మా బావగారు హనుమంతరావు గారు కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. అంచేత ఆయనకు చదువు విలువ డబ్బు విలువ రెండూ తెలుసు. తన అవసరాలు తగ్గించుకుని అవసరంలో ఉన్న చదువుకుంటున్న విద్యార్ధులకు చేతనైనంత సాయం చేసేవారు. ఆ రోజుల్లో వారాలు చేసుకుని చదువుకునే పిల్లలు పిల్లలు వుండేవాళ్ళు. ఈ తరం వారికి అసలు ఇదేమిటో తెలియకపోవచ్చు. వారంలో ఏడు రోజులూ ఒక్కొక్క రోజు వారం ఒప్పుకున్న వారింటికి పోయి, వాళ్ళు పెట్టింది తిని వెళ్లి చదువుకునేవారిని వారాలబ్బాయి అనేవారు. మా బావగారింటికి కూడా ఇలా వారాల పిల్లలు వస్తుండే వాళ్ళు. సోమవారం వచ్చిన పిల్లాడు మళ్ళీ అదే వారం నాడు వచ్చేవాడు కాబట్టి, పేర్లు, మొహాలు తెలిసినా కూడా పెద్ద పరిచయం పెంచుకోవడానికి వీలుండదు. ఇంట్లోనే ఆరుగురు పిల్లలం వుండేవాళ్ళు. కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి మాకు మేము చాలు. కాకపోతే మా బావగారు కోర్టుకు వెళ్లి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవరకు మాత్రమే వెసులుబాటు. ఆయన ఇంట్లో వుంటే ఎమర్జెన్సీ. అందరం గప్ చుప్!
ఇంట్లో పనులను,
పనులు అంటే అంట్లు తోమడం కాదు, వయసుని బట్టి చేసేవాళ్ళం.
పొట్టు పొయ్యి మధ్యలో రోకలి పెట్టి పొట్టు గట్టిగా కూరడం, కాగులో నీళ్ళు
పోసి కాగ బెట్టడం, మంచి నీళ్ళ కూజాలో నీళ్ళు పట్టడం,
ఫినాయిల్ తో గదులు తుడవడం, బజారుకు పోయి సరుకులు తీసుకురావడం ఇలాటి పనులన్న మాట. ఇక్కడ స్వపర
బేధం లేదు. సొంత పిల్లలకు కూడా ఈ చాకిరీ తప్పదు. ముందే చెప్పినట్టు ఏ వయసుకు తగిన
పని ఆ వయసువాళ్ళం చేసేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పనులు చేయడం మా అందరికి
సరదాగా వుండేది. బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మరింత మనసు పెట్టి చేసేవాళ్ళం.
మా అక్కయ్య కూడా కనిపెట్టి చూస్తూ కష్టం తెలియకుండా ఏవో అప్పచ్చులు చేసి పెట్టేది.
ఇంటి ఖర్చుకు ఇచ్చిన డబ్బుల్లో కొంత పొదుపు చేసి, బావగారు కోర్టు నుంచి వచ్చేలోగా
తలా పావలా ఇచ్చి మ్యాట్నీ సినిమాకు పొమ్మనేది.
ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన రేడియోలో ఇంగ్లీష్ వార్తలు విని
రేడియో కట్టేసి ఇంటి ఖర్చులన్నీ తీరిగ్గా ఒక డైరీలో రాసేవాడు. ఇలా ఏళ్ళ తరబడి
రాసిన డైరీలు ఆయన బల్ల సొరుగులో దాచి పెట్టేవాడు. కాస్త ఎరుక తెలిసిన తర్వాత
నాకిదంతా దండగమారి వ్యవహారంలా అనిపించేది. రూపాయి ఆపైన అయితే పర్వాలేదు, అణా, అర్ధణా
ఖర్చు కూడా రాసేవాడు. ప్రతి కాణీ లెక్క చెప్పడానికి మా అక్కయ్య చాలా ఇబ్బంది
పడేది. అడిగిన వచ్చాయి డబ్బు ఎంతయినా లేదు
అనకుండా ఇచ్చేవాడు. అయితే లెక్క తప్పకుండా చెప్పాలి. అదొక్కటే రూలు. మేము పెద్దయి
ఉద్యోగాల్లో కుదురుకున్న తర్వాత కూడా చిన్నచిన్న అవసరాలకు పాతికా, యాభయ్ రూపాయలు
కావాల్సి వస్తే, ఆయన బ్యాంకు తెరిచే టైముకు అంటే రాత్రి తొమ్మిదిన్నరకు వెళ్లి
జమాఖర్చులు రాసుకుంటున్న మా బావగారి బల్ల పక్కన ఏమీ మాట్లాడకుండా కాసేపు నిలబడే
వాళ్ళం. ఆయన తలెత్తి చూసి ఏం మిస్టర్ ఈ టైములో వచ్చావు, డబ్బు కావాలా
అనేవారు. ఒకవేళ ఆయన మమ్మల్ని గమనించక పొతే, మా అక్కయ్యే
కల్పించుకుని, వాడు వచ్చి చాలాసేపు అయింది, ఏం కావాలో కాస్త కనుక్కోండి అనేది.
ఏమైతేనేం చేబదులు అవసరం అయితే ఇలా చేస్తే చాలు అని మాకు బోధ పడింది. కానీ నా తరహా
వేరు కదా! జీరో తెలివితేటల బుర్ర కదా! పాతికా యాభయ్ కోసం ఇంత టైం వేస్టు ఎందుకని, నేను
ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం వెలగబెడుతున్న రోజుల్లోనే సిటీ బస్సులో వన్ టౌన్ కు వెళ్లి
మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి అవసరం యాభయ్ అయితే
వంద రూపాయలు వడ్డీకి తెచ్చేవాడిని. అవసరం అయినప్పుడు బస్సులో వెళ్లి అప్పు
తెచ్చిన వాడిని, అవసరం తీరాక, జీతం వచ్చినప్పుడు
అప్పు తీర్చి నగ వెనక్కి తీసుకురావడానికి బద్దకించేవాడిని. ఆ విధంగా
మా ఆవిడకు పుట్టింటి వారు పెట్టిన
ఉంగరాలు, ముక్కు పుడకలు కృష్ణార్పణం
చేశాను. తను ఈ విషయంలో నన్ను ఒక్క మాట అనేది కాదు. ఇంటి కోసమే కదా అని
సరిపుచ్చుకునేది. అదే బాకీలు మా బావగారి దగ్గర చేస్తే ఇలా జరిగేది కాదు. నా ముట్టె
పొగరుకు మా ఆవిడ మూల్యం చెల్లించింది. నేనూ మనిషినే కదా! రష్యా నుంచి మధ్యలో ఓసారి
సెలవు మీద హైదరాబాదు వచ్చినప్పుడు మా
ఆవిడకు రెండు జతల బంగారు గాజులు కొనిపెట్టాను. ఆ సంగతి తెలిసి మా హనుమంతరావు బావ
హాస్యంగా అన్నాడు, ఈ వైభోగం ఎన్నాళ్ళులే అని. ఆయన అన్నట్టే, మాస్కోకి తిరుగు ప్రయాణం
రోజునే మా ఆవిడను హాస్పిటల్ లో చేర్చాల్సి వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు.
చుట్ట పక్కాలు అందరూ తలా ఓ చేయి వేశారు. కానీ కొత్తగా కొన్న చేతి గాజులకి కాళ్ళు వచ్చాయి. మరి ఇలాంటి నిర్వాకాలు చేసే
వాడిని బిగ్ జీరో అనక ఏమంటారు. ఒకరు అనే లోగా నన్ను నేనే అనుకుంటున్నాను.
బెజవాడ
ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్న నాకు హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగం
వచ్చింది. మంచీ చెడ్డా మాట్లాడుకున్న తర్వాత విజయవాడ వదిలి హైదరాబాదు వెళ్ళాలనే నిర్ణయం ఖరారు
అయింది, నండూరి రామమోహన రావు గారికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా. ‘మా పత్రిక ఓ
ట్రైనింగ్ సెంటర్ అయింది మీ వంటి వాళ్లకి, కొన్నాళ్ళు పనిచేయడం, పని నేర్చుకుని
వెళ్ళిపోవడం’ అన్నారాయన నిష్టూరంగా నేను రేడియో ఉద్యోగం గురించి చెప్పగానే.
ఆంధ్రజ్యోతిలో
దాదాపు అయిదేళ్లు ఉద్యోగం వెలిగించి హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగంలో
చేరడానికి తట్టా బుట్టా సదురుకున్నాము. మామూలుగా అయితే మాది రెండు రిక్షాల్లో
పెట్టుకుని కొత్త ఇంటికి వెళ్ళగల తక్కువ సామానే. కానీ ఏదో ప్రభుత్వ బ్యాంకు వాళ్ళు
జర్నలిస్టులకు తలా ఒక వేయి రూపాయలు అప్పిస్తాం రమ్మన్నారు. పోలోమని పరిగెత్తాం.
ఇలా పరిగెత్తిన వాళ్ళలో తదనంతర కాలంలో ప్రముఖ పత్రికలకు ఎడిటర్లు అయిన వాళ్ళు కూడా
వున్నారు. వాళ్ళు ఆ అప్పుతో సైకిళ్ళు కొనుక్కున్నారు. ఇంటి పక్కనే ఆఫీసు. సైకిల్
అనవసరం ఓ ఇనుప బీరువా కొనుక్కుందాం అంది మా ఆవిడ. అడక్క అడక్క అడిగింది అని గాంధీ నగరం వెళ్లి ఓ దుకాణంలో స్టీలు బీరువా
బేరం చేసి, ఇంటికి వాళ్ళే షరతుపై ఆరువందల్లో ఒక బీరువా కొని, మమతా హోటల్లో భోంచేసి, ఊర్వశి
దియేటర్లో సినిమా చూసి ఇంటికి చేరాము. ఇప్పుడు హైదరాబాదు చేరడానికి అదే భారం
అయింది. దానికోసం లారీలో పంపాల్సిన పరిస్థితి. టీవీ భాషలో చెప్పాలి అంటే ఓ వెయ్యి
రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్తి. పరిస్థితి ఇదీ అని చెబితే ఆ మొత్తం ఆయనే సదిరే వారు. కానీ నా మానసిక
పరిస్థితి వేరు కదా!
అందుకే నా
తరహాలో ఆలోచించి మర్నాడు ఫస్ట్ బస్సు ఎక్కాను, పెనుగంచి ప్రోలు వెళ్లడానికి. అక్కడ
ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పాతికేళ్ళ క్రితం పదవీ విరమణ చేసి నెలకు చిన్న
మొత్తంలో పించను పుచ్చుకుంటున్న మా బంధువును ఒకరిని కలవడానికి.
‘రేడియోవాళ్ళు
నీకెంత జీతం ఇస్తారు?’
వెళ్లి కలవగానే
ఆయన నన్ను అడిగిన ప్రశ్న.
మా కుటుంబంలో చిన్నా
పెద్దా అందరికీ ఆయన మామయ్యే. చంద్రం మామయ్య. ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పాతికేళ్ళ
క్రితం రిటైరయి నెలకు ఎనభయ్ రూపాయలు పించను పుచ్చుకుంటున్నాడు. కొంత భూమీ
పుట్రా వుంది. దాని మీద అయివేజు,
పించను డబ్బులు కలిపి పొదంగా, ఏ చీకూ చింతా
లేకుండా జీవితం గడుపుతున్న పెద్దమనిషి ఆయన. నిక్కచ్చిగా వ్యవహారం చేసే తత్వం
కాబట్టి నికరంగా ఎంతో కొంత రొక్కం చేతిలో వుండేవుంటుంది. అందుకే ఆయన గుర్తు
వచ్చాడు.
“బేసిక్ 325, ఇతర అలవెన్సులు అదనం” అని మాత్రం వుంది నాకొచ్చిన నియామక పత్రంలో.
1975లో ఆంధ్రజ్యోతిలో నా నెల జీతం అక్షరాలా
నూట డెబ్బయి అయిదు. అప్పటికి అయిదేళ్ళు అయింది అక్కడ చేరి.
“ఖచ్చితంగా
తెలియదు కానీ, 325 మాత్రం నికరం.” నా జవాబు.
అప్పుడాయన నాకు
జీవితానికి సరిపడే భగవద్గీత చెప్పాడు. అది ఆచరిస్తే జీవితపు చరమాంకంలో అందరూ
ఆయనలాగే నిశ్చింతగా కాలం గడిపే వాళ్ళేమో అని అనిపిస్తుంది ఇప్పుడు.
“ఒరేయ్ సన్నాసీ.
(ఆయన అందర్నీ అలాగే పిలుస్తాడు) నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకో. అలవెన్సులూ
అవీ కలిపి నీకు అయిదు వందలు వస్తుందనుకుందాం. అందులో 499 ఖర్చు పెట్టుకో. పరవాలేదు, సుఖపడతావు. అయిదు వందలూ తగలేయి. సుఖపడక
పోయినా కష్టపడవు. ఒకర్ని చేయి చాచి అడిగే దుస్థితి రాదు. వచ్చేది అయిదు వందలు
అయితే, ఒక్క రూపాయే కదా అని 501 ఖర్చు పెట్టావు అనుకో. ఇంతే సంగతులు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు.
ఆదాయాన్ని మించి చేసే ఆ ఒక్క రూపాయి ఖర్చయినా, అప్పయినా, జామెట్రిక్
ప్రోగ్రెషన్ లో వందలు, వేరుగా పెరిగి నీ మెడకు చుట్టుకుంటుంది. మెడలోతు గోతిలో పడతావు
సుమా!”
ఇలాంటి మాటలు
చెవికెక్కే వయసు కాదు నాది. పైగా అవన్నీ చాదస్తం మాటలు అని కొట్టిపారేసే వయసు.
చంద్రం మామయ్య
నేను అడిగిన చేబదులు సర్దుబాటు చేసాడా అన్నది కాదు ప్రశ్న. చివరికి
ఆయన చెప్పినట్టే జరిగిందన్నది నా జవాబు.
తత్వం బోధపడే
వేళకు అనుభవం వస్తుంది. కానీ ఏం లాభం?
కింది ఫోటో :
మట్టి కూజా (గూగుల్ సౌజన్యం
(ఇంకా వుంది)
పాత చింతకాయ పచ్చడి అంత మధురంగా ఉన్నాయండీ మీ విశేషాలు, రోజంతా మంచి బాలుడిలాగా బిహేవ్ చేస్తే, ర్యాలీ సైకిల్ మీద కాసేపు కూర్చుని తొక్కే (స్టాండ్ వేసి ఉండగానే) బహుమతి వచ్చేది నా చిన్నప్పుడు 🤣
రిప్లయితొలగించండిభండారు వారు, మీరు తరచు చెప్పే పెనుగంచిప్రోలు వగైరా ఊళ్ళ పేర్లు నా చిన్నతనంలో తరచూ వింటుండేవాడిని. మా తండ్రిగారు వేంకటేశ్వరరావు గారు 1950ల్లో నందిగామ తహసీల్దారుగా మూడేళ్ళు పని చేశారు లెండి. అక్కడి ఆయా గ్రామాల అప్పటి కరణాలందరూ ఆయనకు పరిచయమే. మీ పోస్టులు చదువుతుంటే ఆ నందిగామ రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి 🙏.
రిప్లయితొలగించండి