ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ
టంగుటూరి అంజయ్య, తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో
ఆసీనులయ్యేవారు. ‘అమ్మ’ (శ్రీమతి
ఇందిరాగాంధి) కూడా
ఫ్రంటు సీటే సుమా!’ అని
అమాయకంగా అనేవారు. ఆవిడ
కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు ముందు
సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది. ప్రజల
మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ. ‘లైఫ్
బాయ్ ఎక్కడవుంటే ఆరోగ్యం
అక్కడ వుంటుంది’ అనే
వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం. బాత్రూం, బెడ్
రూముల్లో కూడా
ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి
కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా
ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ
చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ కారుకు యజమాని
అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం పూర్తిగా
మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన
సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా యాంగిళ్లకి
కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీ, రెండు
వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం మరో
కారణం.
నేను రేడియోలో పనిచేసినప్పుడు వున్న పాత సచివాలయ
భవనాలు నాకు తెలిసే రెండు మార్లు తమ రూపురేఖలు మార్చుకున్నాయి. సరే,
తెలంగాణా ఏర్పడ్డ తరవాత కేసీఆర్ హయాములో ఒక విశాలమైన ఆధునిక హంగులతో కూడిన
రాజభవనాన్ని తలపించే రీతిలో సరికొత్త సచివాలయాన్ని నిర్మించారు.
పాత కాలం జర్నలిస్టులు తమ వృత్తి ధర్మం కోసం
నడయాడిన నిజాం కాలం నాటి భవనాలలో కొన్ని అప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి.
విలేకరులకు కేటాయించిన భవనం వెనుకనే ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం పేషీ
వుండేది. ఆ
భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు
చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస కూడా రాజమందిరాన్ని గుర్తుకు తెచ్చే విధంగా
వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే
అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా
ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో
తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ
సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు.
ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ
పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ
తెలిసినట్టు లేదు'
అని వాపోయాడు.
సరే విషయానికి వస్తే,
నాలుగు దశాబ్దాలకు పూర్వం ఇప్పుడు ఉన్న సచివాలయం
ఫ్లై ఓవర్ లేదు. ప్రధాన ద్వారం కూడా హుస్సేన్ సాగర్ వైపున కాకుండా మెయిన్ రోడ్డు
మీద వుండేది. ఇనుప చువ్వలతో కూడిన పెద్ద గేటు. ఆ గేటు దగ్గర ఇప్పట్లోలా మందీ
మార్బలం వుండేది కాదు. ఒకళ్ళో ఇద్దరో సచివాలయం సిబ్బంది కాపలాగా వుండేవాళ్ళు.
సచివాలయం బీట్
చూసే విలేకరులం అందరం ప్రతి రోజూ అక్కడ
కలిసేవాళ్ళం.
ఎంట్రీ పాసు వున్నా కూడా లోపలకు వెళ్ళడానికి
మొదట్లో బెరుగ్గా వుండేది. ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు సీనియర్ జర్నలిస్టు. ఆయన
పనిచేసే ఆంధ్రజ్యోతి ఆఫీసు సచివాలయం ఎదురుగానే వుండేది. ఆయన ఫుల్ సూటు ధరించి ఒక
చేతిలో బ్రీఫ్ కేసు,
మరో చేతి వేళ్ళనడుమ వెలుగుతున్న సిగరెట్టుతో
దర్జాగా వస్తుంటే అల్లంత దూరం నుంచే కాపలాదారు గుర్తుపట్టి, సెల్యూట్
చేసి గేటు తెరిచేవాడు. విలేకరి జీవితం అలవాటు అయిన పిదప ఈ వైభోగం నాకూ పట్టింది
అనుకోండి. విజిటింగ్ కార్డు అవసరం లేని విలేకరిగా అందరూ గుర్తుపట్టే పరిస్తితి
వచ్చింది. చిత్రం ఏమిటంటే రేడియో స్టేషన్ దగ్గర కాపలా వాళ్ళు మాత్రం ప్రతిసారీ
మీరు ఎవరి కోసం వచ్చారు అని అడిగేవారు. ఎందుకంటే నేను అక్కడ గడిపేది
కాసేపే.
సచివాలయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు ముగిసిన
తర్వాత నడుచుకుంటూ
రేడియోకి వెళ్ళేవాడిని. ఓ రోజు అలా వెడుతూ గోపీ హోటల్ (ఆ రోజుల్లో చాలా ఫేమస్.
కామత్ హోటల్ ఎదురుగా ఓ పాత భవనంలో వుండేది) దాకా వచ్చాను. ఇంతలో సైరన్
మోగించుకుంటూ ఓ పోలీసు వాహనం వెళ్ళింది. కాసేపటికి మరో వాహనం నా పక్కగానే వెళ్లి కొంత
ముందుకు పోయి ఆగింది. అందులో నుంచి ముఖ్యమంత్రి భద్రతాధికారి బాలాజీ దిగి నా
వైపుగా వచ్చాడు. సిఎం గారు కారులో వున్నారు అని చెప్పి ఎక్కించాడు. అది సరాసరి
రేడియో స్టేషన్ ఆవరణలోకి వెళ్ళింది. ఈలోగా ముందు
వెళ్ళిపోయిన
పైలట్ కారు వెనక్కి
వచ్చింది. నన్ను దింపేసిన తర్వాత సీఎం కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది.
చెప్పాపెట్టకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడం చూసి అందరూ నివ్వెర పోయారు.
నడిచి వెడుతున్న నాకు ఆఫీసుదాకా అడగకుండా లిఫ్ట్
ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు.
ఆయన భోళాతనం, అమాయకత్వం
రాజకీయ నాయకులకు వేళాకోళంగా అనిపించేవేమో కానీ సామాన్య జనం మాత్రం బాగా
ఇష్టపడేవారు. మనసులో ఏదీ దాచుకునేవారు కాదు. మాటల్లో, చేతల్లో
తానొక ముఖ్యమంత్రిని అనే అతిశయం, ఆర్భాటం కానవచ్చేది కాదు.
ఒకరోజు మెదక్ జిల్లా పర్యటనకోసం సచివాలయం నుంచి
ముఖ్యమంత్రి బయలుదేరారు. నేనూ ఆయన కారులోనే వున్నాను. అప్పటికి ఖైరతాబాదు ఫ్లై
ఓవర్ లేదు. కాన్వాయ్ రాజభవన్ రోడ్డులోకి ప్రవేశిస్తుండగా అంజయ్య గారు ఇక్కడెక్కడో
మదన్ ఇల్లు ఉండాలే అన్నారు. మదన్ అంటే మదన్ మోహన్. అంజయ్య మంత్రివర్గంలో ముఖ్యుడు.
ఆయన ఇంటికి పోదాం అని చెప్పడంతో కారును అటు తిప్పారు. ముఖ్యమంత్రి హఠాత్తుగా
చెప్పాపెట్టకుండా రావడంతో అక్కడ సిబ్బంది కంగారుపడి మంత్రికి చెప్పారు. మదన్ మోహన్
గారు లోపల నుంచి హడావిడిగా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి తాపీగా ‘మదన్! బాత్ర్రూం
ఎక్కడ?’ అని
అడిగి కాలకృత్యం తీర్చుకుని వచ్చారు. తర్వాత మదన్ మోహన్ గారి శ్రీమతి తయారు
చేసిచ్చిన చాయ్ తాగి మళ్ళీ బయలుదేరారు. అలా వుండేది అంజయ్య గారి వ్యవహార శైలి.
ఎలాంటి భేషజాలు లేని మనిషి.
కింది ఫోటో:
శ్రీ టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న
నాటి గవర్నర్ శ్రీ కేసీ. అబ్రహాం. వెనుక డిజీపీ ఎం. నారాయణ రావు గారు,
తదనంతర కాలంలో డీజీపీగా, తమిళనాడు గవర్నర్ గా
పనిచేసిన శ్రీ పి.ఎస్. రామమోహన రావు గారు. వారి నడుమ చుబుకం మీద చేయి ఆనించుకుని నిలబడ్డది
నేనే.
(ఇంకా వుంది)
సర్ , ఇవన్నీ ఓ పుస్తకం కూడా రాయండి విలువైన అనుభవాలు.
రిప్లయితొలగించండిఅమెరికా లోనూ, భారతదేశం లోనూ ఉన్న మీ బంధు మిత్ర పరివారం ఈ పుస్తకాన్ని తీసుకువస్తే బాగుంటుంది
రిప్లయితొలగించండి