11, సెప్టెంబర్ 2010, శనివారం

రేడియో రోజులు – 4 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు – 4   -  భండారు శ్రీనివాసరావు


రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో - ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూవుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో – ఇలాటి వారుచెప్పే మాటలే

ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.

ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.

అలాగే కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమం రూపొందించే తీరుకు ముగ్ధులై,  కార్మికులు కాని వారు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. బాలల పత్రిక ‘చందమామ’ ను చదవడానికి పిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ మక్కువపడినట్టుగా. అందులో రాంబాబుగా డి. వెంకట్రామయ్య గారు, చిన్నక్కగా శ్రీమతి వి.రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా వట్టెం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో స్టార్ డం సంపాదించుకున్న రేడియో కళాకారులు. స్కూళ్ళు, కాలేజీల్లో జరిగే వార్షికోత్సవాలకు వీరిని ముఖ్య అతిధులుగా పిలిచి సన్మానించేవారు. వెంకట్రామయ్యగారు తరువాతి కాలంలో న్యూస్ రీడర్ గా మారారు. రిటైర్ అయ్యేంతవరకూ అదే ఉద్యోగం.

ఈ రేడియో కళాకారులవి గొర్రె తోక జీతాలు. ఎదుగూ బొదుగూ లేదు. ప్రమోషన్లు లేవు. ఎక్కడ చేరారో అక్కడే రిటైర్ అయ్యేవాళ్ళు. అయినా మనసుపెట్టి పనిచేసేవారు. వారికిది వృత్తి కాదు. ప్రవృత్తి. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారిలో ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు, కవులూ, రచయితలూ వుండేవారు. స్టేషన్ డైరెక్టర్లు కూడా వీరికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. నేను చేరకముందు – శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్తానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, గోపీచంద్, బుచ్చిబాబు, నాయని సుబ్బారావు,  న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, నండూరి విఠల్ వంటి దిగ్గజాలు హైదరాబాద్ రేడియో కేంద్రంలో పనిచేశారు. వీరుకాక, భాస్కరభట్ల కృష్ణారావు, శారదా శ్రీనివాసన్, తిరుమలశెట్టి శ్రీరాములు, వింజమూరి సీతాదేవి, మాడపాటి సత్యవతి, జ్యోత్స్నా ఇలియాస్, ఇందిరా బెనర్జీ ఒకరా ఇద్దరా ఇందరు తమ స్వరాలతో హైదరాబాద్ రేడియో కేంద్రానికి  అజరామర కీర్తిని సముపార్జించి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నెలకు అయిదారువందలకు మించి జీతాలు తీసుకున్నవారులేరు. ఇందిరాగాంధీ ప్రధాని కావడానికి పూర్వం సమాచార ప్రసార శాఖల మంత్రిగా వున్నప్పుడు రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టుల స్తితిగతులు అర్ధంచేసుకుని, వారికి కేంద్ర ప్రభత్వ ఉద్యోగులతో సమానంగా ( పే స్కేల్స్) జీత భత్యాలు లభించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు కూడా వర్తింపచేశారు. నేను చేరినప్పుడు నాదీ స్టాఫ్ ఆర్టిస్టు ఉద్యోగమే. నాకు ముందు రేడియో రిపోర్టర్ గా పనిచేసిన తురగా కృష్ణమోహన రావుగారు జగమెరిగిన హాస్య రచయిత. ఆంద్ర పత్రిక వీక్లీలో ‘ప్రవీణ్’ అనే కలం పేరుతొ ‘రాజధాని కబుర్లు’ అనే శీర్షిక నడిపేవారు. హైదరాబాదు విశేషాలను వారం వారం తనదయిన ప్రత్యెక శైలిలో రాసేవారు. ఆ రోజుల్లో నేనాయనకు పరమ వీర అభిమానిని.

1974 అక్టోబర్ రెండో తేదీన కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని రైల్వే అధికారులు కొంతమంది విలేకరులను హైదరాబాదు నుంచి ఆ రైలులో తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లుచేశారు. ముఖ్యమంత్రి వెంగళరావు గారు జెండా వూపి రైలును బయలుదేరదీసారు. అప్పటివరకూ ప్లాటుఫారం పైనే నిలబడి వున్న విలేకరులు, కదిలిన రైలు కొద్దిదూరం వెళ్లి ఆగుతుందని, అప్పుడు ఎక్కవచ్చని అనుకున్నారు. కానీ అది ఆగకుండా వెళ్ళిపోయింది. విలేకరుల లగేజీ మాత్రం రైల్లో వుండిపోయింది. అధికారులు వారికోసం అప్పటికప్పుడు ఒక వ్యాన్ ఏర్పాటుచేశారు. కానీ, దురదృష్టం. నకిరేకల్ సమీపంలో ఆ వ్యాన్ చెట్టుకు డీ కొట్టింది. చనిపోయిన వారిలో కృష్ణమోహన రావుగారున్నారు. ఆంధ్రదేశం గర్వించదగిన ఒక గొప్ప రచయితను ఆ రోడ్డుప్రమాదం పొట్టనపెట్టుకుంది. (10-09-2010)

16 కామెంట్‌లు:

  1. "....రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో...."

    అలా హేళనగా మాట్లాడుకునే వారు అతి కొద్దిమంది, చదువుకున్నామనుకునె నిరక్షరాశ్యులు. పంటసీమలు కార్యక్రమానికి నేను అభిమానిని. ఎంత చక్కటి కార్యక్రమాలు. రైతులకు అర్ధం కావటానికి, వారి యాసలోనే ఆ కార్యక్రమాలను రూపొందించటం అద్భుతమైన పధ్ధతి. మీకు వీలైతే, అలనాటి పంటసీమల కార్యక్రమం ఏదైనా రికార్డింగు ఉంటే మీ బ్లాగులో ఉంచగలరు, మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే వీలు కలిపించగలరు.

    రిప్లయితొలగించండి
  2. మీకందరికీ వినాయకచవితి సుభాకాంక్షలు.
    1953 ప్రాంతాల్లో బెజావాడ సత్యనారాయణపురం స్టేషన్ దగ్గర పార్కు లో వేసవి లో రేడియో వింటూ గంటలు గంటలు గడిపేవాడిని. వార్తలు తరువాత 'ఏమండి బావగారూ' అంటూ ఆరోజు విశేషాలు తిరగ వేసేవారు ఇద్దరు బావా మరుదులు.
    మరపురాని మధుర స్మృతులు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  3. అవును, రేడియో వింటూ తోటపని చేయడం,రేడియో వింటూ వాకిట్లో ముగ్గు వేయడం,రేడియో వింటూ లెక్కలు చేసుకోడం,రేడియో వింటూ నవారు అల్లడంలో అమ్మకు సాయం చేయడం..ఇవన్నీ నాకు ఇష్టమైన పన్లుగా ఉండేవి.

    భక్తి రంజని కంటే ముందే మొదలయ్యే సన్నాయి వాద్యం కూడా వినేంత పిచ్చి చిన్నప్పుడు!విజయవాడ వివిధ భారతి లో అర్చన తర్వాత ఆదివారాలు వచ్చే లఘునాటికలూ,అందులో ఎక్కువగా నటించిన నండూరి సుబ్బారావు గారు, వీబీ కనకదుర్గ ల జంటా,కళాకారులు సమర్పించే ప్రత్యేక జనరంజనీ.మనగళవారం రాత్రి ,ఆదివారం మధ్యాహ్నం వచ్చే నాటకాలు,వార్తా వ్యాఖ్యలూ... ఇవన్నీ ఎప్పటికీ చెరగని తీపి జ్ఞాపకాలు.

    నాక్కొంచెం మెమొరీ ఎక్కువే!అందుకే సి.రామ్మోహన్ గారు,నండూరి సుబ్బారావు గారూ "ఏవండోయ్ బావగారూ.."అంటూ సమకాలీన విషయాలమీద చెప్పుకునే కబుర్లు కూడా లీలగా గుర్తున్నాయి.
    పంటసీమలు విని కూరగాయలు పండించామంటే నమ్ముతారా? దూరదర్శన్ లో కూడా నేను వ్యవసాయ కార్యక్రమాలు ఇష్టంగా చూస్తాను.

    అసలు రేడియో అనౌన్సర్లంటేనే ఒక రకమైన ఆరాధన! ఎప్పటికైనా రేడియోలో ఉద్యోగం చేయాలనే కొరిక! చివరికి హైద్రాబాదు కేంద్రంలో వివిధ భారతిలో కాజువల్ అనౌన్సర్ గా (టెంపరరీ)అవకాశం వచ్చినా మా వారికి అమెరికా ఉద్యోగం రావడంతో వదిలేసుకోవలసి వచ్చింది.

    మీ రేడియో రోజులతో మొత్తానికి టపా లాంటి వ్యాఖ్య రాయించారు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీనివాసరావు రావు గారూ !
    రేడియో కబుర్లు చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు.
    మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  5. Sir,

    For the first time I read your blog. I love to relive those good old days of AIR. I have born in 1972 & I feel that 70s are the golden era of any one's life :)

    Chinnakka, Ekambaram & Satyam of karmikula karyakramam, "Kangaru Mamayya" of Balanandam are my favourite chracters.

    Do you know Malladi Chandrasekhar? He worked in Tirupati FM. Later he got transferred to Hyderabad Vivida Bharati! If you know him, please pass on the contact details.

    Thanks
    Raghothama Rao
    www.aavakaaya.com

    రిప్లయితొలగించండి
  6. A humble request to all.

    We are collecting old All India Recordings for preservation for posterity and kept them in Maganti.org with the kind help from Shri Maganti Vamsi. You can see the old play lets with the following link:

    http://maganti.org/newgen/index1.html
    (under the item Parichayalu-Natikalu)

    If anybody has recordings of yester years, please send a message (vu3ktb@gmail.com)or to Shri Vamsi (maganti.org@gmail.com)

    రిప్లయితొలగించండి
  7. Dear Raghothamarao garu. Thanks for the compliments.Sri Malladi Chandra Sekhar is presently working at AIR,Hyderabad as senior announcer. His mobile is - 9246108108 and Email:akashavaniannouncer@gmail.com
    -regards - Bhandaru Srinivas Rao

    రిప్లయితొలగించండి
  8. శివ గారికి మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఒక రకంగా నేనూ నిరక్షరాస్యుడినే. ఈ బ్లాగు ప్రపంచంలో ‘అ ఆ ఇ ఈ’ ల దగ్గరే వున్నాను. అక్షరాలు రాసి అతికించడం (కట్ అండ్ పేస్ట్) మాత్రమె తెలుసుకుని బండి లాక్కొస్తున్నాను. వాయిస్ లను బ్లాగులో పెట్టడం అంటే తెలియదు. అయినా కష్టపడి నేర్చుకుని రేడియో అన్నౌంసర్ల ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 23 న సియాటిల్ లో బయలుదేరి 25 న హైదరాబాద్ చేరుకుంటాను. వెళ్ళిన తరవాత ఈ విషయాలు బాగా తెలిసిన మిత్రుల సాయంతో ఈ పని పూర్తిచేస్తాను. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  9. లక్కరాజు శివరామకృష్ణారావు గారికి – పంచాయతీ రేడియో ద్వారా నాకు మొదట్లో రేడియో పరిచయం. అక్కడే ఉద్యోగం చేయగగలనని ఎన్నడూ అనుకోలేదు. మీరన్నట్టు పార్కులో కూర్చుని కళ్ళుమూసుకుని గాలిలో తేలివచ్చే రేడియో కార్యక్రమాలను మనసుతో వినడం నిజంగా ఒక మరపురాని అనుభూతి. నిస్సంశయంగా ఈ తరం ఏదో కోల్పోతోంది. ఇది నిజం. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  10. Sir Srinivasaravu gaaroo. Putting voice files in blog is quite easy. You can first upload the audio files you want to keep in Blog to http://www.divshare.com/ web site. You have to sign up in this free website and can upload the audio files. Once upload is completed, you can get a html code which you can copy and paste in your blog which would give link for playing the audio uploaded by you. I learnt this after my coming into blog world only which was just over a year.

    రిప్లయితొలగించండి
  11. సుజాత గారు- రేడియో గురించి అద్భుతమయిన వర్ణన. హాట్స్ ఆఫ్ టు యు. చిన్నప్పటి జ్ఞాపకాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. రేడియో మనిషిగా మీకు మనః పూర్వక కృతజ్ఞతలు. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  12. ఎస్ ఆర్ రావు గారికి – ధన్యవాదాలు. మీకూ మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్ధి, రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు –భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  13. Thanks SIVA garu. I am already in touch with Sri Maganti Vansee on this subject. Nothing is impossible if everybody extends helping hand for a noble cause.- Bhandaru Srinivas Rao

    రిప్లయితొలగించండి
  14. Thanks SIVA garu for your immediate and spontaneous response. I will be in touch with you for further guidance. My mobile no in Hyd. : 98491 30595 and Email: bhandarusr@gmail.com and bhandarusr@yahoo.co.in (24 x 7)- Bhandaru Srinivas Rao

    రిప్లయితొలగించండి