22, ఆగస్టు 2010, ఆదివారం

విన్నంతలో – కన్నంతలో అమెరికా –2 - భండారు శ్రీనివాసరావు

అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే  'తొమ్మిదివేల'ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి -  ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల  ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట  తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ  చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.
ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క డిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్,బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ దేశంలోని పట్టణాలకు వున్నాయి.

లీవెన్  వర్త్ లో కుటుంబ సభ్యులతో రచయిత (ఎడమనుంచి రెండో వ్యక్తి)   

వాషింగ్టన్ స్టేట్ (అమెరికా రాజధాని వేరు- ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు) లో లీవెన్ వర్త్ అనే ఒక టూరిస్ట్ పట్టణం వుంది. జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి.వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి.

బవేరియన్ సంస్కృతి ఉట్టిపడే నిర్మాణాలు

ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి- తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
ఆహ్లాద వీధులు
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ వంటివాటిని అనేక పర్యాయాలు రుచి చూస్తూ కాలక్షేపం చేసేవారిని - ఇక్కడ ఒక రకం ‘సాస్’ (మిరపకాయల రసం తో తయారు చేస్తారు) దిమ్మదిరిగేలా చేయడం కళ్ళారా చూసాము. అదేమిటో , దాన్ని ఎలా తయారు చేసారో తెలియదు కానీ – ఒక్కటంటే ఒక్కచుక్క నాలిక తాకగానే - శరీరం ఆపాదమస్తకం నిలువునా దహించిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది రుచి చూసి గింగిరాలు తిరిగిపోతున్నవారిని చూస్తుంటే మన వైపు ‘గుంటూరు మిరప ఘాటు’ మించిన పదార్ధం వుందనిపించింది. ఒక సీసా కొనుక్కువచ్చాము కానీ రుచి చూసే సాహసం మాత్రం చేయలేదు.

డిసెప్షన్ ఫాల్స్

సియాటిల్ తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.

NOTE:All images in the blog are copy righted to the respective owners

4 కామెంట్‌లు:

  1. మీ అమెరికా వర్ణన చాల బాగుంది . అంత కళ్ళకు కట్టినట్లు వ్రాసారు ధన్యవాదాలు . సాంబశివరావు www.phonenomber.com

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు సాంబశివరావు గారు – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. హమ్మయ్య.... అమెరికా వెళ్ళే ఖర్చులు మిగిల్చారుగా, బాగుందండి!

    రిప్లయితొలగించండి
  4. Padmarpita గారికి ధన్యవాదాలు. ఒకప్పుడు ఏమో గానీ ఈ రోజుల్లో అమెరికా వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువేమీకాదు. ఇక ఎవ్వరూ చూడడానికి అవకాశం లేని ఆ నాటి నా మాస్కో అనుభవాలు ఈ బ్లాగులోనే వున్నాయి. మీకు వీలుంటే తీరిక చేసుకుని చదివితే సంతోషిస్తాను. – భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి