నేడే చూడండి
తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్
లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది
ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా
మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల
దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప – అన్నాడో టీవీ విప్లవకవి.
వెనుకటి రోజుల్లో, ఆవు పేడ
ఎక్కడ దొరుకుతుంది అంటే ‘దూరదర్శన్ లో ‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై
నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేశాక మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు –
ఆ పేడా పిడకలే నయమనే వారు ఎక్కువయ్యారు.
వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు,
వాటిపై తిరిగి ‘ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో
విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములు’ లక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రెజెంటర్ల మూకుమ్మడి
తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర
నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’,
తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది
రాళ్ళలా ‘యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు – అన్నాడో వికట కవి.
టీవీల్లో చూపించే చర్చలని
చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసేవాళ్ళని
చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు
పొడిపించుకుని, ‘భుజకీర్తులు’ తగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా
చెలరేగిపోతున్నప్పుడు – మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా
సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను
కూడా మించిపోయి శ్రుతి మించి ‘రాగాలు’ అందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి ‘బ్రోచే
వారెవరురా ‘ అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో ‘కరెంటు కోత’ ఒక్కటే తమను కాపాడగలగలదని
‘గజేంద్ర మోక్షం’ పద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ – ‘ఇవా ఈనాడు జనానికి
కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.
కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత
అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం
చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన
చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన
వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే –టీవీ రోట్లో పెట్టిన తలను ఆ రోట్లోనే వుంచేసి ‘రోకటి పోటు’ని ’ ఆహ్వానించి ఆస్వాదించండంటూ
సెలవిస్తున్నాడో ఉచిత గౌరవ సలహాదారుడు.
అందుకాయన ఇస్తున్న
ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
‘రాత్రి లేక్ వ్యూ గెస్ట్
హౌస్ లో ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఏం మాట్లాడుకున్నారు?
‘ముఖ్యమంత్రి, పీసీసీ
అధ్యక్షుడు వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతారని ఆజాద్ మరో మారు షరా మామూలు ప్రకటన
చేసి ఢిల్లీ విమానం ఎక్కేస్తారా?
‘ఆజాద్ హైదరాబాద్ వచ్చింది
పార్టీ వ్యవహారాలు చక్కదిద్దదానికా షబ్బీర్ ఆలీ ఇంట్లో పెళ్లి భోజనం చేయడానికా?
‘ముఖ్యమంత్రికి మళ్ళీ
ఢిల్లీ పిలుపు తప్పదా?
‘అమెరికా నుంచి సోనియా వచ్చినదాకా
ఢిల్లీ లో వెయిట్ చేస్తున్న కేసీఆర్ కి తోడుగా సీఎం అక్కడే వుండిపోతారా?
‘సోనియా గాంధీ ఆయనకు
అప్పాయింట్మెంట్ ఇస్తారా ?
‘లేకపోతె అహ్మద్ పటేల్ లేదా
అందుబాటులో వున్న మరో నాయకుడినో కల్సి సరిపెట్టుకుంటారా?
‘ఈ పరిణామాలను టీడీపీ ఎలా గమనిస్తోంది?
‘తెలంగాణా విషయంలో బాబు
కొత్త కళ్ళ వైఖరిపై సీమాంధ్ర నాయకుల వైఖరి ఎలావుండబోతోంది?
‘విజయమ్మ ముందు చెప్పి తరువాత ‘తూచ్’ అన్నట్టుగా జగన్
కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ లో కలుస్తుందా? అసలు కాంగ్రెస్సే జగన్ కాంగ్రెస్ లో
కలిసిపోతుందా?
‘ఈ పరిణామాల పట్ల చిరంజీవి
వర్గం ఏమనుకుంటోంది?
‘ఇంతకీ చిరంజీవికి ఒక వర్గం
అంటూ సొంతంగా వుందా?
‘జగన్ వ్యతిరేక వర్గమే ఆయన
వర్గమా? ‘వర్గ’మూలాల ప్రాతిపదికపై కొత్త పార్టీ పెట్టి అది పూర్తిగా పాతపడక
ముందే మూసేసి కాంగ్రెస్ తీర్ధం అడిగిపుచ్చుకున్న చిరంజీవికి ఢిల్లీ
లోని అధిష్టాన వర్గమే ఆయనకు మిగిలిన ఏకైక వర్గమా?
‘ఇలా ఇన్ని రకాల ప్రశ్నలతో
ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లో
రానున్న రోజుల్లో రాగల పరిణామాలెలా వుండబోతున్నాయి?
‘ఎంతో ఆసక్తిని
రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే, ఇప్పుడే చూడండి.’
వంటా వార్పూ కార్యక్రమంలో
‘ఇలా చేసి మాడండి’ తరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా?
ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ
చానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార
సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో – మీకు నిష్కృతి
యెట్లు? మీబోటి బోంట్లకు అదే సరయిన
మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు
వెరవకండి.
పనిలేని....పిల్లి తల గొరిగాడని సామెత కదా! ఏదో ఒకటి వండి వడ్డించాలిగా ప్రతిక్షణం :)
రిప్లయితొలగించండి