పురుషులలో
ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు
తెలుసు.
అలాంటి ఒకానొక
రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా
పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని
భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం
సంజీవరెడ్డి.
సంజీవరెడ్డి
గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే
వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా
రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు
ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి
చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.
అనంతపురంలో
మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ
అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా
స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు
పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను
హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
‘ రాష్ట్రపతి
క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి
కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో
అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి
ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
‘వాళ్ళు అలానే
చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని
నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు
బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం
కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
‘ఇది అవసరమా’
అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.
ఒక
రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు అక్కడికి బయలుదేరారు.
సందర్భం
కనుక, ఇల్లూరు చేరేలోగా నీలం సంజీవరెడ్డి
గారి గురించి క్లుప్తంగా నాలుగు ముక్కలు.
1956 లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా
పనిచేశారు. బస్సుల జాతీయకరణ అంశంలో నాయస్థానం తప్పుపట్టిన చిన్న కారణంతో మనస్తాపం
చెందిన సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని రాజకీయాల్లో నైతిక
విలువల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తుంటారు. నిజాయితీ
విషయంలో ఆయన్ని ప్రత్యర్థులు కూడా తప్పుపట్టలేరు. లోక సభ స్పీకర్ గా
ఎన్నికయినప్పుడు వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక
సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిష్పక్షపాతంగా సభని నిర్వహించేందుకు తాను ఈ
నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.
దేశ
రాజకీయాలను మలుపు తిప్పిన ఒక పరిణామంలో సంజీవరెడ్డి గారు ఒక భాగస్వామి. 1969 లో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత
రాష్ట్రపతి అభ్యర్ధిగా సంజీవరెడ్డిని నాటి పాలకపక్షం అయిన కాంగ్రెస్ అధిష్టానం
నామినేట్ చేసింది. అయితే పార్టీలో తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకునేందుకు నాటి
ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఇండిపెండెంట్ అభ్యర్ధి వీవీ గిరికి మద్దతు పలకడంతో
ఆయన గెలవడం,
పార్టీ అధికార అభ్యర్ధి సంజీవరెడ్డి పరాజయం పాలవడం జరిగింది. దానితో ఖిన్నుడైన
సంజీవరెడ్డి గారు,
రాజకీయాలను వదిలిపెట్టి అనంతపూర్ కు వచ్చి వ్యవసాయంలో నిమగ్నం అయ్యారు. 1977 లో
జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఏర్పడ్డ జనతా పార్టీలో చేరి నంద్యాల నుంచి పోటీ చేసి
లోకసభకి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయిన మొత్తం 42 మంది అభ్యర్ధులలో ఈయన ఒక్కరే కాంగ్రెసేతర అభ్యర్ధి. అయితే ఆ ఎన్నికల్లో కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది.
అప్పుడు ఆయన్ని లోక సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తరువాత జరిగిన
రాష్ట్రపతి ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా గెలిచి 1977 జులై 25 న రాష్ట్రపతిగా
పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పోటీ లేకుండా రాష్ట్రపతి పదవికి ఎన్నికయిన ఘనత కూడా
ఆయన ఖాతాలో చేరింది. 64 ఏళ్ల
అతితక్కువ పిన్న వయస్సులో అత్యంత ఉన్నత
పదవికి ఎన్నికయిన కీర్తి కూడా సంపాదించుకున్నారు. రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో ఆయన
ముగ్గురు ప్రధానులు, మొరార్జీ
దేశాయ్, చరణ్ సింగ్
లతోనే కాకుండా, ఒకనాడు
రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటమికి కారకురాలైన ఇందిరా గాంధీతో కూడా కలిసి పనిచేయడం విశేషం.
ఇల్లూరులో
నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా
‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో
ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం
ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి
మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు. అది మొదటి వార్తగా వస్తుందని
నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా
సంజీవరెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి గారు. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో
తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న
మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు
మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో
బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల
గ్రామంలో వార్త ,అంత
త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను ఇప్పటికీ
గర్వపడే మరో విషయం ఏమిటంటే, ఆ నాటి
శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం
రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ.
భుజం తట్టారు,
మెచ్చుకోలుగా.
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన డాక్టర్
నీలం సంజీవరెడ్డి 1996 లో తన 83 వ ఏట బెంగుళూరులో
కన్నుమూశారు.
కింది
ఫోటో :
నాటి
రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి
(ఇంకా
వుంది)
పి ఎల్ సంజీవరెడ్డి గారు పైడి లక్ష్మయ్య గారి కుమారులు. వారు కమ్మ వారు. పైడి లక్ష్మయ్య గారు నీలం సంజీవరెడ్డి గారు మంచి స్నేహితులు. అభిమానం తో లక్ష్మయ్య గారు కుమారుడికి మిత్రుడి పేరు సంజీవ రెడ్డి అని పెట్టారు అని అనంతపురం లో చెప్పే వారు.
రిప్లయితొలగించండిరాజకీయ విలువలు కలిగిన నాయకుడు నీలం సంజీవ రెడ్డి గారు.
అయితే 1951 లో మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సంజీవ రెడ్డి గారు తన బావ మరిది కమ్యునిస్టు నాయకుడు అయిన తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.