పత్రికల్లో గమనించారో లేదో సంఖ్యలు కొట్టొచ్చినట్టు కనబడడానికి అంకెల్లో రాస్తుంటారు.
ఉదాహరణకు వర్షాలు వరదల కారణంగా లక్ష మంది నిరాశ్రయులయ్యారు అని రాయడానికి 100000 మంది అని పేర్కొంటారు.అలాగే ప్రభుత్వ పక్షం వారు అసెంబ్లీకి సమర్పించే గణాంకాల్లో కూడా ఈ చమత్కారాలు తొంగి చూస్తుంటాయి. అల్లర్లలో అరెస్టులు గురించి చెప్పాలంటే – యాభయ్, వందా అని క్లుప్తంగా లాగించేస్తారు. బలహీనవర్గాలకు ఇళ్ళ పంపిణీ గురించి చెప్పేటప్పుడు 30 00000 మందికి ఇచ్చాం అని ఘనంగా ఉద్ఘాటిస్తారు.ఇక ప్రతిపక్షాలు – ‘మృతుని కుటుంబానికి 1000000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల’ని డిమాండ్ చేస్తాయి.
ఈ విషయాలు పక్కనబెట్టి అసలు విషయానికి వద్దాం.
సున్నా స్వగతం : పక్కన నేనున్నప్పుడే కదా ఎవరికయినా విలువ ?
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ‘ట్రిలియన్’ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. 2008 లో ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ‘ఎస్ ఎం ఎస్’ లకు ఇది సమానం.
ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ ‘సున్నాల’ గందరగోళం ఎక్కువై అసలు ‘విషయం’ గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు. ఈ రెండేళ్లలో ఇంకా ఎంతకు పెరిగివుంటుందో వూహించుకోవచ్చు.
పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
లోకం చుట్టిన వీరుడు
ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ ‘బుల్లి పరికరం’ ఈనాడు ‘హస్తభూషణం’ గా తయారయి కూర్చుంది. ‘ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే దేశంలో – ఇంట్లోవున్న నలుగురూ ‘నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.
- 635 510 000-
అంటే ఫోన్ నెంబర్ అనుకునేరు – ఒక లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య ఇది. అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ.
యెంత దగ్గరో - అంత దూరమూ
మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ‘ఎస్ ఎం ఎస్ ‘ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.
’హ్యాపీ క్రిస్మస్’ అనేది ఆ మొట్టమొదటి ‘ఎస్ ఎం ఎస్’
ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.
కానీ ఇలాటి లెక్కలు తీ సేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.
అమెరికా లాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ‘ఎస్ ఎం ఎస్’ కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ ‘వసూలు రాజాల’ కు ఇందుకయ్యే ఖర్చు ‘చిల్లి సెంటు’ కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న ‘అదనపు’ చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.
ఇందులో ‘ఇంత’ వుంది కాబట్టే – ఈ ‘ఎస్ ఎం ఎస్ ‘ ల పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.
వినియోగదారుల్ని వల వేసి పట్టుకుందుకు ఇన్నిన్ని ' గేలాలు'
పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.
‘పట్టుకుంటే పట్టు చీరె’ నుంచి ‘ఆటాడుకుందాం రా’ వరకు అన్నే ‘ఎస్ ఎం ఎస్’ గేములే.
ప్రతి టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ‘ప్రజాభిప్రాయసేకరణలే. ‘ఎస్ ఎం ఎస్’ లు పంపాలని కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.
పైగా ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కు వసూలు చేసే చార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్యటి నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు పోటీలు పడి తమ ‘మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.
బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా – చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ‘ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.
టీవీ చానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార ‘మర్మం’ ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.
కానీ ఇది జరిగే పనేనా!
‘తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’
NOTE: All images in this blog are copy righted to the respective owners
ఈ s M S గోల చాల ఎక్కువ , ఐన దానికి కాని దానికి పంపటమే .
రిప్లయితొలగించండిఈ పిచ్చి కి పరాకాష్ట ఈ మధ్య బ్లాగుల్లో కూడా చూసాను .
తెలుగు వాడు కాబట్టి పంపండి . అక్కడికి ఇది ఏదో భారత రత్న అవార్డులలాగా సందడి, చివరికి మనకు బొక్క పడితే , కంపెనీలకి బొక్కసం నిండింది .
(ఇండియన్ ఐడియల్ పుణ్యం మరి )
దానిమీద ఒకటే బ్లాగులు , పేపర్ లలో ఒకటే గోల ,
ఇంతా చేసి ఒరిగేది ఏంటో నాకు మాత్రం అర్థం కాలేదు మాస్టారు , మీరే చెప్పాలి మరి ...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబావుంది పోస్టు. SMS ల వేలం వెర్రి తగ్గాలి. అలాగే జటర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
రిప్లయితొలగించండినిజానికి ఎస్ ఎం ఎస్ అనేది చాలా మంచి మీడియం. కానీ దీన్ని వాణిజ్యపరం చేయడమే నచ్చని విషయం. ఒక వ్యక్తిలోని ప్రతిభకు – ఎస్ ఎం ఎస్ ల సంఖ్యతో ముడిపెట్టి వాడుకుంటున్న తీరే బాధాకరం. గతంలో ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ ని చేర్చడానికి ఎస్ ఎం ఎస్ లు పంపాలని పెద్దయెత్తున ప్రచారం చేసారు. అసలిది సాధ్యమా అని ఆలోచించకుండా అందరూ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్ ఎం ఎస్ లు పంపారు. ఇలా పోటీలు పెట్టి ఆస్కార్ అవార్డులవంటివి నిర్వహించే రోజులు వస్తాయేమో తెలియదు. టీవీల్లో వచ్చే రాజకీయ చర్చల సందర్భంగా నిర్వహించే ‘అభిప్రాయ సేకరణల ‘ కోసం ఎస్ ఎం ఎస్ లు పంపడానికి ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యెక ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్తితి. అలాగే ఆయా కార్యక్రమాల్లో లేదా పోటీల్లో పాల్గొనడానికి ఎస్ ఎం ఎస్ ల అవసరం ఏమిటి? సంక్షిప్త సందేశాలు పంపడానికి ఉద్దేశించిన ఈ ‘మీడియం’ ను వాణిజ్యపరంగా ‘ఎక్స్ ప్లాయిట్’ ‘ చేస్తున్నారేమోనన్న అనుమానం కలగడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయనిపించే ఇది రాయాలనిపించింది. – భండారు శ్రీనివాసరావు (my thanks to sri jatar and sri sarat)
రిప్లయితొలగించండి