26, డిసెంబర్ 2009, శనివారం

వార్త - వ్యాఖ్య - స్వయంకృతాపరాధాలు

వార్త - వ్యాఖ్య - స్వయంకృతాపరాధాలు
- భండారు శ్రీనివాసరావు

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే - ‘విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి’ తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం - తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ-గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానమ్గా చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా!జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ చానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసే అనడం, నాన్నను ఒరే అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాతి పుస్తకాలే ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు.
 పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

(సెప్టెంబర్- 2009)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి