14, జనవరి 2012, శనివారం

తెలుగునాట సంగీతాన్ని బ్రోచేవారెవరురా!


తెలుగునాట సంగీతాన్ని బ్రోచేవారెవరురా! ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 
  
సంగీతం గురించిన వ్యాసాలు చదివి స్పందించిన మైత్రేయి, చెన్నాప్రగడ - వీరిరువురూ  తెలుగునాట కర్నాటక సంగీతానికి తమిళనాట వున్నంత  ఆదరణ ఎప్పుడు వస్తుందో అన్న  ఆవేదన వ్యక్తం చేసారు.  అలా రావడానికి ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలో చర్చ జరగాలి అన్నారు. వారి ఈ  ఆవేదనతో పాలు పంచుకునే వారు తెలుగునాట ఎందరో వున్నారు.
అందులో  భాగంగానే ఈ నాలుగు వాక్యాలు.



తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాలు 

 జనవరి పద్నాలుగు శనివారం త్యాగరాజ స్వామి ఆరాధన జరుగుతోంది.  తంజావూరు జిల్లా తిరువాయూర్ లో త్యాగరాజు సమాధి వద్ద అందరూ ఆయన రాసిన కీర్తనలు గానం చేస్తూ వుంటారు.  తొంభై శాతం మంది తమిళులే. కాని వారు పాడేవన్నీ తెలుగులో త్యాగరాజు రాసిన కీర్తనలే.  ఆంధ్ర ప్రాంతం నుంచి త్యాగరాజు పూర్వీకులు తిరువాయూర్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అయినా తెలుగు మర్చిపోలేదు.  తమిళదేశం నడిబొడ్డులోవున్నా తెలుగు లోనే కీర్తనలు రాసారు. త్యాగరాజు  సిద్ధి  పొందిన తర్వాత  ఆయన సమాధి నిర్లక్ష్యంగా పడి వుంటే బెంగుళూరు నాగరత్నమ్మ అనే వో గొప్ప విద్వాంసురాలు తాను  సంపాదించినదంతా ధారపోసి సమాధి మందిరం కట్టించి ఓ  పెద్ద ప్రాంగణంగా అభివృద్ధి చేశారు. త్యాగరాజ  కీర్తనలన్నీ తెలుగులో  పాలరాతి మీద చెక్కించారు.  సంగీతం అంటే చెవి కోసుకునే వారందరూ అక్కడికి వెళ్లి త్యాగరాజ స్వామి సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తుంటారు.  మార్గశిర బహుళ పంచమి నాడు త్యాగరాజ వర్ధంతిని పురస్కరించుకుని ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.  సంగీతం కావాలనుకొంటే తెలుగు వచ్చి తీరాలి.  సంగీత త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఎవ్వరూ తమిళంలో కీర్తనలు రాయలేదు.  అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్రంతో పాటు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా తెలుగులోనే కీర్తనలు రాశారు. తమిళనాడులో కచేరీలు జరిగినా వొకట్రెండు  మినహా అన్నీ తెలుగులో కీర్తనలే. వాళ్లకు సంగీతమే ప్రధానం.  ఈ వొక్క విషయంలో మాత్రం వాళ్లు తమ సహజసిద్ధమయిన  భాషాదురభిమానాన్ని కాస్త  పక్కన పెడతారు. తెలుగువాళ్ళం మనకి అంత వొరపు లేదు.   
1940లో ఓసారి  తమిళులందరికీ  తెలుగులో ఎందుకు పాడాలి ? మన తమిళంలో పాడలేమా ? అనుకుని ఓ  ప్రయత్నం చేసారు.   రాజా అన్నామలై చెట్టియార్, కల్కి కృష్ణ మూర్తి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.  సంగీతానికి కులాన్ని కూడా ఆపాదించారు, బ్రాహ్మణుల చేతిలో చిక్కుకు పోయిందని. అప్పుడు చెట్టియార్  మ్యూజిక్ అకాడెమి  ప్రెసిడెంట్ కూడా.  రెండు మూడేళ్ళు కష్టపడ్డా ఫలితం కనపడలే. తమిళం సంగీత పరమయిన భాష కాదని వారికి తేలిపోయింది.  సంగీతానికి తెలుగు, సంసృతం,  కన్నడం, మలయాళం సరిపోతాయి కాని తమిళం పనికి రాదని అర్ధమయింది.
 1980 లో మరోసారి దండపాణి దేశికర్,  మదురై   సోమసుందరం ఎక్కువ తమిళ  కీర్తనలు పాడడం ప్రారంభించారు.  అయితే శ్రోతలు తగ్గడంతో వారూ ఈ ప్రయత్నంలో వెనక్కి తగ్గారు.  ఇదంతా ఎందుకంటే ఇంత గొప్ప తెలుగు కీర్తనలు వున్నా మనం ఎందుకు ఆదరించడం లేదు ? అన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించడానికే. తమిళనాడులో వున్న  ప్రాభవం తెలుగునాట రావాలంటే ఏమి చెయ్యాలో తెలియని అయ్యోమయంలో వుండి పోయాం.  ఎందుకు ? ఎందుకు ?ఎందుకు ? అన్న ప్రశ్నలే ఈ అయోమయంలో నుంచి పుట్టుకు వస్తున్నాయనుకోవాలి.
తెలుగునాట కూడా వొకప్పుడు సంగీతానికి మంచి ఆదరణ వుండేది. విజయనగరం సంస్థానంలో సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేశారు. పాతికేళ్ళక్రితం వరకు విజయనగరంలో సంగీతం నేర్చువడం అంటే  ఎంతో గొప్ప. అల్లాగే కచేరీలు వినడానికి ఎన్నో సభలు ఉండేవి. కాకినాడ సరస్వతి గానసభ అన్నిటి కంటే పాతది. సూర్యకళా మందిరం అని ఆరోజుల్లోనే సంగీతం కోసం ఓ ఆడిటోరియం  కట్టారు.  టి.ఆర్. మహాలింగం, చెంబై వైద్యనాధ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, అరియక్కుడి రానుజ అయ్యంగార్,  సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పాల్ఘాట్ మణి అయ్యర్,  పళని సుబ్రహ్మణ్యం,  పట్టమ్మాళ్ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, వసంత కుమారి, మధురై మణి అయ్యర్, జీ ఎన్ బీ   వంటి విద్వాంసులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కచేరీలు చేసే వారు. బెజవాడలో  కనకదుర్గ కళాసమితి, త్యాగరాజ సంగీతకళా సమితి, సద్గురు సంగీతసభ వాళ్లు  నెలవారీ కచేరీలు  ఏర్పాటుచేసే వారు. ఏడాదికోసారి ఉత్సవాలు ఉండేవి. అమలాపురంలో త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు.  పాలకొల్లు వర్తక సంఘంవారి త్యాగరాజ ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈనాటి  మాండొలిన్  శ్రీనివాస్ పాలకొల్లు నుంచి వచ్చినవాడే. తెనాలిలో నారుమంచి సుబ్బారావుగారి సీతారామగాన సభ అంటే తమిళ సంగీత  విద్వాంసులకు ఎంతో గౌరవం. ఇలా ఎన్నయినా చెప్పవచ్చు గత వైభవం  గురించి.  ఇప్పుడు ఈ సభలు కనుమరుగయిపోయాయి. 
1966 ప్రాంతంలో హైదరాబాదులో  త్యాగరాజ గానసభ ప్రారంభమయింది.  మొదటి రోజుల్లో  చిక్కడపల్లి లేబర్ వెల్ఫేర్  సెంటర్ ఓపెన్ స్టేజి పైన కచేరీలు జరిగేవి. కే.ఎల్. రెడ్డి గారని టెలిఫోన్స్  డిస్ట్రిక్ట్ మేనేజర్ వుండేవారు. వయోలిన్ వాయించేవారు.  ఇప్పటి హైదరాబాద్ సిస్టర్స్ లలిత, హరిప్రియలు  వోణీలు వేసుకొని కచేరీలు చెయ్యడం చాలామందికి గుర్తు వుండేవుంటుంది. హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి, రాఘవాచారిల గురువు సుసర్ల శివరాం, ఆర్. జానకీదేవి, వీ.ఎస్. అనంతరావు, మారెళ్ళ కేశవ రావు, నేతి శ్రీరామశర్మ, కోలెంక వెంకటరాజు, ఆకెళ్ళ మల్లిఖార్జున శర్మ, వాసా పద్మనాభం వంటి స్థానిక విద్వాంసులు సభ స్థిరపడడానికి దోహదపడ్డారు.  త్యాగరాజ గానసభ నిలదొక్కుకొని ఓ  ఆడిటోరియం కట్టిన తర్వాత త్యాగరాజ విగ్రహం మాత్రం పెట్టి సంగీతాన్ని వొదిలేసింది.  హాలు  అద్దెకు ఇచ్చుకోవడం మినహా సంగీతానికి ఇప్పుడు చేస్తున్నదేమి లేదు. నిజానికి ఇప్పుడున్న ఆర్ధిక స్తోమతకు చక్కటి కచేరీలు ఏర్పాటు చెయ్యొచ్చు.  ఇప్పటి నిర్వాహకులకు ఆ శ్రద్ధ వున్నట్టు లేదు. (14-01-2012)

7 కామెంట్‌లు:

  1. మీరు రాసింది నిజమే.కాని ఇప్పటికీ ఇంకా కొందరు యువతరంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ప్రతిభావంతులు కూడా ఉన్నారు.'పాడుతా తీయగా' లో పాల్గొనే పిల్లలు చాలామంది సంగీతం నేర్చుకొంటున్నవారే.సంగీతకళాశాలలూ ,సభలూ ఉన్నాయి.కచేరీలు జరుగుతున్నాయి.కాని ప్రజల్లో స్పందన తక్కువ.ప్రభుత్వ సహాయం చాలా తక్కువ.తమిళనాడుతో పోలిస్తే మనం ఈ విషయంలో హీనం గా వున్నాము.ఇంకా చాలా కృషి జరగవలసిఉంది.మావూళ్ళో మాత్రం (శ్రీకాకుళంలో) ప్రతి యేటా త్యాగరాజ ఆరాధన,రెండు రోజులు కచేరీలు మాత్రం నిర్వహిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ...
    సద్గురువు గురించి నా అజ్ఞానాన్ని ఓ రెండు వ్యాసాల్లో ప్రదర్శించాను. ఓ సారి చూసి దోషాలు సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  3. @PURANAPANDAPHANI- నేను చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే -'అద్భుతం' - భండారు శ్రీనివాసరావు (దాన్ని ఆర్వీవీ కృష్ణారావు గారికి కూడా పంపాను)

    రిప్లయితొలగించండి
  4. @కమనీయం _ ధన్యవాదాలు.- భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  5. నిజంగా బాధాకరం శ్రీనివాసరావుగారూ.... ఏదో సినిమాల ప్రభావమా అని కాస్త అన్నమయ్యకు, రామదాసుకు దక్కుతున్న గౌరవం త్యాగరాజుకు దక్కాల్సినంత దక్కటంలేదు. తెలుగువారికి పొరుగింటి పుల్లకూరే రుచికరమేమో!

    రిప్లయితొలగించండి
  6. @అచంగ - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  7. భక్తి టి.వి. పుణ్యామా అని మొన్న తిరువయ్యూరు లో జరిగిన ఆరాధనోత్సవాలు లైవ్ లో చూసే భాగ్యం కలిగింది. జన్మ ధన్యమైనట్లనిపించింది.
    త్యాగరాజ ఆరాధనోత్సవాలలో భాగంగా అనేక ఇతర కార్యక్రమాలతో బాటు మదరాసు మహా నగరంలో గత ఏడు సంవత్సరాలుగా "చెన్నయిల్ తిరువయ్యూర్" అనే కార్యక్రమం వారం రోజులపాటు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 18, 2011 నుండి 25 డిసెంబర్ 2011 వరకు కామరాజ్ అరంగంలో జరిగిన ఈ వేడుకల్లో ఉదయం 7.30 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు, భారత దేశంలోనే పేరెన్నిక గన్న గాత్ర విద్వాంసులే గాక వీణ, వేణువు, మ్రుదంగం, మొదలైన వాయిద్యాల విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మన తెలుగునాట కూడా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఒక మాదిరి పట్టణాలలో కూడా జర్గుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి, ఆ మహనీయుని పట్ల తమిళ సోదరులు చూపుతున్న ఆదరణ లేదనే చెప్పాలి.
    నిజంగా మీరన్నట్టు మన వాళ్ళు ఆ స్థాయికి ఎప్పుడు చేరతారో మరి. ఖచ్చితంగా మీ వ్యాసాలు ఈ దిశలో ఎంతో ఉపకరించగలవనిపిస్తున్నది. ఆర్వీవీ గారు అండ్ భండరు గారు క్యూడోస్ టు యు నాట్ ఓన్ల్య్ ఫర్ ద ఎక్సలెంట్ ఆర్టికిల్ బట్ అల్సో ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ ద డివైన్ మ్యూజిక్. ప్రసాద శర్మ

    రిప్లయితొలగించండి