26, డిసెంబర్ 2009, శనివారం

పత్రికలు - రాజకీయాలు (వార్త - వ్యాఖ్య) - భండారు శ్రీనివాసరావు

పత్రికలు - రాజకీయాలు (వార్త - వ్యాఖ్య)
- భండారు శ్రీనివాసరావు


హెలి కాఫ్టర్ దుర్ఘటనలో రాజశేఖర్ రెడ్డిగారు మరణించి రెండు వారాలు గడచి పోయాయి. మొదటి రెండు మూడు రోజులు- తెలుగునాట ’మీడియా’ నిర్వహించిన పాత్ర అభినందనీయం. ఇప్పుడు మీడియా అనే పదాన్ని పత్రికలకు, టెలివిజన్ ఛానెళ్ళకు అన్వయించి విస్తృతార్ధంలో వాడుతున్నారు. ఈ రెండు మాథ్యమాలు - దుర్ఘటన్ గురించిన సవివరమైన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పటానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డాయి. దుర్గమారణ్యంలో వాగులు, వంకలు కాలి నడకన దాటుకుంటూ వెళ్ళి - సమాచార సేకరణలో తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. స్థానిక ఛానెళ్ళు చిత్రీకరించిన దృశ్యాలనే అనేక జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్ళు ఉపయోగించుకున్న తీరే ఇందుకు నిదర్శనం. ఇంతవరకు తెలుగు మిడియా నిర్వహించిన పాత్రను కొనియాడితిరవలసిందే.అయితే, క్రమేపీ రాజశేఖరరెడ్డి గారు జివించి ఉన్నప్పటి - అంటే గత రెండు మూడేళ్ళ కాలంగా జనం గమనిస్తూ వచ్చిన అంశాలే మళ్ళీ మీడియాలో చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇది దురదృష్టకర పరిణామం.

పదవిలో ఉంటూ ఒక ముఖ్యమంత్రి చనిపోవడం అన్నది మన రాష్టానికి సంబంధించినంతవరకు ఇదే ప్రథమం. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులను మార్చిన సందర్భాలకు, ప్రస్తుత సన్నివేశానికి హస్తి మశకాంతరం తేడా ఉంది. చనిపోయిన వ్యక్తి సాక్షాత్తూ ముఖ్యమంత్రి. అందునా రాజశేఖర రెడ్డి. వ్యక్తిత్వ శోభతో, నాయకత్వ పటిమతో, దీక్షా దక్షతలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి పార్టీ అధిష్టానాన్ని సైతం ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. ఆయన లేని లోటును ఊహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వై.ఎస్సార్ మృతితో రాష్ట్రం యావత్తూ దిగ్భ్రాంతికి గురయ్యింది. జనం చేష్టలుడిగి పోయారు. సొంత మనిషి మరణించినట్టుగా తెలుగు నాట ప్రతి ఇంటా విషాద చాయలు అలముకున్నాయి. ’వై.ఎస్సార్ ఇక లేరు’ అన్న దారుణ వార్త జీర్ణించుకోలేక దాదాపు మూడు వందలపై చిలుకు అభిమానులు, ఆపన్నులు గుండె పగిలి చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందంటే - ఈ దుర్ఘటన ప్రజలను ఏ స్థాయిలో ఏరకంగా కలచివేసిందో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తేరుకుని తక్షణ కర్తవ్యానికి నడుం బిగించింది. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వయసు రీత్యా అనుభవం రీత్యా అత్యంత సీనియర్ అయిన రోశయ్య గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.

వై.ఎస్సార్ మంత్రి మండలిలోని ఇతర మంత్రుల చేత కూడా మరోసారి ప్రమాణ స్వీకారం చేయించి అవే శాఖలు అప్పగించి ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ సజావుగా సాగిపోయేందుకు ఏర్పాటు చేసింది.

రోశయ్య గారికి సంబంధించినంతవరకు ఇది అయాచిత పదవి. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరువాత కూడా పలుకులో, నడవడికలో ఏ మాత్రం మార్పు లేదు.ఆయన తొలిసారి మంత్రి అయినపుడు ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్ ప్రొఫెషనర్లుగా రాష్ట్ర సర్వీసులో ప్రవేశించిన అధికారులు - ఆయన కళ్ళముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా డీ.జీ.పీగా ఎదిగారు. రాష్ట్రస్థాయిలోను, జిల్లా స్థాయిలోనూ అధికారులను పేరుతో పిలిచి గుర్తుపట్టగల సుదీర్ఘ అనుభవం ఆయనది. పోతే ఫైళ్ళూ,ప్రోజెక్టులు, నిధులు, జమాఖర్చులు కొట్టిన పిండి. అసాధారణ శక్తితో, ప్రసంగాలతోనే ప్రత్యర్ధుల గుండెల్ని పీల్చి పిప్పిచేయగల ప్రతిభా సామర్ధ్యాలు ఆయన సొంతం.

రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా - వై.ఎస్సార్ చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల గురించి రోశయ్య గారికి సంపూర్ణమైన సదవగాహన ఉంది. పైపెచ్చు వైఎస్సార్ కి అత్యంత ఆత్మీయుడు. అందుకే ముఖ్యమంత్రిగా ఆయనని ఎంపిక చేస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ వర్గాలను అంతగా కలవరపరచలేదు.అలాగే మంత్రుల సహాయ నిరాకరణ గురించి మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాలను చూసి రోశయ్యగారు కూడా కలవర పడిన దాఖలాలు లేవు.కాబట్టే అప్పగించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించేందుకే ఆయన కృషి చేస్తున్నారు.
 కాగా, రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డే కావాలనివై.ఎస్సార్ ని అభిమానించే వారు కోరుకోవడం అత్యంత సహజం. వై.ఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది పేద ప్రజలు కూడా అందుకు మద్దతు పలకడం అంతే సహజం. అయితే జగన్ కు ఆశించిన రీతిలో అధిష్టానం మద్దతు దొరకడం లేదన్న విషయాన్ని గోరంతను కొండంతలుగా చేసి జనంలోకి తీసుకువెళ్లాడంలో మీడియా నిర్వహించిన పాత్రను కొందరు తప్పుపడుతున్నారు. జగన్ కు అనుకూలంగా మీడియాలోని ఒక వర్గం ఎంత గట్టిగా పనిచేస్తున్నదో, జగన్ కు వ్యతిరెకంగా మరొక వర్గం అంతే పట్టుదలతో పనిచేస్తున్నదని కాంగ్రెస్ రాజకీయాలను ఔపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు ప్రైవేటు సంభాషణల్లో పేర్కొంటున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో అధిష్టానం బూచిని చూపించి ప్రత్యర్ధులను బెదిరించే సంస్కృతికి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నూకలు చెల్లిపోయాయి.ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీకి సాధించి పెట్టిన విజయం దరిమిలా ఆయన్ని వేలెత్తి చూపగల చేవ, పన్నెత్తి ప్రశ్నించగల సత్తా పార్టీలో కొరవడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుసరిస్తూవస్తున్ననూతన దిశానిర్దేశనం కూడా దీనికి దొహదం చేస్తోంది.

మొదటి అయిదు సంవత్సరాల పదవీ కాలంలో అధిష్టానం వద్ద వై.ఎస్సార్ మాటే చెల్లుబడి అవుతూ వచ్చింది. దానితో రాష్ట్ర స్థాయిలో పార్టీలోని ఆయన ప్రత్యర్dహుల విమర్శలు, ఆరోపణలు ఒక స్థాయికి పరిమితం కావడం మాత్రమే కాకుండా క్రమేపీ వారి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తరువాత అసమ్మతి శక్తులు మళ్ళీ పుంజుకుంటాయని చాలామంది భావించారు. కానీ ఆయన ఆకస్మిక మృతి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబుకిన భావోద్వేగాల నేపథ్యంలో అసమ్మతి స్వరాలు అంతరంగాలకే పరిమితం అయ్యాయి. దాంతో జగన్ ని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తప్ప జగన్ కి వ్యతిరేకంగా చేతులు కలిపి, బహిరంగంగా ముఠా కట్టి వాదం వినిపించగల వాళ్ళు లేకుండా పోయారు.

రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలను శ్రద్ధగా గమనిస్తున్న ప్రతి పక్షాలు కూడా పైకి పెదవి విప్పడం లేదు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలని వాటితో తమకు సంబంధం లేదని పేర్కొంటున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి మృతికి కొన్ని వారాల ముందు తమ పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్హ్ ని వై.ఎస్సార్ అమలు చేస్తున్నారని

ఆయా పార్టీలు చేసిన ఆరోపణలను స్ఫురణకు తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీలోపరిణామాల పట్ల అవి నిర్లిప్తంగా ఉంటాయనుకోలేము. అలాగని బహిరంగ వ్యాఖ్యానలకు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలను తమ రాజకియ అవసరాలకి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాయని కూడా భావించడం పొరపాటే అవుతుంది. కాకపొతే వై.ఎస్సార్ స్థానంలో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావడం ప్రతిపక్షాలకు ప్రధానంగా తెలుగు దేశం పార్టీకి మింగుడు పడకపోవచ్చు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కూడ తన తండ్రి బాటలోనే అదే విధమైన రాజకీయ ఎత్తుగడలను కొనసాగించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంతర్లీనంగా
సందేహపడే వీలుంది.జగన్ కాకపోతే చాలు అన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నట్టు భోగట్టా.

అయితే రాజశేఖర రెడ్డి వంటి మహోన్నత వ్యక్తి మరణించిన వెంటనే ఆయన రాజకీయ వారసత్వానికి సంబంధించి రకరకాల కథనాలు, విశ్లెషణలు మీడియాలో తామర తంపరలుగా వెలువడుతూ ఉండటాన్ని సామాన్య జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ పన్నెత్తి మాట్లాడని కె.వి.పి.సైతం గాంధిభవన్ సమావేశంలో చెలరేగిన ఆవేశకావేశాలను సద్దుమణిగెలా చేసేందు ఉద్వేగంగానే కాకుండా సుదీర్ఘ్హ పోరాటం చేయడం ఒక కొసమెరుపు.

ఈ పరిణామాలను జగన్ వర్గానికి వ్యతిరేకంగా మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం సహజం. ఈ ప్రయత్నాలకు మీడియాలోని ఒక వర్గం సహకరిస్తోందన్నది తాజాగా వినిపిస్తున్న ఆరోపణ. కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు ఇందుకు ఉదాహరణలుగా ఇ ఆరోపణలు చేస్తున్నవారు పేర్కొంటున్నారు. జగన్ కు అనుకూలంగా పార్టీ అధిష్టానానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఉత్తరాది పత్రిక ఒక దానికిచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను యథాతథంగా తర్జుమా చేసి ప్రచురించిన ఒక తెలుగు దినపత్రిక - అలా మాట్లాడినందుకు ఆ నాయకుడిపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటూ ఆ కథనాన్ని ప్రారంభించిన వైనాన్నివారు ఉదహరిస్తున్నారు. కె.వి.పి. ఢిల్లీయాత్రల గురించీ, అధిష్టానం తీరు తెన్నుల గురించి ఊహాగానాలు చేస్తూ మీడియాలోవెలువడుతున్న కథనాలలోని నిబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు.జగన్ కాకపోతే కాంగ్రెస్ లో ఎవరైనా పర్వాలేదన్న పద్ధతిలో మీడియాలో ఒక వర్గం పనికట్టుకుని ప్రచారం చేస్తోందన్నది ఆ ఆరోపణలోని సారాంశం.రాజశేఖర రెడ్డి పత్రికలలోని విశ్వసనీయతని పదే పదే ప్రశ్నిస్తూ ప్రజల్లో తమ పత్రికల పట్ల గౌరవాదరాలు తగ్గిపోయేలా చేశాయన్న కినుకతో ఉన్నపత్రికాధిపతులే ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వారి మాటల్లో తొంగిచూస్తోంది.పత్రికల విశ్వసనీయత పట్ల రాజశేఖర్ రెడ్డి హయాంలో తలెత్తిన నీలినీడలు ఆయన అస్తమయం తర్వాత కారుమబ్బులుగా పరిణమించిడం విషాదం.

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేని సాహసాన్ని - మీడియాలో ఒక వర్గంపై విమర్శలు గుప్పించడం ద్వారా రాజశేఖర రెడ్డి ప్ర్దదర్శించారు.అక్షరంపై ప్రారంభమైన దాడిగా కొందరు విశ్లేషకులు అభివర్ణించారు. అయినా వై.ఎస్సార్ తన సహజ స్వభావానికి తగ్గట్టుగానే ఏ మాత్రం వెనుకంజవేయలేదు.పైపెచ్చు తన విమర్శలకు మరింత పదును జోడించారు. పత్రికల్లో పనిచేసేవారిని, పత్రికలు నడిపే వారిని విడదీసి చూపిస్తూ పత్రికా స్వేచ్చకి తనదైన భాష్యం చెప్పారు.
ఆయన ఇప్పుడు లేరు. తిరిగి రారు. ఇది కఠోర సత్యం.

పత్రికలకు, మీడియాకి విమర్శించే హక్కు ఉంది. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన ధర్మం ఉంది.ఎవరికో కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు లేశ మాత్రం కూడా తలెత్తకుండా పత్రికలను నడపాల్సిన పవిత్ర భాద్యత కూడా వారి భుజస్కంథాలపై ఉంది. ఈ బాధ్యతని సమర్ధంగా, విశ్వసనీయంగా,నిరూపిస్తున్నామని నిరూపించుకోడానికి ఇదే సరైన తరుణం.
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కావడం వలన సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం కలగవచ్చు. లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
 కానీ -
ఈ సూత్రం మీడియాకి వర్తించదు అన్న వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలి.

(సెప్టెంబర్- 2009)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి