ఖమ్మం
అప్పటికి నేను
చూసిన రైల్వే స్టేషన్లలో బెజవాడ చాలా పెద్దది. తరువాత ఖమ్మం. ఆ రోజుల్లో ఒకటే
ప్లాట్ ఫారం. దానికి రెండు చివర్లో ,
మధ్యలో రెండు చోట్లా సిమెంటుతో పోతపోసిన బోర్డులపై పసుపు రంగు మీద ఖమ్మా మెట్ అని
నల్లటి అక్షరాలతో స్టేషన్ పేరు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడు భాషల్లో రాసివుండేది. తరువాత చాలాకాలానికి
ఖమ్మం అని మార్చారు. ఊళ్ళో షాపులమీద కూడా ఖమ్మంమెట్టు అనే పేరే వుండేది.
కాలక్రమంలో ఖమ్మం అయింది. ప్లాట్ ఫారం ఒకవైపు నుంచి రైలుకట్ట మీద నడుచుకుంటూ పొతే, రైల్వే గేటు, దాన్ని దాటి
ముందుకు పొతే, కట్ట కింద కాలిబాట, మామిడి తోపు, దాన్ని దాటుకుని లోపలకు వెడితే మా ఇద్దరు బావగార్ల ఇళ్ళ నడుమ మట్టి
రోడ్డు. దాన్ని మామిళ్ళ గూడెం అనే వాళ్ళు. బహుశా మామిడి తోపు కారణంగా ఆ పేరు
వచ్చిందేమో.
అదే స్టేషన్
లోకి వెళ్లి బయటకు వస్తే రోడ్డు మార్గం. రిక్షాల మీద ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఆ
దోవగుండా కంకర రాళ్లు తేలిన మార్గంలో మామిళ్ళ గూడెం వచ్చేవాళ్ళు. వల్లభి గ్రామ కాపురస్తులు
అయిన మా పెద్ద బావగారు రామారావు గారు, పిల్లల
చదువులకోసం ఖమ్మంలో స్థలం కొని ఇల్లు కట్టారు. గృహ ప్రవేశం చూడడం నాకు అదే మొదటిసారి.
పెంకుటిల్లు, గిలాబు చేయని డాబాలు తప్ప వేరే ఇంటి నిర్మాణాలు ఎరుగని చిన్నతనం.
పెద్ద బావగారు కొన్న స్థలంలో ముందూ వెనుకా
జాగా వదిలి మేడ కట్టుకున్నారు. ముందు ఒక గది, దాన్ని ఆనుకుని వరండా, పక్కన మరో గది, లోపల విశాలమైన
హాలు, రెండు పక్కలా రెండు గదులు, వంటహాలు, వెనుక మరో వంట
ఇల్లు, ఆనుకుని బావి, పెరడు, లెట్రిన్ వగైరా, ఇంటి ముందు నుంచి పైకి మెట్లు, చుట్టూ ప్రహరీ.
హంగామాగానే వుండేది. తలుపులకు రంగులు, కిటికీలకు అదో రకమైన రంగుల అద్దాలు.
గమ్మత్తుగా వుండేది. ఇంటి ముందు జేగురు రంగులో వున్న సిమెంటు బెంచి. అప్పటికి కరెంటు
సౌకర్యం వచ్చింది. పై కప్పు నుంచి వేలాడదీసిన కరెంటు వైరుకు డోములో అమర్చిన బల్బ్.
ఇంటి మొత్తం మీద ఒక సీలింగు ఫ్యాను. అవసరమైన చోట పెట్టుకోవడానికి ఒక టేబుల్
ఫ్యాన్. మెయిన్ గేటుకు రెండు పెద్ద
తలుపులు. . దీన్ని పాటక్ అనేవారని గుర్తు. ప్రతిసారీ వాటిని తెరిచే తీసే అవసరం
లేకుండా మనుషులు లోపలకు రావడానికి, వెళ్ళడానికి ఒక చిన్న తలుపుతో ఏర్పాటు. ప్రతి
ఇంటికి ఈ ఏర్పాటు వుండేది.
ఆ ఇంటికి
అనుకునే మా రెండో బావగారు కొలిపాక రామచంద్రరావుగారి ఇల్లు. వాళ్ళదీ ఇలాంటి మేడే.
కాకపోతే ఇంటి ముందు జాగా తక్కువ. వెనుక వైపు పెరడు చాలా పెద్దది. ఆ ఇంటి పక్కనే ఆయన తమ్ముడు ఆనందరావు
బావ ఇల్లు. కొద్ది కాలం తరువాత , బ్రాహ్మణ బజారులో అద్దె ఇంట్లో ఉంటున్న మా నాలుగో బావగారు, లాయరు కౌటూరి కృష్ణమూర్తిగారు, రామారావు బావ
ఇంటి పక్కనే పెద్ద జాగా కొనుక్కుని విశాలమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పక్కన
కొండపల్లి వాళ్ళ ఇల్లు. సినిమా దర్శకుడు దశరథ్ నాన్న కొండపల్లి రఘురాం రిక్కా
బజార్ స్కూల్లో నా క్లాస్ మేట్. రాముడి కొడుకు దశరధుడు అని సరదాగా అంటుండేవారు.
మా బావగార్ల ఇళ్లకు
వెళ్ళే దారిలో అప్పటికి సరైన రోడ్డు లేదు. మధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు.
రోడ్డుపక్కన దీప స్తంభాలు. ప్రతి రోజూ సాయంత్రం వేళల్లో మునిసిపల్ సిబ్బంది వచ్చి
కిరోసిన్ దీపాలు వెలిగించేవాళ్లు. కొంతకాలానికి కరెంటు దీపాలు, రాతి గుట్టలని
తొలగించి రోడ్డు వేశారు. కరెంటు రావడంతో వీధి దీపాలు వచ్చాయి. ఒక ఫేజు సరఫరా కారణంగా గుడ్డిగా
వెలిగేవి. ఇళ్ళల్లో బల్బుల పరిస్థితి కూడా అంతే. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు
పోతుందో చెప్పలేని పరిస్థితి.
మా బావగార్ల
ఇళ్ళు దాటగానే ఒక మోరీ, ఒకటి రెండు ఇళ్ళు ఉండేవి. తర్వాత ఊరే లేదు. కాలిబాటల్లో నడుచుకుంటూ
వెడితే బురాన్ పురం విసిరేసినట్టు
వుండేది. మధ్యల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు కనిపించేవి. రావులపాటి సత్యనారాయణ
రావు గారు (మాజీ ఐజీ, రచయిత రావులపాటి సీతారామారావు గారి తండ్రి) రావులపాటి జానకి
రామారావుగారు (పీయూసీలో నా క్లాస్ మేట్ డాక్టర్ రావులపాటి గోపాలకృష్ణ తండ్రి)
అక్కడ వుండేవారు. వారివి కూడా చాలా విశాలమైన గృహాలే.
మా అన్నయ్య
పర్వతాల రావు గారు ఒక బజారు ఇవతల మామిళ్ళగూడెంలోనే కేశవరావు గారి ఇంటిలో ఒక
పోర్షన్ లో అద్దెకు వుండేవాడు. పక్కన మరో పోర్షన్ లో నా క్లాస్ మేట్ జమలాపురం రామచంద్రరావు
తండ్రి వెంకటేశ్వర రావు గారు కాపురం వుండేవారు. ఆయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ . చాలా
హుందాగా, చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపించేలా వుండేవారు. ఇక
రామచంద్రం చేతి వ్రాత ముత్య్ల్లాల కోవ. మళ్ళీ అంత చక్కటి చేతిరాతను నేను చూడాలేదు.
మా అన్నయ్యది
మూడుగదులు వరుసగా వుండే వాటా. మూడు గదులు పేరే కాని మొదటి గది ఇనుప తీగెల జాలీ
ఉన్న గది. మధ్యది పడక గది. చివరిది వంటిల్లు. ముందు పక్కనా పెద్ద ఖాళీ జాగా. డీపీఆర్వో
గా మా అన్నయ్యకు ప్రభుత్వ వాహనం, ఒక పెద్ద వ్యాను వుండేది. దాన్ని ఆ జాగాలో పార్క్
చేసేవారు. ఆ వ్యానులో ప్రొజెక్టరు, డాక్యుమెంటరీ రీలు డబ్బాలు, తెర ఉండేవి. నెలకోసారి ఒక్కో వూరికి
వెళ్లి సినిమాలు, ప్రభుత్వ
అభివృద్ధి కార్యక్రమాలు తెలిపే డాక్యుమెంటరీలు వేసేవాళ్ళు. మా అన్నయ్య వెంట
రుద్రవరం వెంకటేశ్వర్లు గారని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హమేషా వుండేవారు. ఆ
రోజుల్లో ప్రజల్లో పొదుపు అలవాటుని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో నేషనల్
సేవింగ్స్ ఆర్గనైజర్ అని ఒక అధికారి వుండేవారు. రుద్రవరం గారిది ఆ ఉద్యోగం.
స్వయంగా కవి, రచయిత అయిన వెంకటేశ్వర్లు గారు మా అన్నయ్యకు చక్కని స్నేహం
కుదిరింది. వారిద్దరూ కలిసి అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు చక్కని ప్రచార పత్రాలను
తయారు చేసేవారు. వీరికి సింగ్ మాస్టారు అనే ఆర్టిస్ట్ జత కలిసారు. సింగ్ శారు మా
ఇంటికి అయిదు ఇళ్ళ అవతల వుండేవారు. అన్నయ్య సూచనల మేరకు వెంకటేశ్వర్లు గారు రాయడం, సింగ్ సారు
బొమ్మలు గీయడం. అంతా మాకు తమాషాగా, సరదాగా వుండేది. బెజవాడలో మా బావగారు మా చదువు పట్ల శ్రద్ధతో మాటూ కఠినంగా
వుండేవారు. మా అన్నయ్యది ఉదారతత్వం. ఒకరు చెప్పకుండా ఆయన జీవితంలో పైకి వచ్చారు.
అలానే నేను కూడా మా అంతట మేమే మా బాగోగులు చూసుకోవాలని భావించేవారు. జీవితంలో
చదువుతో పాటు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయనేది మా అన్నయ్య అభిప్రాయం. ఈ వ్యవహార
శైలిని నేను వేరే విధంగా అర్ధం చేసుకున్నాను. స్వేచ్ఛకు నా సొంత నిర్వచనం
చెప్పుకుని గాడి తప్పాను. నేను ఖమ్మం రాగానే మా అన్నయ్య నా చేతికి పది రూపాయలు
ఇచ్చి, స్టేషన్ బజారుకు వెళ్లి చెప్పులు కొనుక్కోమని చెప్పాడు. అంతవరకూ కాళ్ళకు
చెప్పులు ఉండేవి కాదు. సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లి ఒక జత హవాయి చెప్పులు కొన్నాను.
వాటి మీద నాకెంత మోజంటే, బెజవాడ అలంకార్ టాకీసు సెంటర్లో రెండు చెప్పుల షాపులు, బాటా, కరోనా వుండేవి.
అద్దాల బీరువాలో అనేక హవాయి చెప్పులు కనబడుతుండేవి. మేము పిల్లలం అటు
వెళ్ళినప్పుడల్లా ఆ షాపుల ముందు నిలుచుని అద్దాల అలమరాల్లోని చెప్పులని అదేపనిగా
చూస్తుండే వాళ్ళం. ఆ రోజుల్లో కొత్తగా బాటా కంపెనీ వాళ్ళు బాటా శాండక్ (?) అనే పేరుతొ హవాయి మోడల్ చెప్పులు మార్కెట్లో ప్రవేశపెట్టారు.
ఈ రోజుల్లో కొత్త మోడల్ ఐ ఫోన్ కి వున్న గిరాకీ అప్పుడు ఆ బాటా చెప్పులకి వుండేది. విరగబడి
కొనుక్కునేవారు.
మొదటిసారి జీవితంలో
నా చెప్పుల సరదా మా అన్నయ్య పుణ్యమా అని ఆ రోజు తీరింది. చెప్పులకు రెక్కలు వచ్చినట్టు గాలిలో
తేలుతూ ఇంటికి చేరాను.
కింది ఫోటో :
ఖమ్మం రైల్వే
స్టేషన్ (Courtesy Google)
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి