29, మే 2012, మంగళవారం

పెద్దరికంలో వున్న మజా!


పెద్దరికంలో వున్న మజా!

“జీవితమంటే శక్తి. బలహీనతకు మరోపేరే మృత్యువు. మన వూహలు,ఆలోచనలు,ఆశలు,ఆశయాలు అన్నీ మన జీవితాల్లో భాగమే!” – స్వామి  వివేకానంద



అరవయ్యో పడిలో పడ్డ చాలామంది ఏదో తెలియని అభద్రతా భావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీద పడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న భయం కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నదేమో అన్న  బాధ  కావచ్చు. కారణం ఏదయినా వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు  సహజం. అయితే వీటిని అధిగమించి జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు జీవితాన్ని కాచి వడబోసిన వాళ్లు.       

ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.
వయసుల్లో మూడు రకాలున్నాయి.జనన తేదీ ప్రకారం చెప్పుకునే వయసు ఒకటయితే,రెండోది శారీరిక ఆరోగ్యం ఆధారంగా అంచనా వేసేది. ఇక మూడో వయస్సు అనేది మన భావనలు  బట్టి ఆలోచనలు బట్టి నిర్ధారణ అవుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీ శ్రీ రాసింది ఇలాటి వారి గురించే.
ఇందులో మొదటి దానిమీద మనకు కంట్రోల్ వుండని మాట నిజమే. నిజానికి ఆ వయసును ఏమాత్రం మార్చలేము, ఏమార్చలేము.
కాకపోతే రెండోదాన్ని మానవ ప్రయత్నంతో  కొంతవరకు అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే సరయిన  పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసును ఉల్లాసంగా వుంచుకోవడం ద్వారా కొంతమేరకు వయసు ప్రభావం శరీరం మీద పడకుండా చూసుకోవచ్చు. సానుకూల వైఖరి, ఆశావహ దృక్పధం పెంపొందింపచేసుకోవడం వల్ల మూడో రకం వయస్సును అదుపుచేసుకోవడానికి  కుదురుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని ‘భాగ్యానికి’ నిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.
భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబం అందరూ ఆనందంగా సంతోషంగా వుండడం. వయసు మళ్లి  పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి  కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ వారిని ఇబ్బందుల పాలు చేయకుండా ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది. కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచుకుంటే ఇదేమంత పెద్దపని కాదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం, డాక్టర్ రాసిచ్చిన మందులు సక్రమంగా  వేసుకోవడం – ఇలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలిగితే పిల్లల్ని అనవసర శ్రమలనుంచి రక్షించినవాళ్ళవుతారు.            
ధనమూలం ఇదం జగత్!
డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుకాదు కాని ఆనందంగా జీవించడానికి  డబ్బు కావాలి.
అందుకే పశువుకు తిన్నది దండి మనిషికి వున్నది దండి అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో గౌరవంగా జీవించడానికి, కుటుంబ సభ్యులనుంచి ప్రేమాదరాలు పొందడానికి, ఎంతో కొంత సొంత సొమ్ము ప్రతి ఒక్కరికీ అవసరం. వయస్సు మీదపడ్డ తరువాత శారీరిక శ్రమ చేసి సంపాదించడానికి వీలులేని రోజుల్ని ముందుగానే అంచనా వేసుకుని  భద్రమయిన భవిష్యత్ జీవితం కోసం తమకంటూ కొంత మొత్తాన్ని  కూడబెట్టుకోవడం చాలా అవసరం. దీన్ని స్వార్ధం అని ఎవ్వరూ అనుకోరు. మీ పిల్లలు మీ అవసరాలను కనుక్కోగలిగితే అది బోనసుగా భావించాలి. మీ అవసరాలు కనుక్కోలేని అవసరాలు వాళ్లకు వుంటే దాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకునే పెద్దరికం మీకుండాలి. అప్పుడే ముదిమి వయస్సులో చీకూ చింతా లేని జీవితం మీ సొంతమవుతుంది.

హాయిగా మనసెంతో తీయగా
మనసును హాయిగా వుంచుకోవాలి. ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. ‘మా రోజుల్లో అయితే...’ అంటూ నస పెట్టకుండా వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం  అలవరచుకోవాలి. వేళకు నిద్రపోవడం, చక్కటి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, నిత్య జీవితంలో హాస్యాన్ని ఆస్వాదించగలగడం – ఇవన్నీ మనసుకు హాయినిచ్చి వయసును తగ్గిస్తాయి.      
సమయం అమూల్యం
ఈ జీవన యానంలో సంపాదించింది యెంత వున్నా పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది  మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే,  ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం  చేతిలో వున్న పైకం. దాన్ని జాగ్రత్తగా ప్రయోజనకరంగా వాడుకోగలగాలి. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం  నేర్చుకోవాలి.
మార్పు శాశ్వితం.
మారుతూ  వున్నప్పుడు అది శాశ్వితమెలా అవుతుందన్న అనుమానాలు పెట్టుకోకూడదు. మార్పును అంగీకరించడం అంటే వరద వాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువ తరంతో, రానున్న తరంతో  సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ‘ముసలి వాసనలు’ మన నుంచి తప్పుకుంటాయి.   కాలక్రమంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగానే మన జీవితాలు  ఇప్పుడిలా  సుఖప్రదంగా గడుస్తున్నాయన్న  వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి.  
నాకేమిటి?
స్వార్ధం లేని మనిషంటూ వుండడు.ఏమిచేసినా దీనివల్ల ‘నాకేమిటి’ అనేవాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు.కానీ వున్న ఈ చిన్ని జీవితంలో అవసరంలో వున్నవాడికి సాయపడడం వల్ల కలిగే సంతృప్తికి ఏదీ సమానం కాదు.ఇచ్చుటలో వున్న హాయిని కనీసం జీవితం చరమాంకంలో కూడా అనుభవించలేకపోతే ఇక దానికి సార్ధకత లేనట్టే. ఆ జీవితానికి అర్ధం లేనట్టే.

మరచిపో !మన్నించు!!
ఈ రెండుపదాలు చాలా చిన్నవే అయినా నిజానికి  ఎంతో గొప్పవి.ఇతరుల తప్పిదాలు గురించి అస్తమానం ఆలోచించడం వల్ల వొరిగేదేమీ వుండదు.ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపడానికి మనం గాంధీలం కాకపోవచ్చు.  కానీ వయసు మీదపడుతున్న దశలో మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం ఈ మాత్రం సర్దుబాట్లు అవసరం. లేకపోతే పెరిగేది మన ‘బీపీ’నే.
ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే
మరణ భయం
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. రేపు పదవీ విరమణ చేసే వ్యక్తి కూడా చేస్తున్న ఉద్యోగం  శాశ్వతమే అన్న భ్రమలో వుంటాడు. అలాగే మరణం తధ్యమని తెలిసీ అది తన జోలికి రాదన్న భ్రాంతిలో మనుషులు బతుకుతారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణ భయం పట్టుకున్నదంటే చాలు ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే. మనం చనిపోతే భార్యా పిల్లలు తట్టుకోలేరన్న మరో అర్ధం లేని అనుమానం మనిషిని పీడిస్తుంది. కానీ సక్రుత్తుగా తప్ప ఇది జరిగే పని కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి కుటుంబంలోని వారు బాధ పడడం సహజం. కానీ  ఆ బాధ, ఆ ఆవేదన  శాశ్వితంగా అలాగే వారిని అంటుకుని వుండవు. కాలమే అలాటి గాయాలు మానిపోయేలా చేస్తుంది. అది ప్రకృతి ప్రసాదించిన వరం.
అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.
జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.
వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా  వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాది
ద్దాం రారండి.
(29-05-2012) 

4 కామెంట్‌లు:

  1. నూటికి నూరుపాళ్ళూ ఏకిభవిస్తున్నా....

    రిప్లయితొలగించండి
  2. వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా వెనుకడుగు వేద్దాం పదండి. వెనుకటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాది
    ద్దాం రారండి.

    I am ever ready ok. wish u all the best

    రిప్లయితొలగించండి
  3. ఈ రోజు కాకపొయినా రేపు అయినా మీబాటలోకి రావలసిన వారము చూస్తుండగానే 45కి వచ్చాము ఇంక 60కి ఎన్నాళ్ళు.మీతొ వస్తే కొన్ని అనుభవాల సారంశమన్నా దక్కుతుంది దానితొనన్నా ఆసమయములో ప్రాప్తకాలఙ్ఞత చూపవచ్చు.

    రిప్లయితొలగించండి