రేడియో రోజులు - 5 - భండారు శ్రీనివాసరావు
“నేను ఏది చెబితే అదే జీవో” అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు.
ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది. తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు. యెంత పెద్ద అధికారినయినా ఆయన లెక్కపెట్టేవారు కాదు. ఐ ఏ ఎస్ అధికారి అని కూడా చూడకుండా ‘ఎక్కడ దొరికారయ్యా చావల్ ఖరాబు గాళ్ళు’ అని ఫైళ్లు విసిరేయడం నేను చూసాను. ఆయన ఆఫీసులో వున్నారంటే చాలు – ఆ చాంబర్ అంతా ఒకరకమయిన నిశ్శబ్దం రాజ్యం చేసేది. అధికారులు, అనధికారులు యెంతటి వారయినా సైగలు - మహా అయితే - గుస గుసలు, అంతే కానీ మాట పెదవి దాటేదికాదు.
చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు. “రూలు ప్రకారం కుదరదు సార్” అని మొహం మీద చెప్పే ధైర్యం వారికి వుండేది కాదు. ఎందుకంటే చెప్పిన పని కాదన్నవారినీ, చెయ్యనివారినీ ఆయన నలుగురిముందూ మొహమ్మీదే కడిగేసేవారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో దిట్ట అయిన చెన్నారెడ్డి గారికి అధికారులతో ఆడుకోవడం వెన్నతోపెట్టిన విద్య. పైగా ఫైళ్ళపై ఎండార్స్ మెంట్లు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.
సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్. రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు. ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే తత్వం చెన్నారెడ్డి గారిది. ‘ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!’ అనే వారు.
‘అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలు’ అన్నది రామ్మూర్తి గారి రూలు.
ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో సమాధాన పడ్డారని కాదు. రెడ్డి గారి తత్వం అర్ధం చేసుకుని ఒక ఉపాయం కనుక్కున్నారన్న మాట. ముఖ్యమంత్రి గారు ఏదో పని చెప్పి చెయ్యమనగానే మరేదో రూలు చెప్పి కుదరదనే వారితో ఆయనగారికి కుదరదని తెలుసుకున్నారు. అందుకే, ఎప్పటికెయ్యదిప్రస్తుతమన్నట్టుగా – అప్పటికి ఒక్కసారి ‘యస్ సార్’ అంటే పోలా’ అనుకున్నట్టున్నారు. సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చేసరికి ఎలాగూ కొంత వ్యవధి పడుతుంది. అప్పుడు నెమ్మదిగా చెబితే ఆయనే వింటారులే అని ఒక మధ్యే మార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి గారు ఏదయినా అడగ్గానే రామ్మూర్తి గారు వెంటనే ‘యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో చెన్నారెడ్డి గారు ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా కుదరదో వివరంగా చెప్పి- ‘నో సర్’ (కుదరదు సర్ ) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన రెడ్డిగారు కిమ్మనకుండా తలపంకించి వూరుకునేవారు.
ఇదంతా తెలిసిన వారు – ఆయన ఇంటి పేరు ‘యస్ ఆర్’ తో ముడిపెట్టి - ‘ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి - వచ్చిన తరవాత నో సర్ రామ్మూర్తి’ అని సరదాగా అనుకునే వారు. రేడియో రిపోర్టర్ గా ముఖ్యమంత్రి కార్యాలయంలో చనువుగా తిరిగే నాకు ఇలాటి విషయాలు అప్పుడప్పుడు చెవిలో పడేవి. (12-09-2010)
ఈ ‘యస్ సార్’ వ్యవహారం ప్రపంచం లో ఎక్కడయిన పని చేస్తున్దల్లే ఉంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
రిప్లయితొలగించండిలక్కరాజు గారికి - మీకు కూడా నా ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండినీ విషయప్రసారణ ఇంత కమ్మగా వుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను.చక్కటి భాష ఒక్కటే ముఖ్యం కాదు డాన్ని నీలా చక్కగా చెప్పే విధానం ఈ రోజుల్లో వున్న జర్నలిస్టుల్లో ఎంతమందికి చాతనవుతుంది బ్రదర్! కీప్ ఇట్ అప్ ! ఎస్బీ, www.raajakeeyam.com
రిప్లయితొలగించండిIt is our good fortune that people like you are wrting your experiences.
రిప్లయితొలగించండిThank you for sharing the experiences of all those years sir.