17, ఆగస్టు 2010, మంగళవారం

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు


గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
 అందులో -



కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.

వర్తమాన ప్రపంచానికి – ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో ‘థాంక్స్’ – మన తెలుగులో ‘ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.

పదం ఏ భాషలో అయినా భావం అదే 
 
రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని ‘అన్నయ్యా ! చెల్లెమ్మా!’ అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ‘ఆత్మీయతా భావం ‘ అవగతం కాదు. అయితే – చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము.
‘కృతజ్ఞత’ అన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు ‘వడ్డించేవాడు’ ప్రధానం కాని ‘వడ్డించిన’ వాడు కాదు.

గతం ఘనం

పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ‘ఆహా! ఓహో!!’ అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠం పై వుంచిన ‘అపర చాణ క్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే – ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె ‘ అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ ‘పదవే’ సర్వస్వమయిన వారికి ‘ఆయన భజనే’ సర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన ‘పత్తిత్తులకు’ ఆయన చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ – వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త – న్యాయస్తానాలలో నిస్సహాయంగా ‘బోనులో’ నిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’ అనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్  ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తమ వెళ్లి - ఆ పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడం తో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని ‘ పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

ఆలోచనా? నిర్వేదమా?

పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.  అదీ  పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.

శ్రీ అంజయ్య

అలాగే- ఎనభయ్యవ దశకంలో అంజయ్య గారిని ఇదే పరిస్థితుల్లో చూసాము. ముఖ్య మంత్రిగా ఆయన రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. మేము ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు పోయింది. అంతా బోసిపోయి వుంది. మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.

1983 లో విజయభాస్కరరెడ్డి గారితో ఇలాటిదే మరో అనుభవం.

శ్రీ విజయభాస్కరరెడ్డి


తెలుగు దేశం పార్టీ అఖండ విజయం తరవాత – ఆయన అధికార నివాసంలో (ఇప్పుడు దాన్ని పడగొట్టి గెస్టు హౌస్ కట్టారు) ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని కలుసుకున్నాను. ఆయన మేఘ గంభీరుడు. ఒక పట్టాన బయటపడే వ్యక్తిత్వం కాదు. జనం చాలా పలచగా వున్నారు. కాకపొతే, ఆయన మళ్ళీ కేంద్రంలో మంత్రి అవుతారన్న గ్యారంటీ నూటికి నూరుపాళ్ళు వుండడం వల్ల పరిస్తితి మరీ అంత దారుణంగా లేదు.

ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -

శ్రీ రామారావు

అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.

మొన్నటికి మొన్న హైదరాబాదులో – EMRI -108- ఐదో వార్షికోత్సవం విశేషాలను మీడియాలో చూసినప్పుడు ఈ విషయాలతో కూడిన గతం నా కళ్ళ ముందు కదలాడింది.

వాహనాన్ని పరిశీలిస్తున్న శ్రీ రాజశేఖరరెడ్డి

ఈ సంస్త ప్రారంభమయిన కొద్ది సంవత్సరాలకే ఎంతో ప్రాచుర్యం పొందింది. సకాలంలో సేవలందిస్తూ ఆపన్నుల ప్రాణాలు నిలబెడుతున్న ఈ సర్వీసు విశిష్టతను అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి గుర్తించారు. డాక్టర్ గానే కాకుండా ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో శాసిస్తున్న నాయకుడుగా కూడా దీని ప్రాముఖ్యతను ఆయన బాగా అర్ధం చేసుకుని ‘పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో ఈ సంస్తకు ఆర్ధిక సాయాన్ని అందించారు

కుయ్ కుయ్ అంటూ 108 వాహనం సౌండ్ ని అనుకరిస్తున్న వైఎస్సార్     

. ప్రమాదాల్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా – ‘వోట్ బ్యాంకు’ ని తయారు చేయగల ఒక ‘ప్రజాకర్హక పదకంగా దీన్ని తీర్చి దిద్దారు. అలాగే వైద్య సేవలకు నోచుకోని పల్లె ప్రజలకోసం రూప కల్పన చేసిన ‘104’ పధకం కూడా రాజశేఖరరెడ్డి గారిని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే గత సార్వత్రిక ఎన్నికల సభల్లో వీటికి ఆయన అదనపు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.

వొదిలి వెళ్ళిన  'మంచి ఆస్తి '


వీటిని గురించి మాట్లాడేటప్పుడు మరో వ్యక్తిని కూడా స్మరించుకోవాలి. ఆయన ఆర్ధిక నేరాల ఉచ్చులో చిక్కుకుని జైల్లో వుంటున్న ‘సత్యం’ రామలింగరాజు గారు. ఈ రెండు పధకాలకు పురుడు పోసింది రాజు గారే .వీటికి జీవం పోసింది మాత్రం రాజశేఖరరెడ్డి గారు.
కానీ – EMRI- 108- ఐదో వార్షికోత్సవం లో ముఖ్య మంత్రి రోశయ్య గారు మినహా మిగిలిన వారెవ్వరూ ‘వీరిద్దరి’ ప్రస్తావన తీసుకురాలేదనీ,  స్టేజీ వెనుక అమర్చిన ‘బ్యాక్ డ్రాప్’ లో కూడా కానరాలేదనీ - అమెరికాలో వున్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పినప్పుడు – ‘కృతజ్ఞత’ గురించిన జ్ఞాపకాలు మరో సారి మదిలో మెదిలాయి.
బయట కానరానివాటిని 'మ్యూజియం' లోనే కదా చూసేది   


కొన్నాళ్ళ తరవాత – పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచేప్పాలంటే – మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!

(16-08-2010)

NOTE:All images in the blog are copy righted to the respective owners.


4 కామెంట్‌లు:

  1. Please read this link. about 108 five year day celebration.
    Raju is on Bail now.
    Jwala
    http://jwalasmusings.blogspot.com/2010/08/108.html

    రిప్లయితొలగించండి
  2. మీ స్పందనకు కృతజ్ఞతలు. అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయరంగంలో లుప్తమవుతున్న కృతజ్ఞతాభావాన్ని లేదా లాయల్టీ గురించి ఆవేదనని వ్యక్తం చేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. ఆయా వ్యక్తుల గురించిన ప్రస్తావన కేవలం కాకతాళీయం. వ్యక్తులను వ్యాసాలలో ప్రస్తావించి కీర్తించడం – తూలనాడడం వంటివి మంచి జర్నలిజం అని నేను అనుకోను. ఉదయం వేళల్లో తెలుగు టీవీల్లో ప్రసారం అయ్యే విశ్లేషణల కార్యక్రమాల్లో పాల్గొనే యాంకర్లు కానీ, విశ్లేషకులు కానీ - సాధ్యమయినంతవరకూ వ్యక్తుల ప్రస్తావన తీసుకురాకుండా వుంటే – వ్యక్తిగత విమర్శలకు దిగకుండా వుంటే - ‘తమలపాకుతో నేనిట్లంటే తలుపు చెక్కతో తానిట్లనే’ పద్ధతిలో బాహాబాహీ చర్చలకు అవకాశం వుండదు అని అందరూ పైకి ఒప్పుకుంటారు. కానీ టీఆర్పీ రేటింగులే అందరి ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నాయి.చర్చలు ఆ స్తాయిలో ఉద్రేకపూరితంగా లేకపోతె జనం చూడరని చానళ్ళు, అలా మాట్లాడకపోతే మళ్ళీ పిలవరేమోననీ కొందరు విశ్లేషకులూ పోటీలు పడి వాటి స్తాయిని దిగజారుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని చానళ్ళు ఇలా చేస్తున్నాయని నా ఉద్దేశ్యం కాదు. కానీ వాటి ఉనికికి అవసరమయిన రేటింగులు వాటినికూడా దిగ జార్చవన్న హామీ ఏమీ లేదు. ‘ సమాజంలో ఏ రంగంలో అవకతవకలు వున్నా సరిదిద్ద డానికి మీడియా వుంది’ అన్న భరోసావుండి తీరాలి. నిప్పుకి చెదలంటకూడదన్నది మాత్రమే నా ప్రధాన ఉద్దేశ్యం. మీడియాలో ఇప్పుడు కానవస్తున్న విపరీతధోరణులు సరిదిద్దుకోలేనంత పెద్దవేమీ కావు. కాకపొతే ఈనాటి పోటాపోటీ పోటీయుగంలో వెనక్కి తిరిగి చూసుకునే ఓపికా తీరికా ఎవ్వరికున్నాయి? పునరుక్తి దోషం అయినా పరవాలేదు. గతంలో అనేక చానళ్ళ చర్చలలో పాల్గొన్నప్పుడు మీడియా విషయం వచ్చినప్పుడల్లా ఒక ఉదాహరణ చెబుతూ వచ్చాను. ‘శ్రీరాముడు వనవాసం చేస్తూ ఒకచోట తన ధనుర్భాణాలనువుంచి విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక కప్ప వాటికింద వుండిపోతుంది. శ్రీరాముడు నిద్రలేచిన తరవాత ఆ కప్ప దురవస్తను గమనించి ఎంతో చింతించి –‘బాణం పెడుతున్నప్పుడే నాతో చెప్పివుంటే ఈ బాధ నీకు కలిగేది కాదు కదా’ అని ఓదార్చబోగా – ‘సర్వలోకాలను కాపాడే శ్రీరాముడే - నా ఈ స్తితికి కారణమయినప్పుడు ఇక నా దుస్తితి ఎవ్వరితో చెప్పుకోవాలని’ ప్రశ్నిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ప్రజలను కనిపెట్టి చూడాల్సిన మిగిలిన అన్ని రంగాలు శిధిలమవుతున్నప్పుడు - వాటిని పరిరక్షించి పునరుద్ధరించాల్సిన బాధ్యతా శక్తీ కలిగిన మీడియా కూడా ‘నలుగురితో నారాయణా ‘అని తానూ ఒక రాయి విసిరే పనికి పూనుకుంటే ఇక ఈ జాతిని కాపాడేది ఎవరు? – భండారు శ్రీనివాసరావు, క్యాంపు : సియాటిల్ (యుఎస్ ఏ)

    రిప్లయితొలగించండి