26, ఫిబ్రవరి 2011, శనివారం

రైల్వే బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


రైల్వే బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


ఏ బడ్జెట్ అయినా – అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ‘ఆహా ఓహో’ బడ్జెట్ అయితే ప్రతిపక్షం వారికి ‘అంకెల గారడీ’ బడ్జెట్. కానీ ఈ రెండు కళ్ళే కాదు ‘మూడో కన్ను’ మరోటి వుంది. అది ప్రజలది.

మొన్నటికిమొన్న అసెంబ్లీలో ఆర్ధికమంత్రి రామనారాయణరెడ్డి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోనే కొత్త పన్నులువేసే పద్ధతికి ఏనాడో ప్రభుత్వాలు స్వస్తి చెప్పేశాయి కనుక, రాష్ట్ర బడ్జెట్ గురించి గతంలో వున్న ఆసక్తి ఈనాడు జనంలో లేనట్టే లెక్క. అయినా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులందరూ తమ విద్యుక్త ధర్మానుసారం బడ్జెట్ మంచిచెడ్డలు గురించి వ్యాఖ్యానాలు గుప్పించారు.ముందే చెప్పినట్టు అధికార పక్షం వాళ్ళు బడ్జెట్ ‘అద్భుతం’ అన్నారు. విపక్షంవాళ్ళు ‘కొత్త సీసాలో పాతసారా’ వంటి పాతపల్లవులనే సరికొత్తగా వినిపించారు. అయితే, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వంటి సంక్షేమ పధకాలకు బడ్జెట్ లో అరకొరగా చేసిన కేటాయింపుల విషయం సమర్ధించుకోవడానికి ప్రభుత్వ పక్షాన మీడియాతో మాట్లాడిన వాళ్ళు తలలు పట్టుకోవాల్సివచ్చింది.

పోతే, నిన్నటికి నిన్న మమతా బెనర్జీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ద్వారా - కన్నతల్లి ‘బెంగాల్ మాత’ పాల రుణం తీర్చుకున్నారు. ఆమె కళ్ళకు బెంగాల్ తప్ప మరోటి కనిపించదన్న అపవాదును మోయడానికే ఆమె సిద్ధపడ్డారు. నిజానికి ఆమె చూపు రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలమీదా, వాటిల్లో గెలుపు సాధించడం ద్వారా దక్కించుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి పీఠం మీదా వుందన్న నిజాన్ని ఆమె దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఈసారి రైల్వే బడ్జెట్ ను ‘తూర్పు వెళ్ళే రైలు’ ఎక్కించడానికి మమతా బెనర్జీ ఎంతమాత్రం సంకోచించలేదు. ఆ రాష్ట్రంలో గత 34 ఏళ్లుగా అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్న ‘ఎర్రదండు’ పాలనకు శ్రీమతి బెనర్జీ ఎర్ర జెండా చూపగలదేమో అన్న ఆశతో వున్న యుపీఏ నాయకులు కూడా ఆవిడ ప్రతిపాదించిన బెంగాల్ బడ్జెట్ కు పచ్చజెండా వూపినట్టుగా అనుకోవాల్సి వస్తున్నది. శుక్రవారం నాడు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె చేసిన గంటన్నర ప్రసంగంలో పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో ‘హౌరా’ అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. మధ్యలో అడ్డుతగిలిన మాజీ రైల్వే మంత్రి లాలూపై ఆడపులిలా తిరగబడ్డారు. పైపెచ్చు బెంగాల్ చెందినందుకు నేనెంతో గర్వపడుతున్నానని ప్రకటించి విమర్శకుల నోళ్లకు తాళం వేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సేలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు – ఇలా వరాల వాన కురిపించారు. లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ – తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది అన్న రీతిలో మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ను రూపొందించి పుట్టింటిపై  ప్రేమను బాహాటంగా ప్రదర్శించి చూపారు. సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో అని సంకోచించే నిత్య శంకితులకు ఇది కనువిప్పే.

ఇక, లోకసభలో 32 మంది అధికారపక్ష సభ్యులున్న ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే బడ్జెట్ లో దక్కిన వాటా ఎంత అని ఆలోచించుకుంటే, కడుపుచించుకుంటే కాళ్ళమీద పడ్డట్టయిందన్న చందానవుంది.

ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోక సభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు. ఇవి ఎక్కువగా, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు ‘స్టాప్’ ఏర్పాటు చేయాలనో – ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిందటి నెలలోనే ఢిల్లీ లో మమతాబెనర్జీ ని కలుసుకుని కొన్ని కీలక ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి కొత్తగా 35 రైళ్ళు కావాలని కోరారు. వీటిలో పదిహేడు ఎక్స్ ప్రెస్ రైళ్ళు వున్నాయి. కానీ, రైల్వే మంత్రి వాటికి మొండి చేయి చూపారు. కాకపొతే, పాసింజర్ రైళ్ళు, ఎం ఎం టి ఎస్ రైళ్ల విషయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలను చాలావరకు మమతా బెనర్జీ మన్నించినట్టే కానవస్తున్నది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో గద్వాల-మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం, ప్రొద్దుటూరు-కంభం ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కోరినా, బడ్జెట్ లో వీటి ప్రస్తావన లేదు. అలాగే, సర్వే కూడా పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు కానీ, రైల్వే మంత్రి వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రానికి సంబంధించి ఈసారి బడ్జెట్ లో ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టులు నిజానికి పదేళ్ళనాటివి. వాటినే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులుగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రస్తావించారు.

ఏదిఏమయినా, ఈసారి రాష్ట్రానికి అనుకున్న రీతిలో రైల్వే మంత్రి న్యాయం చేయకపోయినా కిందటిసారి మాదిరిగా పూర్తిగా అన్యాయం చేసారని చెప్పలేము. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రోజురోజుకూ మారిపోతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, అధికార పార్టీలోనే వినిపిస్తున్న ధిక్కార స్వరాలూ, కారణాలు ఏమయినా రైల్వే బడ్జెట్ పై ఎంతోకొంత ప్రభావం చూపాయనే అనుకోవాలి. అందువల్లే మమతా ఎక్స్ ప్రెస్ రవంతసేపు రాష్ట్రంలో ఆగిన అనుభూతిని రైల్వే మంత్రి ప్రసంగం మనకు మిగిల్చింది.

సికింద్రాబాద్- విశాఖల నడుమ వారానికి మూడుసార్లు నడిచే దురంతో ఎక్స్ ప్రెస్, పుణే – సికింద్రాబాదుల మధ్య రోజూ నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి అనేక కొత్త రైళ్లకు బడ్జెట్ లో ప్లాట్ ఫారం దొరికింది. టీవీ స్క్రోలింగ్ లలో కనబడ్డ ఈ కొత్త రైళ్ల న్నీ పట్టాలు ఎక్కినప్పుడే జనాలకు వూరట.

అలాగే 17 కొత్త రైల్వే లైన్లు సర్వే చేయడానికి అనుమతి లభించింది. హైదరాబాద్ ఎం ఎం టి ఎస్ రెండోదశకు పచ్చ జెండా వూపారు. మూడు కొత్త రైల్వే లైన్లు రాష్ట్రానికి మంజూరు చేసారు. రైలు ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించిన ‘యాంటీ కొలిజన్ డివైజ్’ ను దక్షిణ మధ్య రైల్వే లో కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించే పద్ధతిలో, మూడువేల మూడువందల కోట్ల రూపాయల అంచనా వ్యయం కలిగిన నాలుగు కొత్త ప్రాజెక్టులను ఈ బడ్జెట్ లో మంజూరు చేసారు. అలాగే, ఎన్నేళ్ళబట్టో అంతా ఎదురుచూస్తున్న కాజీపేట వాగన్ ఫాక్టరీ.

ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. టిక్కెట్ల ధరను వరసగా మూడో ఏడు కూడా పెంచకపోవడం హర్షనీయం. అలాగే కొద్దో గొప్పో తగ్గించిన రిజర్వేషన్ చార్జీలు. సీనియర్ సిటిజన్ లకు ఇచ్చే రాయితీని 30 నుంచి 40 శాతానికి పెంచడం. ఆ చేత్తోనే, మహిళలకు 58 ఏళ్ళ నుంచే ఈ సదుపాయం వర్తింప చేయడం. రాజధాని,శతాబ్ది వంటి రైళ్ళలో కూడా వికలాంగులకు రాయితీ తో కూడిన ప్రయాణ సదుపాయం, పోస్ట్ ఆఫీసుల్లో కూడా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఆహ్వానించదగ్గదే. పాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచడంవల్ల ప్రయోజనం పొందేది సామాన్యులే అన్నది కూడా ఇక్కడ గమనంలో వుంచుకోవాలి. ఎందుకంటె రైల్వే లకు మొదటి రూపాయి చెల్లించేది సాధారణ ప్రయాణీకులే.

‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు’ ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. (26-02-2011)





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి