7, జనవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (58) - భండారు శ్రీనివాసరావు

 సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాడు జీవితంలో విజయం సాధిస్తాడు అంటారు. ఈ సూత్రం మాత్రం రాజకీయాల్లో బాగా పనికివస్తుంది అనడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఒక ఉదాహరణ.

ఒకానొక కాలంలో పనుల మీద వివిధ జిల్లాల నుంచి హైదరాబాదు వచ్చే ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు ఆబిడ్స్ లో వుండే వసంత్ విహార్ హోటల్ ఒక విడిది. నాకు బాబాయి వరస అయ్యే నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆ హోటల్లోనే దిగేవాడు. ఒకటో నెంబరు గదిని ఆయన కోసం ప్రత్యేకించేవారు. అంతే కాదు పీటలు వేసి విస్తరిలో భోజనం వడ్డించే వారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు బొమ్మకంటిని కలుసుకోవడానికి ఆ హోటల్ కు వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండడం వల్ల ఆయనకు ఆ గౌరవం. బొమ్మకంటి తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ సమైక్యవాది.

నేను రేడియోలో చేరడానికి చాలా ముందుగానే నా మిత్రుడు వనం జ్వాలా నరసింహారావు పై చదువులుఉద్యోగం నిమిత్తం హైదరాబాదులోనే ఆయన మకాము. చిన్నప్పటి నుంచి  తన గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. పాలిటిక్స్  అంటే తగని ఆసక్తి. నాకు ఆసక్తి ఎలావున్నా, వృత్తిరీత్యా రాజకీయ నాయకులను కలుసునే వెసులుబాటు వుండేది.

ఒకరోజు జ్వాలా నన్ను ఆయన స్కూటర్ పై  ఎక్కించుకుని ఆబిడ్స్ లోని వసంత్ విహార్ కు తీసుకువెళ్లాడు.

అప్పటికే జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వంలో  కాంగ్రెస్ (ఐ) పార్టీ ఏర్పాటు అయింది. కొత్త పార్టీ పట్ల రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులకు ఆట్టే గురి కుదరలేదు. గుర్తింపు కలిగిన నాయకత్వం కొరత వుంది. చెన్నారెడ్డి అప్పటికి ఇంకా ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోలేదు.

ఈ నేపధ్యంలో మేము వసంత్ విహార్ హోటల్లో బస చేసిన, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  బొమ్మకంటి సత్యనారాయణ రావు గారిని కలుసుకున్నాము. (మేము ఆయన్ని సత్యం బాబాయ్ అని పిలుస్తాము. ఆయన కుమారుడే బొమ్మకంటి శంకర రావుఐ.పి.ఎస్.  పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయి, ఈ మధ్యనే కన్ను మూశాడు)

మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు వగైరా మాట్లాడుకున్న తరువాత జ్వాలా ఆయన్ని నేరుగా రాజకీయాల్లోకి దించాడు. ఇందిర పార్టీకి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకుడు లేడు. మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా! అని సూచనగా చెప్పాడు.

అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు.

“ఒర్రేయ్  నరసింహం!  పార్టీ అంటే మాటలు కాదురా! అంత  బరువు ఇప్పుడు ఎవడు మోస్తాడు? ఈ వయసులో అవసరమా చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసాడు.

ఇంకో మాట కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ఆయనకు ఇందిరాగాంధి శక్తి సామర్ధ్యాల పట్ల అంత నమ్మకం వున్నట్టు నాకు అనిపించలేదు. మరి ఆమె గురించే అన్నాడో సరిగా గుర్తు లేదు కానీ, ‘గాంధారి గర్వ భంగం అవుతుంది చూడండి’ అన్న మాట గుర్తుంది.

అంతటి అనుభవశాలి కూడా వర్తమాన  రాజకీయాలను అధ్యయనం చేయడంలో విఫలం అయ్యాడు.

అదే చెన్నారెడ్డి గారు సరైన సమయంలో  సరైన నిర్ణయం తీసుకుని, నాయకత్వలోపంతో కునారిల్లుతున్న కాంగ్రెస్ (ఐ) రాష్ట్ర నాయకత్వ పగ్గాలను చేపట్టి, కొత్తగా పురుడు పోసుకున్న ఆ పార్టీకి రాష్ట్రంలో నూతన జవసత్వాలను ప్రసాదించి,  ఎన్నికల్లో ఆ పార్టీని  విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రిగా మొదటిసారి  అధికార పగ్గాలను చేపట్టారు.

దటీజ్ చెన్నారెడ్డి.

ఆ రోజుల్లో ఒకసారి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. ఇప్పటి మాదిరిగా యా రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ఇన్నిన్ని విమానాలు లేవు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు నడిచేవి. అవి కూడా ఢిల్లీ నుంచి మద్రాసుకి, మద్రాసు నుంచి ఢిల్లీకి హైదరాబాదు మీదుగా వెళ్ళే విమానాలు.

ఆ రోజు, డిసెంబరు 17 1978,  మధ్యాన్నం  ఇంట్లో కూర్చుని స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటే రేడియోలో ఒక ప్రకటన వినపడింది. రక్తదాతలు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేయాలని పోలీసు అధికారుల పిలుపు. ఒకటికి రెండుసార్లు అదే ప్రకటన వస్తుంటే అనుమానం వేసి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాను.  బేగం పేట ఎయిర్ పోర్టులో ఏదో ప్రమాదం జరిగిందని మాత్రం చెప్పారు.

వెంటనే స్కూటర్ వేసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. నేను వెళ్ళే సరికే అంతా అయిపోయింది.  టేక్ ఆఫ్ దశలో, విమానం చివరి భాగానికి మంటలు అంటుకోవడంతో  ఢిల్లీ వెళ్ళే విమానం వంద మీటర్లకు పైగా ఎత్తు నుంచి రన్ వే చివర్లో కూలిపోయిందని తెలిసింది. ఫైర్ ఇంజిన్లు చిమ్మిన నీళ్ళతో ఆ ప్రాంతం అంతా తడిసిపోయింది.  పోలీసు వాహనాలు, అంబులెన్సులతో చాలా హడావిడిగా వుంది. చుట్టూ తాళ్ళతో పోలీసులు బారికేడ్లు కట్టారు. ఎవరినీ దగ్గరకు పోనివ్వడం లేదు.

కింది ఫోటో:



బేగంపేట విమాన ప్రమాదం, ఇండియన్ ఎక్స్ ప్రెస్  పత్రిక న్యూస్ క్లిప్పింగులు: జి. శ్రీనివాసులు ఎక్స్ ప్రెస్ ఫోటోగ్రాఫర్  

(Courtesy: Marri Sashidhar Reddy)

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి