29, ఆగస్టు 2011, సోమవారం

భారతంలో అవినీతి మూలాలు – భండారు శ్రీనివాసరావు

భారతంలో అవినీతి మూలాలు – భండారు శ్రీనివాసరావు


మహా భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం - అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. ఉజ్వల తేజస్సుతో జన్మించిన ఆ శిశువుకు విష్ణురాతుడు అని నామకరణం చేస్తారు. 


తల్లి కడుపులో వున్నప్పుడే తనకు రక్షకుడుగా వున్న ఆ దైవం (కృష్ణ భగవానుడు) సర్వవ్యాపకుడా అన్న సందేహం అతడికి చిన్ననాటినుంచే కలుగుతుంది. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షగా పరికించి చూసే విష్ణురాతుడికి పరీక్షిత్తు అనే పేరు స్తిరపడుతుంది. యుక్తవయస్సు రాగానే అతడికి ఐరావతి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్లి ఒక క్రూర మృగాన్ని వెంటాడుతూ శమీక మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు. ఆ వేళలో తపస్సమాధిలో వున్న శమీకముని, రాజు రాకను గమనించడు. డస్సిపోయిన స్తితిలోవున్న చక్రవర్తి ,క్షణికావేశంలో, చచ్చిపడి వున్న ఒక పాముని ముని మెడలో వేసి, కసి తీర్చుకుని తనదారిన వెడతాడు. కాసేపటికి ఆశ్రమానికి తిరిగివచ్చిన శమీక మహర్షి కుమారుడు తండ్రి మెడలో వేలాడుతున్న మృత సర్పాన్ని గమనించి కుపితుడయి- ‘ఈ దుష్కార్యానికి వొడిగట్టినవాడు ఏడు రోజుల్లో పాము కాటు చేతనే మరణిస్తాడ’ని శపిస్తాడు. ఆ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాపపడతాడు. మృత్యువు సమీపంలో వున్నందున వున్న కొద్దికాలాన్ని జ్ఞానబోధకుల సత్సాంగత్యంలో గడపాలని నిర్ణయించుకుంటాడు. వ్యాసుడి కుమారుడయిన శుకమహర్షి భాగవత సప్తాహ బాధ్యతను స్వీకరిస్తాడు. పవిత్ర గంగా తీరంలో పరమాత్మ లీలలను తెలుసుకుంటూ మోక్షమార్గ అన్వేషణలోవున్న పరీక్షిత్తు ప్రాణాలు హరించడానికి నాగుల రాజయిన తక్షకుడు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో అతడికి ఒక పండితుడు పరిచయమవుతాడు. మాటల మధ్యలో, అతడో మంత్రశాస్త్రవేత్త అనీ, ఎటువంటి కాలకూట విషానికయినా విరుగుడు ప్రసాదించగల మహిమాన్వితుడనీ తక్షకుడు తెలుసుకుంటాడు. కానీ, నిజానికి అతడికా శక్తియుక్తులున్నాయో లేదో, వుంటే అవి ఏపాటివో తెలుసుకోవాలని అనుకుంటాడు. దారిపక్కన పచ్చటి కొమ్మలు ఆకులతో అలరారుతున్న ఓ వృక్షాన్ని కాటు వేస్తాడు. తక్షక విషాగ్నికి ఆ పచ్చటి వృక్షం కాస్తా క్షణకాలంలో మాడి మసి అవుతుంది. పండితుడు చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని పరికించి తన దగ్గరవున్న మంత్రజలాన్ని ఆ బూడిద కుప్పపై చల్లుతాడు. కనురెప్పపాటులో అ ఆ చెట్టు పచ్చటి కొమ్మరెమ్మలతో యధారూపును సంతరించుకుంటుంది. ఈ అద్భుతాన్ని గమనించిన తక్షకుడికి మతిపోతుంది. ఈ పండితుడు తనవెంట రాజువద్దకు వస్తే తను తలపెట్టిన లక్ష్యం నెరవేరదు. తన విషంతో పరీక్షిత్తు ప్రాణం తీయడం అనేది తనకు తృణప్రాయం. కానీ ఏం లాభం? మరణించిన మహారాజును బతికించడం అన్నది ఈ పండితుడుకి చిటికె లోని పని. అందుకే ఆలోచించి ఆ మంత్రగాడిని వెనుకకు మళ్లించే ఆలోచన చేస్తాడు. పునర్జీవితం ప్రసాదించినందుకు మహారాజు నుంచి అందబోయే ధనధాన్యకనకవస్తువాహనాలకు రెట్టింపు ఇస్తానని ప్రలోభపెడతాడు. వచ్చిన పని మార్గమధ్యంలోనే అయిపోతున్నందున ఆ పండితుడు కూడా ఎంతమాత్రం సందేహించకుండా తక్షకుడు ఇవ్వదలచిన బహుమానాలను స్వీకరించి తిరుగు ముఖం పడతాడు. చేయి తడపడం ద్వారా పనులు చేయించుకునే ఒక దుష్ట సంప్రదాయానికి తక్షకుడు ఆ విధంగా తొలి బీజం వేశాడు.


భారత కాలంలో బహుమానం పేరుతొ తొలిసారి రూపుదిద్దుకున్న ఈ ‘ఇచ్చిపుచ్చుకునే’ వ్యవహారానికి కాలక్రమంలో అవినీతి, లంచగొండితనం అనే వ్యవహార నామాలు స్తిరపడ్డాయి.

చిలుకూర్ బాలాజీ


(చిలుకూరులో వెలసిన ‘వీసా బాలాజీ’ అనే వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వంశ పారంపర్య ధర్మకర్తగా వుంటూ ఆలయ పరిరక్షణ ఉద్యమాన్ని వొంటి తాటిపై సాగిస్తున్న ‘వన్ మ్యాన్ ఆర్మీ’ , పట్టువొదలని అపర విక్రమార్కుడు సౌందర్ రాజన్ కుమారుడు రంగరాజన్ భక్తులకు అందిస్తున్న అనుగ్రహభాషణం ఆధారంగా – రచయిత - 29-08-2011)





2 కామెంట్‌లు: