8, సెప్టెంబర్ 2012, శనివారం

ఓ మొగుడి ‘ఆత్మ’కధ



ఓ మొగుడి ‘ఆత్మ’కధ

మా ఆవిడ కంటే మా కోడలు అదృష్టవంతురాలు. ఆమెకు ప్రేమించే మొగుడు దొరికాడు.
ఆ మాటకు వస్తే  నేనూ ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఈ వయస్సులో అబద్ధం చెప్పడం యెందుకు? నన్ను ప్రేమించిన మా ఆవిడను నేను పెళ్ళాడాను.
నన్ను పెళ్ళిచేసుకుని ఆవిడ ఏం సుఖపడిందో నేను గ్యారంటీగా చెప్పలేను కాని ఆవిడ్ని చేసుకుని నేను చాలా లాభపడ్డాను.
అంటే బోలెడు బోలెడు కట్నం డబ్బులతో మా ఇంటిని మెట్టిందని కాదు. కట్టుడు చీరేతోనే కాపురానికి వచ్చినా ఆ తరువాత నా జీవితానికి ఎక్కడా లేని నిశ్చింతను తెచ్చిపెట్టింది. నా భార్య కుడికాలు మోపిన దగ్గరనుంచి నేను కాలు మీద కాలు వేసుకుని బతగ్గలిగే బతుకు నా సొంతమయింది.
మొదటినుంచీ నాది స్వతంత్ర ప్రవృత్తి. దానికి తోడు ఏదో కధలూ కాకరకాయలు గిలుకుతానని నమ్మకం.
ఈ చేతకానితనానికి నేను ఓ సిద్ధాంతాన్ని  తగిలించి ప్రచారం చేసుకున్నాను.   తన రెండు కాళ్ళమీద తాను నిలబడలేని వాడే ఉద్యోగం చేస్తాడని, తనపై తనకు నమ్మకం వున్న ఏ మనిషయినా సరే  తనకు తానుగా పైకి ఎదగడమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తాడని బీరాలు పలుకుతూ, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చినా చేయకుండా రెండు కాళ్ళు ముడుచుకుని ఇంట్లోనే వుండిపోయాను. దాంతో మా ఆవిడే నన్నూ, నా వల్ల పెరిగిన సంసారాన్నీ ఒంటిచేతిపై  సాకడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె తేనెటీగలా నిరంతరం శ్రమించింది. నన్ను నా మానాన వొదిలేసిందన్న సంతోషంతో నా బాధ్యతారాహిత్య జీవితాన్ని మరింత ఆనందంగా గడపడం మొదలుపెట్టాను.
మా అందరికోసం అంతగా కష్టపడే మా ఆవిడ పట్ల నేనెప్పుడూ రవంత జాలి చూపిన జ్ఞాపకం లేదు. అదేదో ఆవిడ బాధ్యత అనుకునేవాడిని. నేనూ నా స్నేహితులూ, కధలూ, సభలూ, సమాజాన్ని మార్చడానికి అడ్డమయిన చర్చలూ, అలా అలా అదోవిధమయిన మత్తులో జీవితం గడిచిపోయింది.
దేవుడనేవాడు వున్నాడో లేదో తెలియదుకాని, వుంటే వాడి దయవల్ల  వున్న ఒక్క కొడుకు ప్రయోజకుడయ్యాడు. అందులో నా ప్రయోజకత్వం యెంత మాత్రం లేదు. ఆ విషయం నాకు తెలుసు కానీ నలుగురికీ తెలియదు కదా. వాడి ఎదుగుదలలో నా పాత్రను గురించి  తెలిసిన నలుగురూ పదిమందిలో పొగుడుతుంటే తెలియని ఆనందంతో పొంగిపోయేవాడిని. కనీసం  మర్యాదకు కూడా అలాటి సందర్భాలలో మా ఆవిడ ప్రసక్తి తెచ్చేవాడిని కాదు.
ఇలా ఇలా మా కధ సాగిపోతూవుండగా – సినిమాలో ఇంటర్వెల్ ముందు చిన్న క్లైమాక్స్ మాదిరిగా -
కన్నతండ్రిని,  నాతో  ఒక్క మాట కూడా చెప్పకుండా నా ఒక్కగానొక్క కొడుకు, వాడి ఆఫీసులో పనిచేసే ఒకమ్మాయిని గుళ్ళో పెళ్ళాడి ఇంటికి తీసుకువచ్చాడు. బుద్దులెక్కడికి పోతాయి చెప్పండి.
కానీ నా బుద్దులు వాడికి వొంటబట్టిన దాఖలాలు ఆ తరువాత కనబడలేదు. కొత్త పెళ్ళాన్ని కాలుకందనీయకుండా చూసుకునే వాడి వైనాన్ని చూస్తుంటే నాకు వొళ్ళు మండిపోయేది. అదేమిటో ఆ క్షణంలో నాకు వాడు కొడుకన్న సంగతి కూడా మరచిపోయి కోడలిపట్ల వాడు చూపుతున్న ప్రేమా,ఆదరణా చూసి, పైకి అనకూడదు కానీ లోలోపల   అసూయపడేవాడిని. కానీ,  మా ఆవిడ మాత్రం కోడలంటే ప్రాణం పెట్టేది.  కూతురు లేని కొరతను కోడలుతో తీర్చుకుంటున్నట్టుగా వుండేది ఆమె ప్రవర్తన. నిజానికి మా ఆవిడ పడాలి అసూయ, నన్ను కట్టుకున్న అనుభవంతో, నాతో  కాపురం చేసి పొందిన  అనుభవాలతో. 
పాపీ చిరాయువు అంటారు. కానీ, జీవుల జమాలెక్కలు పైనుంచి చూసే ఆ భగవంతుడికి అది తెలిసినట్టు లేదు.
అందుకే  ఓ  రోజు ఇంట్లో కాళ్ళు బారజాపి  టీవీలో సీరియల్ చూస్తున్న నన్ను ఎవరినో అడ్డంపెట్టి పిలిచాడు. మామూలుగా సహజ బద్ధకంతో  పట్టించుకోని నేను వెంటనే బయలుదేరిపోయాను. నేను వెడుతున్న ఆటో సందు మలుపు తిరుగుతుండగానే ఓ లారీ వచ్చి కొట్టింది. అంతే. అంతవరకే తెలుసు.
కాకపొతే ప్రాణాలు పోతున్నప్పుడు మా ఆవిడ జ్ఞాపకం వచ్చింది. ఆవిడ మా కుటుంబం కోసం పడ్డ కష్టం జ్ఞాపకం వచ్చింది. బహుశా ఈ ఒక్క కారణం తోనే అనుకుంటా నేను నమ్మని ఆ దేవుడు ఈ నాలుగు ముక్కలు నలుగురితో చెప్పి గుండె బరువు తగ్గించుకునే ఈ వెసులుబాటు ప్రసాదించాడు. ఇందులో మరో మతలబు కూడా వుండవచ్చేమో. ఇది చదివి నాలాటి వారిలో ఏదయినా కొద్ది మార్పు అయినా వస్తుందన్న ఆశతో చేసివుంటాడేమో! అందుకే దేవుడు పిచ్చివాడన్నారు.పిచ్చి దేవుడన్నారు.
ఇలాటివి నేను ఎన్ని రాయలేదు గనుక.  ఎవరయినా మారారా! అంతెందుకు. నేనేమయినా మారానా!

(08-09-2012)                       
        

5 కామెంట్‌లు: