22, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (13) - భండారు శ్రీనివాసరావు

బస్సు మొహమే చూడని వాడిని, బస్సు ఎక్కడమే గొప్ప అనుకుంటే, బస్సు దిగింది ఏకంగా బెజవాడ వంటి బస్తీ కావడంతో  నా సంతోషానికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. నాకు తెలిసి పెనుగంచి ప్రోలుకు ఉదయం, సాయంత్రం  ఒక ఎర్ర బస్సు బెజవాడ నుంచి వచ్చేది. సాయంత్రం బస్సుని నైట్ హాల్ట్ బస్సు అనేవారు. రాత్రంతా అది ఊర్లోనే సత్రం దగ్గర హాల్ట్ వేసి, మర్నాడు ఉదయం ఫస్ట్ బస్సుగా బెజవాడ వెళ్ళేది. అలా ఒకటి రెండు బస్సులు మాత్రమే రోజు మొత్తంలో కనిపించేవి. అలాంటిది బెజవాడ బస్ స్టాండులో పదుల సంఖ్యలో ఒకేచోట బస్సులు చూసి నాకు మతి పోయింది. దీనికి తోడు మనుషులు లాగే రిక్షాలు, చల్ చల్ అంటూ గుర్రపు బండ్లు, రోడ్డుకు అటూ ఇటూ దుకాణాలు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. రిక్షా మాట్లాడుకుని మా అక్కయ్య నన్ను తీసుకుని గవర్నర్ పేటలోని రాజగోపాలా చారి వీధిలో, కామేశ్వర్ అండ్ కో ఎదురుగా ఉన్న ఇంటికి తీసుకు వెళ్ళింది. వీధిలోకే ఒక తలుపు. దాన్ని దాటుకుని వెడితే ఎడమవైపు ఒక మామిడి చెట్టు, దాని ఎదురుగా డాబా మీదికి వెళ్ళడానికి మెట్లు, వరండా, ఒక పెద్ద గది, దాని నిండా బీరువాలు, లా పుస్తకాలు,  పెద్ద లావు పాటి మేజా బల్ల, దాని ముందు రివాల్వింగ్ కుర్చీ, (ఇవన్నీ నా జీవితంలో మొదటి సారి చూసినవే, ఆ పేర్లన్నీ తరువాత కాలంలో తెలుసుకున్నవే). తరువాత ఒక చిన్నగది, తలుపులకు అద్దాలు బిగించిన బట్టల బీరువా, దాని పక్కన గోడకు ఒక గూడు, తర్వాత వంటిల్లు, స్టూలుపై పంపు బిగించిన మట్టి కూజా,  అది దాటి వెడితే చిన్న పెరడు, పొట్టు పొయ్యి, దానిపై నీళ్ళ కాగు. మొత్తం ఇల్లంతా ఇదే. మా ఊర్లో పెద్ద ఇంటిని చూసిన నా కంటికి  ఇది ఆనలేదు.  మధ్య గదిలో బట్టల బీరువా పక్కన ఒక గూడు వుందని చెప్పాను కదా! నిజానికి అది దేవుడి గూడు. దానికో చరిత్ర వుంది.

బహుశా ఇది జరిగి డెబ్భయ్ ఏళ్ళు పై మాటే! బెజవాడలో ఇద్దరు లాయర్లు కార్తీకమాసంలో కృష్ణానదిలో స్నానం చేసి వస్తున్నారు. వారిలో ఒకరికి ఇసకలో కూరుకుపోయి వున్న ఒక చిన్న విగ్రహం కనిపించింది. తీసి చూస్తే కాలి మీద కాలు వేసుకున్న ఒక వ్యక్తి ప్రతిమ అది. ఆ రోజు గురువారం. ఆ ప్లీడరు గారు దాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతి గురువారం దానికి పూజ చేయడం ప్రారంభించారు. విగ్రహం దొరికిన తరవాత చాలా ఏళ్లకు హైదరాబాదు నుంచి వచ్చిన ఒక చుట్టం ఆ విగ్రహాన్ని చూసి, ‘ఇదేమిటి! షిరిడీ బాబా విగ్రహం మీ ఇంట్లో ఎలావుంది?’ అని అడిగే దాకా ఆ విగ్రహం సాయిబాబాదని ఆయనకూ తెలియదు. అప్పుడు మొదలయిన ఆ పూజా పునస్కారాలు నేటికీ కొనసాగుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇన్నేళ్ళుగా బాబాను క్రమం తప్పకుండా పూజిస్తూవచ్చిన ఆ లాయరు గారు ఎన్నడూ షిరిడీ వెళ్ళిన దాఖలాల్లేవు.

ఆయన గారి పేరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు. కాశీలో ప్లీడరీ చదివిన హనుమంతరావు గారు స్వార్ధాన్ని గయలోనే వొదిలేసి, బెజవాడలో ప్రాక్టీసు మొదలు పెట్టారు. ఆయన గారి ప్లీడరు ప్రాక్టీసుకు తోటి లాయర్లు అందరూ కలసి షష్టి పూర్తి చేసి కూడా దశాబ్దాలు గడిచాయి. కష్టపడి పై చదువులు చదువుకున్న ఆయనకు చదువన్నా, చదువుకునే వాళ్ళన్నా ఎంతో అభిమానం. తన రాబడిలో ఎక్కువ భాగం, చదువుకునేవారు పై చదువులు చదివించడానికే వెచ్చించారు. విద్యా సౌకర్యాలు అంతగా లేని ఆ రోజుల్లో చుట్టపక్కాల పిల్లలందరికీ ఆయన గారి ఇల్లే ఓ ఉచిత హాస్టల్. ఎంత మందికో ఆయన విద్యాబుద్దులు నేర్పించి తమ కాళ్ళపై తాము నిలబడేట్టు చేసారు. చదువూ సంధ్యలకు దూరంగా పల్లెటూళ్ళలో రాళ్ళ మాదిరిగా రోజులు వెళ్ళమారుస్తున్న అనేకమంది ఆయన ఇంట్లో వుండి చదువుకుని రతనాలుగా మారారు. తమ తలరాతలు మార్చుకున్నారు. అంతగా కాకపోయినా, జీవితంలో ఓ మోస్తరు స్తాయికి చేరుకున్న నేను కూడా ‘అలాటి వాళ్ళల్లో నేనూ ఒకడిని’ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను.

ఎందరికో అక్షరబిక్ష పెట్టిన ఆ పెద్దమనిషికి బావమరదిని కావడం, అన్నం పెట్టి పెంచిన ఆ అమ్మకు ముద్దుల తమ్ముడిని కావడం నా పూర్వజన్మ సుకృతం. వారిద్దరూ నిజమైన కీర్తిశేషులు.

ఆ అమృత మూర్తుల సంస్మరణ సభ మా బావగారి శతజయంతిని పురస్కరించుకుని 2018లో విజయవాడ ఫార్ట్యూన్ మురళి పార్క్ హోటల్లో ఘనంగా జరిగింది. కుమారులు లాయర్లు అయిన తుర్లపాటి సాంబశివరావు, భైర్రాజు, బైరాజు కుమారుడు మరో కుర్ర లాయరు అయిన విహారి ఈ కార్యక్రమాన్ని అంత్యంత శ్రద్ధతో, కమనీయంగా, కన్నులవిందుగా నిర్వహించారు. మా బావగారితో పరిచయం కలిగిన సీనియర్ లాయర్లు, ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్న ప్లీడర్లు అనేకమంది హాజరయ్యారు. ఇక ఆయన బంధువుల సంగతి చెప్పక్కర లేదు. దేశవిదేశాల నుంచి కూడా తరలి వచ్చారు. ఆ మహానుభావుడి పట్ల పెంచుకున్న అసాధారణమైన భక్తితాత్పర్యాలు అలా అందరినీ అక్కడికి లాక్కెల్లాయి. 

ఆ సభలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఏదో మొక్కుబడిగా కాకుండా మనసు పొరల్లోనుంచి మాట్లాడిన విధానం గమనించినప్పుడు ఆయన వొదిలి వెళ్ళిన ముద్ర ఎంతటి బలమయినదో అర్ధం అయింది. ఇంట్లో ఉన్న పాత సైకిల్ అమ్ముకుని,  వచ్చిన పదిహేను రూపాయలతో  రైలెక్కి కాశీ వెళ్లి,  బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బారిస్టర్ పట్టా స్వర్ణ పతకంతో సాధించి, వృద్దుడయిన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి బొంబాయిలో వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఉన్నతోద్యోగాన్ని వదులుకుని బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టి , రెండు గదుల అద్దె ఇంట్లోనే ఏళ్ళతరబడి ఉంటూ చదువుమీద వున్న ఆపేక్షతో చదువుకోలేని పేదపిల్లలకు చదువు చెప్పిస్తూ, చుట్ట పక్కాల పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని చదివిస్తూ, చదువుకోవడానికి తనమాదిరిగా ఎవరూ కష్టపడకూడదు అనే సదాశయంతో రాబడినంతా ఖర్చుచేస్తూ, ఒక పక్క విద్యాదానం, మరో పక్క అన్నదానం చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్న డబ్బు యావత్తూ స్వార్ధం చూసుకోకుండా ఖర్చు చేసిన మా బావగారి గుణగణాలను సోదాహరణంగా నిండు హృదయంతో గుర్తు చేసిన ఆ ప్రసంగాలు నిజంగా ఆ మహానుభావుడికి నిజమైన శ్రద్ధాంజలి. 

ఆయన ధన్య జీవి. సందేహం లేదు. ధన్యజీవితం గడిపి తన తొంభయ్ మూడో ఏట దాటిపోయాడు. అయితే ఆయన ఆశీస్సులు పొందిన మేమందరం కూడా ధన్యులమే.

మొదటి చూపులో నాకు ఆట్టే నచ్చని మా బావగారి ఇంట్లో, నాకు బాగా నచ్చిన ఒక పిల్లవాడు కనిపించాడు. ఎర్రగా పీలగా వున్నాడు. పేరు  శాయిబాబు మా బావగారి తొలి సంతానం. నాకంటే ఓ ఏడాది చిన్న. నేనే బక్కగా వున్నాను అనుకుంటే నాకంటే సన్నగా వున్నాడు. కంభంపాడులో ఇంట్లో నా ఈడు పిల్లలు లేకపొతే, ఆడుకోవడానికి వీధిన పడి తిరిగే వాడిని. ఇక్కడ ఇంట్లోనే ఆడుకోవడానికి ఒక దోస్తు దొరికాడు. మా అమ్మ ఇక్కడికి పంపించింది బుద్దిగా చదువుకోవడానికి అనే ధ్యాసే నాకు లేదు. అయితే సాయిబాబు మాత్రం ముందు చదువు, తర్వాతే ఆటలు అనే రకం. పొతే, నా ఆటలు ఈ ఇంట్లో, ముఖ్యంగా మా బావగారి ముందు సాగవు అన్న సంగతి త్వరలోనే తెలిసి వచ్చింది.   

కింది ఫోటో: 

నన్ను చిన్నతనంలో వాళ్ళ పిల్లలతో సమానంగా పెంచి విద్యాబుద్దులు నేర్పించిన మా బావగారు తుర్లపాటి హనుమంతరావు గారు, అక్కయ్య సరస్వతి.





(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి