంటే ఏదన్నా విషయం గురించి చెప్పినప్పుడు దాని స్తూల భావాన్ని మాత్రం తీసుకుని, మూలాల్లోకి, చర్చల్లోకి పోకుండా స్వీకరించలిగితే నాటి స్మృతులను ఆస్వాదించడానికి ఆస్కారం వుంటుంది. లేదా చదువరుల్లో ఎవరయినా నాటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు వుండి, తప్పొప్పులను సవరించగలిగితే  ఈ రచనకు సంపూర్ణత్వం, సాధికారికత సిద్ధిస్తుంది. ఇది నా మనవి – భండారు శ్రీనివాసరావు)

తోకచుక్క రాలినప్పుడు ఎవరో పెద్దవారికి కాలం మూడిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. అలాగే తుమ్మెదలు వున్నట్టుండి గుంపులు గుంపులుగా కానరావడం,  కప్పలు సంగీతం మొదలుపెట్టడం వాన  రాకడకు  సూచనలుగా పేర్కొనేవారు.
ఈ సందర్భంలో చెప్పుకోవలసిన విషయం మరొకటి వుంది. రేడియోలో మామూలు కార్యక్రమాలు నిలిపేసి విషాద సంగీతం ప్రసారం చేస్తున్నారంటే ఎవరో జాతీయ నాయకుడు కన్నుమూశారని జనాలకు అర్ధం అయ్యేది.
మరణ వార్తను ప్రసారం చేసేముందు రేడియో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయం తెలిసినా, అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా మరణ వార్తలను ప్రసారం చేయరు. అధికారిక నిర్ధారణ జరగడానికి జరిగే కాలయాపన కారణంగా అనేకసార్లు ఆ నిందను ఆకాశవాణి వారే మోసేవారు. 
ఇంతకీ విషయానికివస్తే -
ఆ రోజు నిజాం నవాబు మరణించారు. ఆ వార్తను ధృవీకరించడానికి నిజాం కుటింబీకులే చాలా సమయం తీసుకున్నారు. కానీ చావుకబురు ఆగదు కదా. ఆ నోటా ఈ నోటా పడి కొందరికి తెలిసిపోయింది. యూ.ఎన్. ఐ. వార్తాసంస్థ  ధ్రువీకరణతో నిమిత్తం లేకుండానే సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రపంచం అంటే ఇక్కడ పత్రికలు. వార్తాసంస్థ పంపిన వార్త రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లోని పత్రికలకు తెలిసిపోయింది కాని ఇప్పట్లా త్వరితగతిన  సమాచారం  చేరవేతకు అవకాశం లేకపోవడం వల్ల దాని ప్రభావం హైదరాబాదులో అంతంత మాత్రమే అని చెప్పాలి. కానీ వార్త తెలిసిన రేడియో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేడియో ట్రాన్స్ మిషన్ వ్యవధి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారిక సమాచారం  అందేదాకా విషాద సంగీతం ప్రసారం విషయం పక్కనబెట్టారు. ఈలోగా ఉన్నతాధికారి ఒకరు రేడియో ప్రసార వ్యవధిని పొడిగిస్తున్నట్టు సిబ్బందికి తెలియ చెయ్యడానికి  స్టూడియోలోకి వెళ్లారు. గుమ్మం దగ్గర నిలబడి తలుపు వోరగా తెరిచి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు బయట నడవాలో వున్న వేరే సిబ్బంది నిజాం మరణంపై  వినవస్తున్న వదంతులు గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ప్రసారం అయిపొయింది. అప్పటి హడావిడిలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని హైదరాబాదు నుంచి వెలువడే ఒక చిన్న పత్రికలో ఆ విషయం ప్రచురించారు. ఆ తర్వాత కూడా  జనంలో ఈ విషయం చర్చకు రాలేదు కాని పత్రికావార్తపై మాత్రం రేడియో అధికారులు స్పందించి విచారణ జరిపారు. సంబంధం వున్నవారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. (06-06-2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి