ఆయాం ఎ బిగ్ జీరో (180) - భండారు శ్రీనివాస రావు
అమెరికాలో మాస్కో
నాకు తేదీలు వారాలు సరిగా గుర్తుండవు. ఇక అమెరికా ప్రయాణంలో మరీ అయోమయం.
హైదరాబాద్ లో జూన్ 12, గురువారం తెల్లవారుఝామున నాలుగుంబావుకు బయలుదేరి, దాదాపు 23 గంటలు విమానయానం చేసి మళ్ళీ 12 గురువారం మధ్యాన్నం సియాటిల్ చేరుకున్నాను. మధ్యలో మాయం అయిన ఒకరోజు విష్ణు మాయ.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు, భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకున్నాను. మళ్ళీ అదే రోజు అవే టాబ్లెట్లు వేసుకోవాలా అక్కరలేదా? ఇదో పెద్ద మీమాంస.
రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ గా వుండే నావంటి మనిషికి రావాల్సిన సందేహం కాదని సమాధాన పరచుకున్నాను.
బెల్ వ్యూ లో ఇంటికి చేరి కోడలు భావనతో కాసేపు ముచ్చట్లు చెప్పి బాత్ టబ్ లో వేడి నీటి ధారలతో శరీరాన్ని మర్ధనా చేసుకుని దోహా నుంచి సియాటిల్ కు ఇరవై గంటలు ఏకధాటిగా చేసిన ప్రయాణపు బడలిక కొంత తీర్చుకుని, భావన అప్పటికప్పుడు చేసిన వేడి భోజనం తిని ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయాను.
మరునాడు శుక్రవారం ఉదయం నలుగురం కారులో అరెగాన్ బయలు దేరాము. సృష్టి యూనివర్సిటీలోనే వుంది.
పోర్ట్ లాండ్ దాటక ముందే కారును ఒక అడవి బాటకు మళ్ళించారు.
గుబురుగా పెరిగిన వృక్షఛాయల నడుమ ఒక సెలయేరు పారుతోంది. అక్కడే కారులో కూర్చుని ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోరను మౌంటైన్ హై గడ్డపెరుగుతో తిన్నాము. నాతో ప్రయాణం అంటే భావనకు ఇదో అదనపు పని భారం. లేకపోతే వాళ్ళు హాయిగా పిజ్జాలతో భోజనం అయిందనిపించే వాళ్లేమో!
ఆ అడవిలో ఒక చిత్రం చూశాను. యూనిఫారాల్లో వచ్చిన సిబ్బంది, అధికారులు పొడవాటి గొట్టాలతో ట్యాంకుల్లో తెచ్చిన నీటిని అడవిపై స్ప్రే చేస్తున్నారు. ఎందుకుటా! కార్చిచ్చులు చెలరేగి అడవులు తగులబడి పోకుండా చూడడం కోసమట. అప్పటికి వంద మైళ్లకు పైగా దాటివచ్చాము. దారికి రెండు వైపులా కనిపించిన జనవాసాలు తక్కువ. గుబురుగా పెరిగిన పచ్చటి అడవులు ఎక్కువ. అయినా వృక్ష సంపదను కాపాడుకోవడానికి వాళ్ళ ఆరాటం చూసి ముచ్చట వేసింది. అయితే కారు దిగి ఫోటో తీయడానికి సంక్షేపించాను.
కాసేపటి తర్వాత కారు కొలంబియా నదిపై నిర్మించిన వంతెన దాటి అరెగాన్ రాష్ట్రంలో ప్రవేశించింది. కింద నదిలో పడవలు, పైన ఆకాశంలో విమానం, వంతెన రోడ్డుపై కార్లు ఇలా అన్ని రకాల ప్రయాణ సాధనాలు. అయితే అన్నింటినీ ఒకే ఫోటో ఫ్రేములో బంధించడం నాకు చేత కాలేదు.
మధ్యలో ఒకచోట, వాంకూవర్ అనే చోట మెక్ డోనాల్డ్ లో వేడి కాఫీ కోసం ఆగాము. రెస్టు రూమ్ తెరుచుకోవడానికి ఒక కోడ్ నెంబరు ఇచ్చారు. అదీ ఆర్డర్ డిస్ ప్లే బోర్డుపై కావాల్సినవి కొనుక్కుని ఆన్ లైన్ పేమెంట్ చేసిన తర్వాత. ఈ దేశంలో ఏదీ ఉచితం కాదు అనే సత్యం మరోసారి బోధపడింది.
మొత్తం మీద చేరాల్సిన అడంగు సేలం (SALEM) చేరి, ముందుగా బుక్ చేసుకున్న డబుల్ ట్రీ హిల్ టన్ హోటల్లో శుక్రవారం రాత్రి సేదతీరాము. అక్కడికి గంట దూరంలో వున్న యూ జీన్ (EUGENE) లోని యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక.
అక్కడ నుంచి నా మనుమరాలు సృష్టి తన కారులో మా హోటల్ కు చేరుకుంది. అందరం కలిసి వెళ్లి దగ్గరలోని థాయ్ రెస్టారెంటుకు వెళ్ళాము. వాళ్ళు తమకు ఇష్టం అయినవి తిన్నారు. హోటల్ కు రాగానే భావన వెంట తెచ్చిన కుక్కర్ లో నిమిషాల మీద వేడి అన్నం, సాంబారు తయారు చేసి, ఆవకాయ కారంతో అన్నం పెట్టింది.
చెప్పాను కదా!
ఇలాంటి ట్రిప్పుల్లో వున్న లగేజికి తోడు నా తిండి అలవాట్లు భావనకు మరో భారం అని.
తెల్లారిన తర్వాత యూనివర్సిటీ కి వెళ్ళాలి.
తోక టపా :
అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే 'తొమ్మిదివేల'ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి - ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.
ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశంలోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క డిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటే దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్,బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ దేశంలోని పట్టణాలకు వున్నాయి.
కింది ఫోటో :
సేలం నగరంలో థాయ్ రెస్టారెంట్లో వంటకాల వడ్డన సొగసు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి