12, జనవరి 2012, గురువారం

‘కొలవెరి కొలవెరి కొలవెరి ది’


 ‘కొలవెరి కొలవెరి కొలవెరి ది’ - ఆర్వీవీ  కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 

‘వై దిస్ కొలవెరి కొలవెరి  కొలవెరి ది’ అంటూ తమిళ నటుడు ధనుష్ సృష్టించిన ‘కొలవెరి పాట’ పుట్టించిన  ప్రభంజనంతో  జనం ఓ పక్క  ఊగిపోతూ వుంటే,  'సా పా సా' లు ఎవరికి  కావాలోయ్!”  అనే వాళ్లకు ‘మద్రాస్ సంగీతోత్సవం’ ఓ  చక్కటి జవాబు.
రాయపేటలోని మ్యూజిక్ అకాడెమి హాలు   పొద్దున్నుంచి  రాత్రి దాకా సంగీత అభిమానులతో నిండిపోతూ వుండేది. పక్కనే వున్నమరో చిన్న ఆడిటోరియం ‘కస్తూరి శ్రీనివాస బిల్డింగ్’ లో  ఎల్సీడీ స్క్రీన్ పెట్టి కచేరీలు లైవ్ ఇస్తుంటే  ఆ హాలు  కూడా ఖాళీ లేకుండా నిండిపోయేది.  ఇవన్నీ ఫ్రీ  కాదు. టిక్కెట్టు  పైనే.  పదిహేను రోజుల సీజను టిక్కెట్టు  అక్షరాలా తొమ్మిదివేల రూపాయలు. అన్నీ   ముందే అయిపోయాయి.  ఇక రోజువారీ టిక్కెట్టు  మూడు వందల రూపాయలు.  పైన  బాల్కనీ వెనక రోలో సీటు వంద రూపాయలు. ఏ కచేరీకి  ఆ కచేరీ టిక్కెట్లు కచేరీ ప్రారంభం కావడానికి ముందు ఏ రోజుకారోజు  ముందే అమ్ముతారు. దానికి  పెద్ద క్యూ.  ఎల్సీడీ  స్క్రీన్ మీద చూసే హాలులో వేశ రుసుము యాభయ్ రూపాయలు. అలాగే, ఆడిటోరియం క్యాంటీన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. వెనక అయిదారు రూపాయలకు దొరికే కాఫీ ఇప్పడు ఇరవై. భోజనం ఏకంగా నూట పాతిక పైమాటే. సంగీతం అంటే చెవికోసుకునే అభిమానులు  టిక్కెట్టు ధరను  లెక్కపెట్టక పోవచ్చు. పైగా సంగీతాన్ని ప్రోత్సహించే తత్వం అక్కడి వారిది. కాకపొతే, సహజంగా భోజన ప్రియులయిన తమిళ సోదరులు క్యాంటీన్ ధరలను హరాయించుకోలేకపోతున్నారేమోనన్న భావన కలిగింది.  
అయితే, ఈ సంగీతోత్సవాల నిర్వహణను కొన్నేళ్లుగా గమనిస్తూ వస్తున్నవారికి గతానికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనపడుతోంది. టాప్ కార్పోరేట్  సంస్థలతోపాటు మీడియం, స్మాల్ స్కేల్  కంపెనీలు కూడా ఇప్పుడు వీటికి స్పాన్సర్లే. కాంపౌండ్ మొత్తం  అంగుళం ఖాళీ లేకుండా బ్యానర్లు  కట్టేశారు.  టయోటా కంపెనీ  వాళ్ళయితే ఏకంగా ఓ  పడవలాంటి లేటెస్ట్ మోడల్ కారుని డిస్ ప్లే కి పెట్టారు. సంగీతాన్ని మహా  గొప్పగా మార్కెట్ చేసేసారు. ఇక సీడీలు,మ్యూజిక్ వాయిద్యాల  అమ్మకాలు సరేసరి.  అంతా డిజిటల్ అయిపొయింది కదా. శ్రుతి కోసం తంబురా చేతితో మీటడం పోయింది. ఎలక్ట్రానిక్ శ్రుతి బాక్సులు వచ్చేసాయి. తోడుగా   ఇప్పుడు ఎలక్ట్రానిక్ వీణ కూడా వచ్చింది.  ఏ పాట కావాలంటే అది అలవోకగా వాయించేయొచ్చేమో. ఇక లోపల ప్రేక్షకుల్లో   కూడా చాలా మార్పు వచ్చింది. మొన్నటి దాకా సంగీతం వినడానికి తలనెరిసిన వాళ్ళు, పెద్ద వయస్సు వాళ్ళు ఎక్కువగా వచ్చే వారు.  హాలులో  మూడు వంతులు వీళ్ళు వుంటే మిగిలిన ఒక వంతు  యువతరం వారన్న మాట. కానీ ఇప్పుడు సీను పూర్తిగా  మారిపోయింది. వినే వాళ్ళలో మూడొంతుల మంది ముప్ఫయ్ ఏళ్ల లోపు వాళ్ళే.  అలాగే స్టేజి మీద విద్వాంసులు కూడా. ఇన్నాళ్ళు సాయంకాలం స్లాట్లు సీనియర్ విద్వాంసులకు కేటాయించి, ఉదయం మధ్యాహ్నం కచేరీలు జూనియర్లకు ఇచ్చే వారు. సాయంత్రం హాలు కిటకిటలాడితే ప్రొద్దుట, మధ్యాహ్నం కాస్త పలచగా వుండేది. ఇప్పుడలా కాదు. సాయంకాలం పాడేవాళ్ళంతా యువతరం ప్రతినిధులే.  ఎంతో అలవోకగా కచేరీలు చేసేస్తున్నారు.  ముప్ఫయ్యేళ్ల వయస్సులో ముప్ఫయ్యేళ్ల అనుభవాన్ని రంగరించి చూపుతున్నారు. ఎన్నెన్నో అపురూప కీర్తనలు చక్కగా వినిపిస్తున్నారు. శాస్త్రీయ  సంగీతం యువతరానికి దూరం అయిపోతున్నదేమో అన్న సందేహం ఇక ఏ  మాత్రం అక్కర్లేదు. అన్ని రంగాల్లో మాదిరిగా  సంగీతంలో కూడా ఈనాటి యువతరం ప్రదర్శిస్తున్న చొరవకు, అనురక్తికి   జోహార్లు. మరో విషయం.  ఇది వరకు సంగీతం నేర్చుకొంటే చదువు అబ్బదు అనేవారు. ఇప్పటి పరిస్థితి వేరు.  ఈనాడు సంగీతాన్ని వృత్తిగా  చేపట్టిన వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివినవారే. చాలా మంది ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం.లలో పట్టభద్రులు.  అందుకేనేమో గతంలో ఇరవై ఏళ్ళు సాధన చేస్తే కాని రాని విద్వత్తు ఇప్పుడు చాలా త్వరగా వంటపడుతోంది.   అలాగే సంగీతం చాలా ఖరీదయిన వ్యవహారంగా మారిపోయింది కూడా.   వీళ్ళు డిమాండ్ చేస్తున్న పారితోషికం కూడా చాలా ఎక్కువే. లక్షల్లో వుంటోంది. బహుశః ఇతర రంగాల్లో వున్న వాళ్ళ సహాధ్యాయులకు తీసిపోకుండా తాము కూడా సంపాదించాలన్న కుతూహలం కావచ్చు. సీనియర్ విద్వాంసుల నుంచి నేర్చుకోవాలన్న తపన కూడా వీరిలో కనపడడం మరో మంచి విషయం.
మొన్నటి మ్యూజిక్ ఫెస్టివల్లో  ఎమ్మెస్ గోపాలకృష్ణన్, టీకే మూర్తి,  ఉమయాల్పురం శివరామన్. ఆర్కే శ్రీకంఠన్, వి. కమలాకరరావు, లాల్గుడి జయరామన్  వంటి వారు యువతరంతో డీ కొనవలసివచ్చింది.  రెండు తరాల మధ్య   గమనించ తగ్గ తేడా వొకటి వుంది.  సరే! యువతరం విద్వాంసులు అద్భుతంగా  కచేరీలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో సీనియర్లను కూడా మరిపిస్తున్నారు. బానే వుంది.  మన ( కర్ణాటక ) సంగీతానికి ఇతర సంగీతరీతులకు ఒక మౌలికమైన తేడా వుంది.   మనది ఆధ్యాత్మికతోకూడినది. భౌతికమైన అనుభూతి ఒక్కటే ప్రధానం   కాదు. సీనియర్లు  పాడినప్పుడు కలిగే భక్తిభావం యువతరం పాడినప్పుడు కొరవడుతున్నదనే చెప్పాలి. కాకపొతే ఇది అందరికీ వర్తించకపోవచ్చు సుమా.  (12-01-2012)    

2 కామెంట్‌లు:

  1. అంత రేంజ్ లో కాకున్నా మన భాగ్యనగరంలో ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో త్యాగరాజ ఉత్సవాలు ప్రతి ఏడూ కర్ణాటక సంగీత వైభవాన్ని చాటుతూ జరుగుతాయి. ఈ సంవత్సరం పదమూడున పంచరత్న కీర్తనలతో మొదలు. ఆసక్తి ఉన్నవాళ్ళకు వీనులవిందు, ఫ్రీగానే సుమండీ..

    రిప్లయితొలగించండి
  2. చెన్నాప్రగడ12 జనవరి, 2012 11:11 PMకి

    అసలు కొలవెరి కొలవెరి డి పాట నేపథ్య సంగీతంలో ప్రధానంగా వినిపించేవి అచ్చమైన సంప్రదాయ వాయిద్యాలైన డోలూ సన్నాయిలే.

    తెలుగునాట శాస్రీయ సంగీతానికి తమిళనాటలాంటి ఆదరణ లభించే రోజులెపుడొస్తాయో మరి.

    ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు వహిస్తే అటువంటి చక్కటి పరిస్థితులొస్తాయో చర్చ జరగాలి. శ్రీనివాసు గారూ దయచేసి ఈ అంశంపై పత్రికల్లో కూడా వ్యాసం రాసే ప్రయత్నం చేయగలరా?.

    రిప్లయితొలగించండి