29, ఆగస్టు 2010, ఆదివారం

జీవనస్రవంతి – భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి – భండారు శ్రీనివాసరావు

కారు గరాజు
కారు దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళడానికి వీలుగా అమెరికాలో చాలామంది గరాజులోనుంచే ఒక ద్వారం పెట్టుకుంటారు. ఈ గరాజు తలుపులను కారులోనుంచే తెరవడానికీ, మూయడానికీ ఎలెక్ట్రానిక్ పరికరం వుంటుంది. దీనికి ప్రత్యేకమయిన కోడ్ వుంటుంది కాబట్టి ఒకరి గరాజు మరొకరు తెరవలేరు. కానీ దొంగలకు తెలివితేటలూ ఎక్కువ కదా.

గరాజును తెరిచే రిమోట్ 
 అంచేత ఓ దొంగ గారు బాగా కష్టపడి స్టడీ చేసి,ఒక ఇంటి గరాజు కోడ్ కు డీకోడ్ కనుక్కున్నాడు. ఆ తరవాత – ఆఇంటి ఆసామీ ఇంట్లో లేనప్పుడు ట్రక్కుతో సహావచ్చి గరాజు తెరిచి దర్జాగా ట్రక్కు అక్కడ పార్కు చేసుకున్నాడు. తాపీగా ఇంట్లోకి వెళ్లి అంతకంటే తాపీగా విలువైన సామానులన్నీసర్దుకుని  అలా సర్దుకున్నవన్నీ మళ్ళీ ట్రక్కులో సర్దేసుకుని దర్జాగా గరాజు తలుపులు మూసేసి మరింత దర్జాగా వెళ్లిపోయాడట. దొంగ దొంగలా కాకుండా దొరలా వచ్చి దొరలా పోవడం వల్ల చుట్టుపక్కలవాళ్ళకు కూడా ఎలాటి అనుమానం రాలేదట. కానీ ఇళ్ళల్లో  దొంగల్లా దూరేవాళ్ళని దొంగతనంగా ఫోటోలు తీసే పరికరాలు ఆ ఇంట్లో అమర్చివుండడం వల్ల ఆ దొంగని పట్టుకోవడానికి పోలీసులు ఆట్టే కష్టపడాల్సిన అవసరం లేకపోయింది.

అదిగో! ఆ వెనక- సామాను సర్దుకుంటున్న దొంగ గారు
Photo Credit:John Myers

దొంగతనం చేయడానికి ఈ హైటెక్ దొంగగారు టెక్నాలజీ వాడుకుంటే న్యూ యార్క్ లో మరో దొంగ - దొంగతనం చేసిన గంటల్లోనే అదే టెక్నాలజీ పుణ్యమా అని పోలీసులకు దొరికిపోయాడు. ఆ వూళ్ళో పెళ్ళికి వెళ్ళిన ఓ పెద్దమనిషి పెళ్ళితంతు ముగిసిన తరవాత భార్యా పిల్లలతో కలసి వూరంతా తిరుగుతూ పోటోలు దిగుతూ కాలక్షేపం చేస్తున్న సమయంలో వెంట తెచ్చుకున్న బ్యాగ్ గల్లంతయిన సంగతి కాసేపటికి కానీ గమనించలేదు. ఇప్పుడు అమెరికాలో అంతా ముచ్చట పడడమే కాకుండా గంటలకు గంటలు క్యూలలో నిలబడి కొనుక్కుంటున్నయాపిల్ ఐ ప్యాడ్ , ఖరీదయిన ఇతర వస్తువులూ గట్రా ఆ సంచీలోనే వున్నాయి. పోలీసులదగ్గరికి వెడితే – పోయినవస్తువులు పోను- ఏమన్నా మిగిలి వుంటే అవి కూడా వూడలాక్కుంటారన్న భయం ఆదేశంలో లేనందువల్ల - అతగాడు పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. పోలీసులు కూడా ‘తీరిగ్గా విచారించి తీరిగ్గా పట్టుకుంటాం, అడ్రసిచ్చి వెళ్ళిరండి’ - అనకుండా కొంత బుర్ర పెట్టి ఆలోచించారు. ఫోటోలు తీస్తున్నప్పుడు దొంగతనం జరిగింది కాబట్టి ఆ కెమెరాతో తీసిన ఫోటోలను ఓసారి పరీక్షగా చూసారు. సంచీలో సామాను కొట్టేస్తున్న దొంగ ఓ ఫోటోలో స్పష్టంగా కనిపించాడు. పోజుపెట్టి మరీ ఫోటోలో పడ్డ ఆ దొంగ పోలీసులకు పట్టుబడడం తరవాత ఏమంత కష్టం కాలేదనుకోండి.

వృత్తి వ్యాపారం
సియాటిల్ లో ఈ మధ్య ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరూ చనిపోకపోవడం వల్ల వార్త కాదనుకున్నారేమో ఏమో మర్నాడు ‘తల్లి పత్రిక (మెయిన్ ఎడిషన్) లో కాదుకదా ‘పిల్ల పత్రిక’ (లోకల్ ఎడిషన్) లో కూడా ఏ పేపరు వాళ్ళు దాని జోలికి పోలేదు. పోలీసు వెబ్ సైట్ చూసేలోగా ఓ స్తానిక కుర్ర లాయరు గారి వెబ్ లో ఆ సంఘటన వివరాలన్నీ పూర్వాపరాలతో సహా కనిపించాయి. సమాచారం అంతా ఇచ్చిన ఆ లాయరు – ఇలాటి కేసుల్లో నష్ట పరిహారం ఇప్పించే అనుభవం తనకు పుష్కలంగా వుందనీ, అందువల్ల సంఘటనలో గాయపడ్డ వ్యక్తి తాలూకు వాళ్ళు తనని సంప్రదిస్తే తగిన ఫీజు తీసుకుని తగిన సాయం చేస్తాననీ చివర్లో ఒక ముక్తాయింపు ఇచ్చి వూరుకున్నారు. పరోపకారంలో వున్న పరమార్ధం ఇదన్న మాట.

(28-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి