పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారివెంట వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.
పసిఫిక్ తీరంలో
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ నుంచి ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము.డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల – కార్లో వున్న జీ పీ ఎస్ సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని ఇంటి ముందువున్న ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.
'ఏ హోం ఎవే ఫ్రం హోం'
మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది. పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్, అతి పెద్ద ప్లాస్మా టీవీ, ఫైర్ ప్లేస్, సోఫాలు వున్నాయి. పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి. స్నాన పానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.
నిజం కాదు బొమ్మ షార్క్
పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హటాత్తుగా పైనబడే అవకాశం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. వున్న మూడు రోజులూ ఈ వూళ్ళన్నీ చూసాము. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.
ఆక్వేరియంలో మాత్రం నిజం షార్కే
ప్రతిచోట ఏదో ఒక ప్రత్యెక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలావుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్ ఆక్వేరియం చూసాము.
కొండంత ఆనకొండ
షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.
జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. కారు ఎక్కగానే వూరి పేరు, వీధి నెంబరు, ఇంటి నెంబరు, లేదా షాపు, రెస్టారెంట్ వివరాలు ఫీడ్ చేస్తే చాలు - ఎక్కడికక్కడే అది గైడ్ చేస్తూ దారి చూపుతుంటుంది. మాటల్లో పడి, దారి తప్పినా అది వెంటనే హెచ్చరికలు వినిపిస్తూ మరో ప్రత్యామ్నాయ మార్గం చెప్పి మళ్ళీ సరయిన దోవకు చేరేలా సూచనలు ఇస్తుంది. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు. అంతేకాదు, మార్గమధ్యంలో మరమ్మతుల నిమిత్తం కానీ మరో అవసరం కోసం కానీ ఎక్కడయినా రహదారులు మూసివేసినా లేక వాహనాలను దారి మళ్ళించాల్సివచ్చినా - ఆ తాజా సమాచారం కూడా అది గ్రహించి అప్పటికప్పుడు కొత్త దోవలను సూచించడం ఇందులోని మరో సౌలభ్యం.
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.
అతి చిన్న నదిని చూద్దాం రండి
‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తె అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రం లో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు కేవలం 440 అడుగులు. అంత ‘చిన్న’ నది వచ్చి కలుస్తున్నది దేనిలో? సముద్రాలు అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో. అది మరో విశేషం. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే – ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డ కట్టెంత చల్లగా వుంటాయి.
మహా సంగమం
సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ- సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు. మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.
హేస్టాక్ రాక్
అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది దాన్ని చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్ రోడ్డు ఎక్కాము.
(భండారు శ్రీనివాసరావు, 10-08-2010)
NOTE:All the images in the blog are copy righted to the respective owners.
థ్యాంక్స్ అండి శ్రీనివాస్ రావు గారు... కాసేపు పసిఫిక్ సముద్ర తీరంలో విహరింపజేసారు...
రిప్లయితొలగించండిథాంక్స్ జగదీష్ గారు- ‘విన్నంతలో-కన్నంతలో ‘ అని పెట్టడానికి కారణం వుంది. అమెరికా గురించి విన్నవీ, అమెరికాలో నేను కళ్ళారా చూసినవీ సమన్వయం చేసుకుంటూ రాయడం నా ఉద్దేశ్యం. లోగడ నా బ్లాగులో రాసిన అమెరికా అనుభవాలు, మాస్కో (సోవియట్ యూనియన్) అనుభవాలు ఇలా రాసినవే.- భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి