3, డిసెంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (25) - భండారు శ్రీనివాసరావు

 


మా బావగారింట్లో చిన్న క్లాసులు, పెద్ద క్లాసులు చదువుకునే నలుగురు స్కూలు  పిల్లలం వుండేవాళ్ళం. మా బావగారి అన్నగారి పిల్లలు ఇద్దరు, రమణారావు, వెంకటేశ్వర రావు, నేను, శాయిబాబు. నేను అక్కడ వుండి చదువుకుంటున్న కాలంలోనే, మా అక్కయ్యకు ఇద్దరు మగపిల్లలు, (రాఘవరావు, భైర్రాజు), నలుగురు ఆడపిల్లలు (సత్యవతి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి) పుట్టారు. నా చిన్నతనంలోనే, వారి చిన్నతనాన్ని, వారి పెంపకాన్ని కళ్ళారా చూశాను. పసివాళ్ళుగా వున్నప్పుడు వాళ్ళని కాళ్ళమీద పడుకోబెట్టుకుని డబ్బా పాలు పట్టేది మా అక్కయ్య. బాగా పనిలో వున్నప్పుడు ఆ బాధ్యత పెద్దపిల్లల్లో ఎవరో ఒకరి మీద పడేది. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు చంకనెత్తుకుని, పక్కనే పాండురంగ మహత్యం ఆడుతున్న లక్ష్మీటాకీసు దగ్గరికి తీసుకు వెళ్ళేవాళ్ళం.  ఆ రోజుల్లో ఏసీ హాళ్ళు కాదు కనుక, మాటలు పాటలు స్పష్టంగా పెద్దగా బయటికి వినపడేవి. హే కృష్ణా ముకుందా మురారీ పాట అయిపోయేసరికి పసిపిల్ల భుజం మీదే నిద్రపోయేది.

నాకూ, శాయిబాబుకు ఒక స్పెషల్ డ్యూటీ. బావగారికి నశ్యం అలవాటు వారి తండ్రి భైర్రాజు గారి నుంచి వారసత్వంగా వచ్చింది. అది కూడా  స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే వారు. బజారులో శ్రేష్టమైన పొగాకు కాడలు కొనుక్కుని వచ్చి మాకు ఇచ్చేవాడు.  కుంపట్లో బొగ్గులు వెలిగించి,  వాటిపై ఆ కాడలు ఒక రంగులోకి మారేవరకు కాల్చేవాళ్ళం. తరువాత కొంత సున్నం, ఒకటి రెండు నేతి చుక్కలు కలిపేవాళ్ళం. ఆ మిశ్రమాన్ని కల్వం లాంటి దానిలో వేసి, నూరి  పొడి పొడిగా చేసేవాళ్ళం.  మా బావగారు వచ్చి, మధ్య వేలు, బొటనవేలుతో ఆ నశ్యం పట్టుకుని ఒక పట్టు పట్టి పీల్చి, సరే అన్న తర్వాత కానీ మా పని పూర్తయ్యేది కాదు.  అది ఫైనల్  క్వాలిటీ టెస్టింగ్ అన్నమాట. తరువాత ఆ నశ్యాన్ని డబ్బాల్లో కూరేవాళ్ళం.  బావగారు పెద్ద వకీలు కాబట్టి,  వాటిని ఏమంటారో తెలియదు కానీ, వెలక్కాయల వంటి కాయల్లో లోపల గుజ్జు తీసి, వెండిపొన్నుతో  బిరడాలు చేయించి ఇచ్చేవారు.  నాకు గుర్తున్నంత వరకు ఇది నశ్యం తయారీ విధానం. గుర్తు చేయడానికి నా దురదృష్టం శాయిబాబు ఇప్పుడు లేడు. గుర్తు చేసుకునే జ్ఞాపక శక్తి నాకు లేదు. ముందే చెప్పా కదా నేనో బిగ్ జీరో అని. వున్నది మూడు గదులే. బావగారి ఆఫీసు గది కొంచెం పెద్ది. కానీ దాని నిండా లా పుస్తకాలు వున్న అద్దాల తలుపుల అల్మరాలే. వాటి మధ్య ఒక పెద్ద మేజాబల్ల. రెమింగ్టన్ టైపు రైటర్.  రివాల్వింగ్ చైర్. రివాల్వింగ్ అల్మరా. బయట వరండాలో మరో రెండు బీరువాలు. పక్కనే ప్లీడరు గుమాస్తా గారు ముందు చిన్న వ్రాత బల్ల పెట్టుకుని ఏరోజుకారోజు కోర్టు దావా తేదీలను గురించి అడిగిన క్లయింట్లకు చెబుతుండేవారు.  ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పినాయిల్ తో ఇల్లు శుభ్రం చేసేవారు. దుమ్ము కనపడితే ఆయనకు కోపం నషాళానికి అంటేది. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇంటికి నాలుగు వైపులా అన్నిద్వారాలకు వట్టివేళ్ళ తడికెలు కట్టేవాళ్ళం. వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ వుండడం పిల్లల పని.   

బావగారి ఇంటి పక్కన మరి కొన్ని వాటాలు ఉండేవి. మొత్తం ఆ ఇళ్ళ సముదాయాన్ని ఆవనం అనేవారు. ఆ పేరు ఎలా వచ్చిందో నాకిప్పటికీ తెలియదు. ఆ మొత్తం సామ్రాజ్యానికి  సోవమ్మ గారనే అమ్ముమ్మ గారు మకుటం లేని మహారాణి. కాపురానికి వచ్చి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆస్తినీ, పిల్లల్నీ  కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అంచేత ఆవిడకి డబ్బు విలువ తెలుసు.   మగసంతు లేదు.  ఆడపిల్లలకు పుట్టిన  మగపిల్లలనే తన దగ్గర పెట్టుకుని పెంచింది. మనసు మంచిది, ఆపేక్షలు తెలిసిన మనిషి. కానీ నోటి దాష్టీకం జాస్తి.

ఆవనంలో వున్న అన్ని వాటాలకి కలిపి సోవమ్మ గారి ఇంటి ముందు ఒక మునిసిపల్ పంపు (నల్లా) వుండేది. ఆమె మడి స్నానం చేసి, మడిబట్టలు కట్టుకునే దాకా ఎవరూ అటు పోవడానికి వీల్లేదు. పిల్లలు ఎవరన్నా పంపు తిప్పి మరచిపోతే ఇంటి పైకప్పులు ఎగిరిపోయేట్టు తిట్లు, శాపనార్ధాలు లంఖించుకునేది.  దాంతో మా బావగారు సొంత ఖర్చుతో, తన వాటాలో ఇంటి వెనుక  ఒక బోరింగ్  పంపు వేయించారు.

సోవమ్మగారు,  వాళ్ళు కాపురం వుండగా మిగిలిన వాటాలను అద్దెకు ఇచ్చింది. ఎవరూ ఖాళీ చేసేవాళ్ళు కాదు, అద్దె పెంచడానికి ఒప్పుకునే వాళ్ళూ కాదు. దాంతో ప్రతినెలా మొదటి వారంలో హోరాహోరీ మాటల యుద్ధాలు జరిగేవి.  నిజానికి న్యాయం ఆవిడ వైపే వున్నా, ఆమె చేసే ఆ యాగీ చూసిన వాళ్ళు, తప్పు ఆమెదే అనుకునే వాళ్ళు.

ఒక వాటాలో కృష్ణమూర్తి గారు అనే  నాటకాల నటుడు  కుటుంబంతో వుండేవారు. భార్య మీనాంబ గారు. చాలా మంచి మనిషి. ఇంట్లో  మంచి కలపతో చేసిన తూగుటుయ్యాల వుండేది. మేము ఊగుతున్నా అభ్యంతర పెట్టేది కాదు. వారికి  ఇద్దరు మగపిల్లలు, ధర్మరాజు, అంభి, ఇద్దరు ఆడపిల్లలు  తంగం,  ఆడి. తమిళ నాడు నుంచి వచ్చి బెజవాడలో సెటిల్ అయ్యారు. భాషలో కొంత అరవ యాస వున్నా తెలుగు బాగానే  మాట్లాడే వాళ్ళు. కృష్ణమూర్తి గారు నాటకాల్లో కృష్ణుడి వేషాలు వేసేవారు. కృష్ణపాత్రలో తాను నటించిన సన్నివేశాల్లోని భంగిమలతో దిగిన పెద్ద పెద్ద ఫోటోలు  గోడలకు ఉండేవి.  నెమలి పింఛం కలిగిన   కిరీటం, దాని వెనుక గుండ్రటి వెలుగు రేఖలు విరజిమ్మే  ఫోటోలు ఎలా తీశారబ్బా  అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం.  పైగా ఒకే ఫ్రేములో  నాలుగయిదు క్లోజప్ లు. ఫొటోలు  తెలియదు, ట్రిక్ ఫోటోగ్రఫీ సంగతి అసలే  తెలియని వయసు. పొద్దున్నే లేచి స్నానపానాదులు ముగించుకుని, తుంగ చాపమీద కూర్చుని,  హార్మనీ పెట్టె ముందేసుకుని, కృష్ణ రాయబారం పద్యాలను పెద్ద శృతిలో సాధన చేస్తుండేవాడు. ఆ రోజల్లా లోపల, వాళ్ళ సాధన. బయట సోవమ్మ గారి సాధింపు. అంత సంసారాన్నినాటకాల మీద వచ్చే రాబడితో ఎలా లాక్కువచ్చేవాడన్నది  ఇప్పటికి మిస్టరీనే. వారి సంతానంలో ఒకడైన అంభి ఇప్పుడు దుబాయ్ లో ఇల్లు కొనుక్కుని చక్కగా సెటిల్ అయ్యాడు. అలాగే మిగిలిన పిల్లలు కూడా.   

   

అమ్మమ్మ గారి మనుమలు రామచంద్రం, సోము, శాయి, సత్యం అందరూ మా కంటే చిన్నే అయినా, వాళ్ళతోనే మా స్నేహం. అందరూ ఈనాడు పెద్దవాళ్లు అయి జీవితంలో మంచిగా కుదురుకున్నారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు, పేరంటాల్లో కలుస్తూ వుంటారు. అలా పెరిగిన వాళ్ళు ఎలా బాగుపడతారు? ఎలా  బాగుపడ్డారు అనే అలనాటి, ఈనాటి  నా సందేహానికి  నేనే ఉదాహరణ.

మా బావగారి ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు. తుర్లపాటి హనుమంతరావు, ఎమ్మే ఎల్ ఎల్ బీ అడ్వొకేట్,  అని ఇంగ్లీష్ లో, తెలుగులో ఎనామిల్ పెయింటుతో  నీలం బ్యాక్ గ్రౌండ్ పై తెల్లటి అక్షరాలతో  రాయించిన బోర్డు ఉన్నప్పటికీ,  బస్సు దిగి వచ్చేవాళ్ళు మాత్రం,   గవర్నర్ పేటలో  మామిడి చెట్టు ఇల్లు అని రిక్షావాడితో చెప్పేవాళ్ళు.  ఇంటి అడ్రసుకు అదో  కొండ గుర్తు. వేసవి కాలం వచ్చేముందు పూత పూసేది. ఇక అప్పటి నుంచి అమ్మమ్మ గారికి కంటి మీద కునుకు వుండేది కాదు. అది కాయలు కాస్తే ఎవరో వచ్చి తెంపుకు పోతారని తెగ వెంపర్లాడేది. బాగా కాయలు కాసే పెద్ద కొమ్మ ఒకటి మా బావగారి డాబా మీద చేతికి అందే ఎత్తులో వుండేది. ఇక ఆ కొమ్మకు వున్నపిందెల లెక్క చూసుకునేది. ఒకటి తక్కువైతే అందర్నీ లెక్క అడిగేది. మాకేం తెలుసు కింద ఎక్కడో రాలిపడి ఉంటుందని బూకరించేవాళ్ళం. ఇలా వాదులాట జరిగే సమయంలో మా అక్కయ్య కల్పించుకుని అమ్మమ్మగారు, నిన్న ఏదో అడిగినట్టున్నారు ఇస్తా రండి అంటూ వంటింట్లోకి తీసుకుపోయేది.  

బజారుగోడకి  మామిడి చెట్టుకి నడుమ చిన్న రేకుల షెడ్డు. ఆవనంలోని ఆడవాళ్ళు అప్పుడప్పుడూ అందులోకి వెళ్లి రెండు మూడు రోజులు బయటకి వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా ఎవరూ చూడకుండా వచ్చేవాళ్ళు.  దాన్ని ముట్లగది అనేవాళ్ళు. ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియని  వయసు మాది.

కింది ఫోటోలు :  కర్టెసీ: తుర్లపాటి భైర్రాజు, అడ్వొకేట్ , విజయవాడ 


75 ఏళ్ల క్రితం మా బావగారు చేయించుకున్న నేమ్ బోర్డు


ఆయన వాడిన మేజాబల్ల


 లా పుస్తకాల రివాల్వింగ్ అలమరా





(ఇంకా వుంది)




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి