6, జూన్ 2013, గురువారం

చిన్నసార్లు వస్తున్నారు – భండారు శ్రీనివాసరావు


దేశంలో అతిపెద్ద రాష్ట్రం  అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడయిన అఖిలేష్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దరిమిలా తలలు పండిన రాజకీయ నాయకుల్లో చిన్న కదలిక మొదలయింది.  రేపో మాపో తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకు రావాలని పధకాలు రచిస్తున్న రాజకీయ పితాశ్రీలందరూ  ఆ పని ఇంకా ఎంతమాత్రం ఆలశ్యం చేయకుండా వెనువెంటనే ఆచరణలోకి తీసుకురావాలని తొందర పడుతున్నారు. ఈ  విషయంలో  మాత్రం అన్ని పార్టీల నాయకులదీ, ప్రత్యేకించి అవకాశం వున్న నాయకులందరిదీ ఒకే తీరు.
అఖిల భారత స్తాయిలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం అంతగా కలిసి రాకపోయినా ఆ పార్టీకి అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడం ఒక్కటే ఆ పార్టీ శ్రేణుల లక్ష్యం. రాహుల్ గాంధీకి ఆ నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాటవాలు వున్నాయా లేదా అన్న దానితో వారికి నిమిత్తంలేదు. ఆ పార్టీకి చెందిన అధి నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి అట్టడుగు నాయకులవరకు ఇదే వరస. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. ఇటీవల జరిగిన యూ పీ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను రాహుల్  ఒంటి భుజం మీదకు ఎత్తుకుని వొంటరిగా  పాటుపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు. ఇదే వేరొకరయితే అతగాడి రాజకీయ భవితవ్యం పార్టీలో ప్రశ్నార్ధకంగా మారివుండేది. అధినేత్రి కుమారుడు కాబట్టి పరాజయ కారణాలకు అతడిని బాధ్యుడుడిని చేయలేదు. అందుకే ఇంకా ఆయన్ని భావి భారత ప్రధాని అభ్యర్ధుల జాబితానుంచి తొలగించలేదు.
అప్పుడప్పుడు, అడపాదడపా ప్రియాంకా గాంధీ పేరు నలుగుతున్నప్పటికీ, రాహుల్ మాత్రమే ఇప్పటికీ దారీ తెన్నూ లేని కాంగ్రెస్ పార్టీకి దారి చూపే  చుక్కాని. ప్రధాని అభ్యర్ధిగా పార్టీ శ్రేణులు రాహుల్ భజన చేస్తున్నప్పటికీ జనం ఆమోదం లభించడానికి మాత్రం మరో ఏడాది  వేచివుండక తప్పదు, గత్యంతరం లేక మధ్యంతరం ముంచుకు వస్తే తప్ప.
మరో జాతీయ పార్టీ బీజేపీకి ఈ ‘యువరక్తం’ గొడవలేదు. అక్కడి అగ్రనాయకులందరూ కురు వృద్ధులే. మోడీ పేరు మీడియాలో మోగుతున్నప్పటికీ, వయస్సు రీత్యా ఆయనంత కుర్రకారేమీకాదు. నడికారు దాటినవాడే.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, యువతరం నాయకుడిగా జగన్ జనంలోకి దూసుకు పోతున్నాడు. ఆయన్ని ఎదుర్కునే రాజకీయ పార్టీలన్నీ గతంలో  చేసిన, లేదా ప్రస్తుతం  చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలే జగన్ పట్ల శ్రీరామరక్షగా మారుతూ వున్నాయి. పాతతరం నాయకులెవరికీ ఎన్నికల సమరంలో ఆయన్ని  ఎదిరించి నిలవగల సత్తా లేదని ఇటీవలి  గత చరిత్రే చెబుతోంది. వ్యక్తిగతంగా అన్ని మరకలు అంటి కూడా, అవినీతి ఆరోపణల్లో కూరుకుని పోయి కూడా, జైల్లో కాలుపెట్టి  సంవత్సర కాలం  దాటిపోతున్నా కూడా అన్ని పార్టీల్లో వున్న దిగువ స్థాయి కార్యకర్తల చూపు వై.ఎస్.ఆర్. పార్టీ వైపు వుండడం ఆయా పార్టీల అధినాయకులకు మింగుడు పడడం లేదు. వున్న పార్టీల్లో పొసగలేక, బయటకు పోయేదారిగా భావించి పోయేవాళ్ళేకానీ అలాటివారివల్ల తమ పార్టీలకు వచ్చే నష్టం ఏముండదు అని పైకి సర్ది చెప్పుకుంటున్నా లోలోపల ఎవరి భయాలు వారికి వున్నాయి. అందుకే ‘యువ రక్తం’ పేరుతొ కొత్త నాయకులను పార్టీలోకి తీసుకువస్తే  ఎన్నికల  ముహూర్తం నాటికయినా పరిస్తితి  కొంతలో కొంతయినా మారక పోతుందా అన్నది వారి ఆశ. ముఖ్యంగా ఎలాటి మచ్చా లేని, అవినీతి ఆరోపణల మరకలు అంటని విద్యాధిక యువకుడు రంగప్రవేశం చేస్తే జగన్ పార్టీని కట్టడి చేయడం సాధ్యమని భావించేవాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఆవశ్యకత హెచ్చుగావున్నట్టు తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం అధికార పీఠానికి దూరంగా వుండడం అంటే చాలా ఇబ్బంది. కాంగ్రెస్ పరిస్తితి వేరు. జాతీయ పార్టీ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలం అధికారానికి దూరంగా వున్నా ఏదోవిధంగా ఓపిక పట్టగల స్తితిలో వుంటారు. మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భరోసా వారిలో పుష్కలం. ఎదుటివారి  వైఫల్యాలే వారికి  రక్షరేకు.  ప్రత్యామ్నాయం లేక  ప్రజలే  తమకు ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వ పగ్గాలు అప్పగించక పోతారా అన్నది వారి మరో ధీమా.
కానీ టీడీపీ పరిస్తితి ఇందుకు విభిన్నం. గత ఎన్నికల్లో గెలుపు వూరించి వూరించి, కూతవేటు దూరంలో కనిపించిన అధికారం చేజారి పోయి మరో ‘చేతి’కి చిక్కిన విషయాన్ని తలచుకుని  టీడీపీ నేతలు ఇప్పటికీ చింతిల్లుతూ వుండడం చూస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అరంగేట్రం చేయడం వల్లనే మహాకూటమి మహా ఓటమి పాలయిందని లెక్కలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజం. కానీ, ప్రజాస్వామ్యంలో అంతా అంకెల మహత్యమే. ఒంటి చేత్తో లెక్కించగల అతికొద్ది వోట్ల తేడా వచ్చినా గెలుపు గెలుపే.
అందుకే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక కొత్త కార్డు కావాలి. టీడీపీ కంటే కూడా ఆయనకే వ్యక్తిగతంగా ఈ అవసరం ఎక్కువ. ఎన్టీ రామారావు గారు  తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ‘ఆంధ్రులు – ఆత్మగౌరవం’ నినాదంతో పాటు నెహ్రూ  కుటుంబం వారసత్వ రాజకీయాలను  ఎండగడుతూ చేసిన విమర్శలు కూడా  జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీ స్తాపించిన తొమ్మిది నెలలల్లోనే  అధికార అందలం ఎక్కడానికి  ఎన్టీయార్  అనుసరించిన ఆ విధానం బాగా  దోహదపడింది. మరి ఇప్పుడు అదే పార్టీ  వారసత్వరాజకీయ  విధానాలను అనుసరిస్తే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది బాబు  గుంజాటన. దీనికి తోడు పైకి వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నందమూరి, నారా కుటుంబాల నడుమ చాపకింది నీరులా పాకుతున్న  వారసత్వ ‘రాజకీయాలు’ కూడా టీడీపీ అధినేత, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం విషయంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమనే వారు కూడా వున్నారు.
ఏమయితేనేం, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ఎట్టకేలకు  ‘మంచు గడ్డను’ బద్దలు కొట్టారు. తాను టీడీపీ లో ‘కార్యకర్తగా’ పనిచేయబోతున్నట్టు ప్రకటించి ఆయన రాజకీయ అరంగేట్రం విషయంలో అలముకునివున్న అనుమానాలన్నింటినీ  ఆయనే పటాపంచలు చేశారు.        
పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే  పనిచేస్తానని ఓ పక్క చెప్పుకుంటూనే, యువతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ పార్టీలో తాను నిర్వహించబోయే పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పకనే లోకేష్  చెప్పారు.
అనేక అనూహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనతో వున్న టీడీపీ శ్రేణులకు   ఎంతో ఉత్సాహం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరెంతో  వూరట కలిగించే విషయమే ఇది.  పార్టీ ప్రతిష్ట వేగంగా కొడిగడుతున్న తరుణంలో చంద్రబాబు ఇటీవల స్వయంగా పూనుకుని పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ,  తెలంగాణా పై కేంద్రానికి  మరో లేఖ ఇవ్వడం వంటి పలు కీలక నిర్ణయాలతో పాటు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా   ‘పాదయాత్ర’ చేసి పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురింప చేశారు. దరిమిలా మార్పుచెందుతున్న రాజకీయ పరిణామాల  నేపధ్యంలో – లోకేష్ వంటి యువకుడి దన్ను వుంటే లభించే ప్రయోజనాన్ని  ఆయన అంచనా వేయకుండా వుండరు. వేయరని,  బాబు గురించి బాగా  తెలిసిన వారెవ్వరూ అనుకోరు.

అందుకే రానున్న ఎన్నికలకల్లా అన్ని పార్టీల్లో ‘చిన్నసార్లే’ కానవస్తారు.                                   

1 కామెంట్‌: