24, డిసెంబర్ 2009, గురువారం

దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున_

________________దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున________________________

అందరికీ నమస్కారం...



జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.



నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.



చూస్తుండగానే ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి.ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల -చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు.ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.



అసూయ తెలియని పై అధికారులు-అత్మీయత కనబరిచే సాటి సిబ్బంది- ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?



అందుకే- అత్త లేని కోడలులాగా అందరిలోను-అందరితోను కలిసిపోయి,కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగానని అనుకుంటున్నాను.



అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక - ఎప్పుడో ఒకప్పుడు - ఎవరినోఒకరిని నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే సారీ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం పరమార్ధం.



నాకు మాట్లాడడం రాదు.ఇది నా మాట కాదు.-మా ఆవిడ ఉవాచ.

అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నను.



మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...



నిజమే!కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...



అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.



హైదరాబాదు

02-01-2006. -భండారు శ్రీనివాసరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి