20, డిసెంబర్ 2024, శుక్రవారం

పుస్తకానికి పురిటి నొప్పులు – భండారు శ్రీనివాసరావు

 

నేలలో పాతిన విత్తనం భూమిని చీల్చుకుని ఒక  చిన్ని మొలకగా రూపం దాల్చడానికి ఎంత ప్రసవవేదన పడుతుందో రచయిత మనసులోని మాటలు, భావాలు అక్షర రూపంలో పెట్టడానికి అంతటి వేదన పడతాడని నా చిన్నప్పుడు చదివిన జ్ఞాపకం.  ఇలా గుర్తుకు వచ్చినవన్నీ రాస్తూ పోతుంటే, కొందరు మిత్రులు తరచుగా చెప్పే మాట ఒక్కటే. ఇవన్నీ ఒక పుస్తకంగా ఎందుకు వేయరు అని. వారి అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా వుండాల్సిందే. అయితే అలాంటి సలహాలకు నేను పలుమార్లు ఇస్తూ వచ్చిన రొటీన్ జవాబు ఒక్కటే. సినిమా చూసేవాడు, సినిమా చూడాలి. అంతేకానీ, సేనిమా తీయాలని అనుకోకూడదు. అలాగే రాసేవాడు రాయడం మాత్రమే చేయాలి. పుస్తకంగా వేయాలి అనుకుంటే పెళ్లి చేసి చూడు అనే సామెత మాదిరిగా పరిస్థితి తయారవుతుంది. నిజానికి నలుగురికి నచ్చేలా రాయడం ఒక ఆర్టు. అది నలుగురు చదివేలా పుస్తకంగా వేయడం వుంది చూశారూ, అదో మహా యజ్ఞం. నవ మాసాలు మోసి కన్న బిడ్డను చూస్తే తల్లికి ఎంత సంతోషం వేస్తుందో, రోజులతరబడి మేధో మధనం చేసి రాసిన పుస్తకాన్ని అచ్చులో చూసుకున్నప్పుడు కూడా అంతటి ఆనందం రచయితకు  కలుగుతుంది. అయితే అంతకు ముందు ఆ తల్లి పడిన పురుటి నొప్పుల మాట ఏమిటి? అవి తట్టుకోగల మనోధైర్యం వున్నప్పుడే ఈ సాహసానికి ఒడి కట్టాలి. అంతవరకూ ఫేస్ బుక్ వంటి మాధ్యమాలతో సర్దుకుపోవాలి. తప్పదు.

పుస్తకాల విషయంలో జర్నలిస్టులకు ఒక వెసులుబాటు వుంది. ప్రత్యేకించి రాయాల్సిన అవసరం వుండదు. వృత్తి జీవితంలో రాసిన వ్యాసాలను, రచనలను ఏరుకుని,  ఒక క్రమ  పద్దతిలో కూర్చుకుని పుస్తక రూపంలో తీసుకువస్తే సరిపోతుంది. ఎడిటింగ్ అనుభవం ఎలాగు వుంటుంది కాబట్టి, మరికొంత వెసులుబాటు.

డమ్మీ కాపీలు నాలుగయిదు వేసుకుంటే సరిపోతుంది.

కానీ అసలు లక్ష్యం అది కాదు కదా. నలుగురు చదవాలి అనుకుంటే ఏదో విధంగా అచ్చు వేయించాలి. ఇంత చేసిన తరువాత స్నేహితుల ఒత్తిడి కూడా  మొదలవుతుంది. నువ్వు మొదలు పెట్టు, తలో చేయీ వేస్తాము అనే శ్రేయోభిలాషులు కూడా ముందుకు వస్తారు. ఇక్కడే అసలు యజ్ఞం మొదలవుతుంది.

మొన్ననే అనుకుంటా, పాత మిత్రుడు, చేయి తిరిగిన పాత్రికేయుడు అయిన సాయి శేఖర్ చెప్పిన విషయాలు విన్నాను.  ఆ తర్వాత ఈ ప్రచురణ ప్రక్రియ నేను అనుకున్న దానికంటే కూడా క్లిష్టతరము, కష్టతరము అనిపించింది. ఇటీవలే తన పాత్రికేయ అనుభవాలతో కూడిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని వెలువరించిన అనుభవం అతడికి వుంది. చెప్పే విషయాన్ని హాస్యస్పోరకంగా చెప్పడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఫేస్ బుక్ లో అతడి పోస్టింగులు ఫాలో అయ్యేవారికి ఇది అనుభవైకవేద్యం. అంచేత తన ముద్దుల మొదటి పుస్తక సంతానానికి “విట్టీ లీక్స్” అనే అద్భుతమైన పేరు పెట్టాడు. రాయడంలోనే కాదు, మాట్లాడడంలో కూడా అతడిలోని హాస్యపు గుళికలను మనం ఆస్వాదించవచ్చు. ఈ పుస్తకం ప్రచురించడంలో తాను పడిన ఇబ్బందులను అతడు ఎంత తేలిగ్గా తీసుకుని ఈ క్రతువును ఎలా నిర్విఘ్నంగా పూర్తి చేసాడో అనేది  నేరుగా అతడి నోటనే వినే అవకాశం నాకు కలిగింది.

2019 నుంచి తాను రాసిన తన రాతలను తానే గుదిగుచ్చి, ఒక మాలగా  అల్లుకున్నాడు. దండలో దారంలాగా వాటినన్నిటినీ కలిపేందుకు హాస్యం తొణికిసలాడే వాక్యాలను తయారు చేసుకున్నాడు.

రచయిత ఒక ప్రెస్ రిపోర్టర్ . ఇందులో ఏముంటుంది, అన్నీ పాత చింతకాయ పాత వార్తలు అనుకోకుండా, ఇంతవరకు ప్రచురించని అంశాలనే ఎంచుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే వుంది. అంతా స్వయం పాకం. ఇంట్లో కూర్చుని వండే వంటకాలే. వంట వేరు, వడ్డన వేరు అనేది వాస్తవం. వడ్డించే ప్రచురణకర్త దొరకాలి కదా! ఇన్నాళ్ళు తాను రాసిన వార్తలను, వార్తా కధనాలను తెల్లారేసరికల్లా ప్రచురించే వార్తాపత్రికల యాజమాన్యాలు తెలుసు కాని, పుస్తకాలు వేసే వాళ్ళు ఎవ్వరు, అందులోను ఇంగ్లీష్ లో రాసిన పుస్తకాన్ని వేసేదెవ్వరు ? వేసే వాళ్ళు చాలామంది వున్నారు. కానీ రాయక రాయక రాసిన తన ముద్దుల పుస్తకాన్ని తన ఆకాంక్షల మేరకు అందంగా అచ్చువత్తించి, ప్రచురించే మహాను భావులు ఎవ్వరు?

వేట మొదలైంది. ముందు గూగుల్ లో అన్వేషణ. పెయిడ్ సెల్ఫ్ పబ్లిషర్స్ అని సెర్చ్ చేయగానే చాలా ఆప్షన్స్ కనబడ్డాయి.  చండీఘర్ కు చెందిన వైట్ ఫాల్కన్ అనే రైట్ ఛాయిస్ దొరికింది. వాళ్ళతో మాటామంతి జరిగింది. ఇంగ్లీష్ జర్నలిస్ట్, అందులోను బిజినెస్ జర్నలిస్టు  కనుక వాళ్ళతో నిస్సంకోచంగా, ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడాడు. అయితే ఈ రంగంలో ఆ పబ్లిషర్స్ కు కూడా విశేషమైన అనుభవం వుంది. వాళ్ళూ ఆ తరహాలోనే సంప్రదింపులు జరిపారు. తమ షరతుల జాబితా వాళ్ళు, తన నిబంధనల జాబితా శేఖర్ బయట పెట్టారు. ఇలా సాగే వ్యవహారాల్లో నాన్చుడు వుండదు. మాకిది, మీకిది అనే ఆదినిష్టూరం మంచిది  తరహాలో వుంటాయి. అన్ని విషయాల్లో స్పష్టత వుంటుంది. ఇలా చెప్పారు, అలా చేశారు అనే శషభిషలకు తావుండదు.

రెండంటే రెండు కలర్ ఫోటోలు వేస్తాం. అయిదు పుస్తకాలు రచయితకు  ఉచితంగా ఇస్తాం. ఎడిటింగ్, పేజి మేక్ అప్, కవర్ డిజైన్, అమెజాన్, ఫ్లిక్ కార్ట్  లో సేల్స్ కి పెట్టడం, రచయిత పాల్గొనే పక్షంలో బుక్ ఎగ్జిబిషన్ లలో, లిటరరీ ఫెస్టివల్స్ లో పుస్తకాన్ని ప్రదర్శనకు పెట్టడం, వెబ్ సైట్ తయారు చేయడం, రెండేళ్ల వరకు సోషల్ మీడియా ప్రమోషన్లు ఇత్యాదయః మా పూచీ”  అన్నారు వాళ్ళు.  అంతే కాదు మరో మాట అన్నారు, మీ పుస్తకం ఏ ప్రెస్సులో వేయించేది మీకు ముందు చెప్పం అని. శేఖర్ కు నిరుత్సాహం కలిగించిన షరతుల్లో ఇదొకటి.

పుస్తకం ఎడిట్ చేయడానికి వాళ్లకి ఎడిటర్స్ ప్యానెల్ వుంటుంది. వాళ్ళు సూచించిన మార్పులు రచయిత ఒప్పుకోవాలి.

ఈ చివరి షరతు శేఖర్ కి నచ్చలేదు. ఘనాపాటీల లాంటి ఎడిటర్ల చేత నేనే ఎడిటింగ్ చేయించుకుంటానని వాళ్ళతో గట్టిగా చెప్పాడు. జర్నలిస్టు కదా. మరీ కాదనలేకపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ గా రిటైర్ అయిన పద్మజా షా తో ముందు మాట్లాడాడు. ఆవిడ గారు అంతకు ముందు ఒప్పుకున్న కార్యక్రమాలతో తలమునకలుగా వున్నారు. దాంతో ఇంటర్ నేషనల్ పబ్లికేషన్స్ లో విశేష అనుభవం వున్న సీనియర్ జర్నలిస్ట్ జి. కృష్ణన్ గారి తో మాట్లాడితే ఆయన సరే అన్నారు. హిందూ  బిజినెస్ లైన్ పత్రికలో సీనియర్ డిప్యూటి ఎడిటర్ గా పనిచేసిన స్రవంతి చల్లపల్లి పేరు మనవాడు చెప్పగానే, ఆవిడ బెస్ట్ చాయిస్ అని కృష్ణన్ చెప్పారు. స్రవంతి చల్లపల్లితో శేఖర్ కు మూడు దశాబ్దాల పరిచయం వుంది. అడగగానే ఒప్పుకోవడమే కాక మొత్తం పని పదిహేను రోజుల్లో పూర్తి చేసి ఇచ్చారు ఆమె.

అప్పటికి ఇల్లు అలకడం అయ్యింది. పండగ మిగిలే వుంది.

తాను పనిచేసిన డెక్కన్ క్రానికల్, హిందూ యాజమాన్యాల నుంచి క్లిప్పింగ్స్ వాడుకోవడానికి అనుమతులు తన పరపతితో సాధించాడు. డెక్కన్ క్రానికల్ లో రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన శేఖర్ మిత్రుడు శ్రీరాం కర్రి ఈ విషయంలో చేసిన మరువలేనిదని శేఖర్ చెప్పాడు. జర్నలిస్టుగా తనకున్న పరిచయాలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేష్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు సంజయ్ బారు, ప్రముఖ రచయిత హరి మోహన్ పరువు వంటి పెద్దలు పుస్తకం బ్యాక్ కవర్ కామెంట్స్ రాసి పంపారు.

పేజి మేకింగ్ పూర్తయిన తరువాత కూడా ఆరు సార్లు ఎన్నో దిద్దుబాట్లకు ఒప్పుకున్నారు పబ్లిషర్లు.

ప్రముఖ ప్రచురణాలయం ప్రగతి ప్రింటర్స్, కళా జ్యోతి  లో పెద్ద హోదాల్లో పనిచేసిన శ్రీ విజయకుమార్  ప్రింటింగ్ కి ఎంత జి. ఎస్.ఎం. కాగితం వాడాలి, డస్ట్ జాకెట్, హార్డ్ బౌండ్ కవర్, కలర్ పేజీల కి ఎలాంటి కాగితం వాడాలి అన్న విషయంలో సరైన సమయంలో తగిన సూచనలు పుస్తకం నాణ్యతను పెంచడంలో తోడ్పడ్డాయి.

అంశాలకు తగిన ఫోటోలు సేకరించడం కష్టం అయినా, ప్రముఖ ఫోటోగ్రాఫర్లు  రవీందర్ రెడ్డి, గంగాధర్ అనుమాండ్ల బాగా సహకరించారని శేఖర్ చెప్పాడు.

ఐటీసీ చైర్మన్ గా పనిచేసిన కీర్తిశేషులు యోగీ దేవేశ్వర్ ఫోటో కంపెనీ సీనియర్ అధికారి శివకుమార్ సూరంపూడి ఏర్పాటు చేశారు.

ఇక డెక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్ సుభాని సాయం నేను ఎప్పటికీ మరువలేను. అడగగానే ఎంతో పని వత్తిడిలో వుండి కూడా అద్భుతమైన ముఖచిత్రాన్ని టైటిల్ కు తగ్గట్టుగా గీసి ఇచ్చాడు.  అలాగే ఆర్బీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమాకాంత్ గారు కవర్ పేజి డిజైన్ చేశాడు. అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు శేఖర్.

ఇన్ని పనులు చేసిన తర్వాత శేఖర్ కు పబ్లిషర్స్  కు  షరతులు విధించే ధైర్యం వచ్చింది.

అయిదు కాదు, పాతిక పుస్తకాలు ఇవ్వాలన్నాడు. రెండు కాదు పదిహేను కలర్ ఫోటోలు వేయాలన్నాడు. ఒప్పుకోవడం మినహా వాళ్లకు గత్యంతరం లేకపోయింది.

పండంటి కన్న బిడ్డ లాంటి పుస్తకం తయారైంది. మరి విడుదలచేయించాలి అదీ ఎవరితో అనే మీమాంస మొదలైంది.

శ్రీరాముల వారి సహాయము కావలెను అనుకున్నాడు. మళ్ళీ   రాముడి సాయమే అక్కరకు వచ్చింది. శ్రీ రామ్ కర్రి గారు, తెలంగాణా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్ మెంట్ ఏర్పాటుకు సహకరించి ఆ గౌరవ లాంఛనం ఆయన చేత పూర్తి చేయించారు. ఆ విధంగా శేఖర్ మొదటి పుస్తకం మార్కెట్లోకి వచ్చింది.

మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ

తోకటపా: సాయి శేఖర్ వయసులో చిన్నవాడు, ఉత్సాహవంతుడు.  పట్టిన పట్టు విడవడు. అందుకే ఇన్ని నొప్పులు పంటి బిగువన భరించాడు. అనుకున్నది సాధించాడు.  అతడికీ నాకూ వయసులో దాదాపు రెండు దశాబ్దాల పైగా తేడా. పులిని చూసి వాతలు పెట్టుకోవడానికి నేను నక్కను కాదు.

REVIEW FOLLOWS

కింది ఫోటోలు: 


శేఖర్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి


రచయితతో నేను


శ్రీరాం కర్రి, నేను, శేఖర్


విట్టీ లీక్స్ బుక్  ముఖచిత్రం











 

 

 

   

 

 

 

 

           

 

     

 

 

 

 

 

2 కామెంట్‌లు: