24, డిసెంబర్ 2009, గురువారం

ఒక తుర్లపాడు- రెండు గుళ్ళు

ఒక తుర్లపాడు- రెండు గుళ్ళు





'ఇంతవరకు పన్నెండు వేలమందికి పైగా భోజనాలు చేసారుట!'



'అయితే ఏంటట! గత అరవయి ఏళ్లుగా వాళ్ళింట్లో సాగుతూ వస్తున్న 'అన్నసత్రం' గురించి ఏమీ తెలిసినట్టులేదే ? అక్కడ భోజనం చేసిన వాళ్ళతో పోలిస్తే ఇదెంత?'



'ఏళ్లతరబడి పాడుబడ్డ ఈవూరి గుడికి ఈ వైభోగం ఏవిటో? కాశీ నించి తెచ్చారుట చూడండి ఆ శివలింగం ఎలా వెలిగిపోతోందో? కంచిలో చెక్కించుకు వచ్చిన ఆ దేవతా మూర్తుల విగ్రహాలని చూస్తె చాలు జన్మ తరించిపోవడానికి.'



'అది సరేనండీ బాబూ. దాన్ని కాదన్నదెవరు ? అటు చూడండి. గుడికి కూతవేటు దూరంలో పెంకుటిల్లు కనబడుతోందా. ఆ ఇంటి బయట నులక మంచం పై సేదదీరుతున్న 'అపర దేవతలు' కనబడుతున్నారా. ఆయన ఎవరనుకున్నారు. ఇన్నాల్టికి ఈ వైభోగం సంతరించుకున్న ఈ గుడి వుంది చూసారూ ఆ దేవాలయానికి సాక్షాత్తు వంశపారంపర్య ధర్మకర్త - బెజవాడలో పేరుమోసిన లాయరు తుర్లపాటి హనుమంతరావు పంతులుగారు. పోతే ఆ పక్కన వున్నది ఎవరో తెలుసా? డెబ్బయి సంవత్సరాలకు పైగా ఆయన వేలు పట్టుకుని పక్కనే నడుస్తూ - గంపెడు పిల్లలను - సొంతం, పరాయి అన్న తేడా లేకుండా - పెంచి పెద్ద చేసిన మహా దొడ్డ ఇల్లాలు ఆయన సహధర్మచారిణి- సరస్వతమ్మ గారు -. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే శివ పార్వతులను చూస్తున్నట్టుగా లేదూ?'



'మీరు భలే చెబుతారండీ! ప్లీడరు గారిని తెలియని వాళ్ళు ఈ తాలూకాలోనే కాదు, హోలుమొత్తం జిల్లాలోనే లేరు. అలాగే సరస్వతమ్మగారు- ఆమె చేతి వంట రుచి చూడని వాళ్ళు వాళ్ళ చుట్టపక్కాల్లో కలికం వేసినా కనిపించరు. ఆయన గారి మాటకు అంత విలువ వున్నది కనుకనే - ఈ సత్కార్య నిర్వహణకు వేలూ లక్షలు పోగుపడ్డాయి.'



'ఒక్క డబ్బుంటే సరిపోతుందా! అదిగో అటు చూడండి! దీక్షా వస్త్రాలలో తిరుగుతున్నాడే ఆ కుర్రవాడు. అడ్వకేటు గారి చిన్నకొడుకు. పెద్దాయన లాగే ఈ చిన్నాయన కూడా విజయవాడలో పెద్ద లాయరుగారే. పేరు భై ర్రాజు. వయస్సులో చిన్నవాడయినా - పెద్దల పేరు నిలబెట్టడానికి నడుం కట్టాడు. ఆలోచన నాన్న గారిది. ఆచరణ పిల్లవాడిది. సంకల్ప బలం వుంటే తిరుగుండదు అనడానికి ఈ రోజు ఈ వూళ్ళో జరుగుతున్న ఈ ఉత్సవమే ఒక ఉదాహరణ. ఇంత చిన్న వయస్సులో ఇంతటి మహత్కార్యక్రమాన్ని నిష్ఫలా పేక్షతో - నిర్వహిస్తున్నాడే ఆ చిన్నవాడి పెద్దమనస్సును మెచ్చుకోక తప్పదు. అందుకే అన్నారు - దైవం మానుష రూపేణా అని. - మీరు గుడికి వెళ్లి ఆ దేవదేవుడి పూజలో తరించండి. నేను మాత్రం - నిజమయిన దేవతలు కొలువున్న ఈ 'గుడి' లోనే కాలక్షేపం చేస్తాను'



- భండారు శ్రీనివాస రావు

22-11-2009 తుర్లపాడు నుంచి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి