20, నవంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 11 ) - భండారు శ్రీనివాసరావు

 ‘ఏమైనా సరే శర్మ గారూ. మా వాడికి ఆ రాఘవయ్య గారి అమ్మాయి సంబంధమే ఖాయం చేసుకురాండి’ అని కరాకండిగా చెప్పేదట రంగమ్మ గారు. మా ఊరికి మూడు కోసుల దూరంలో ఉన్న పెనుగంచిప్రోలు గ్రామం కరణం కొమరగిరి వెంకట అప్పారావు గారి తల్లి రంగమ్మ గారు. ఒక్కడే కొడుకు. కొండంత ఆస్తిని, ఒక్కగానొక్క పిల్లవాడిని  వదిలిపెట్టి,  భర్త చాలా చిన్నతనంలోనే పోయాడు. ఆమే పిల్లాడిని పెంచి పెద్దచేసింది. తన కుటుంబం చిన్నదే అయినా భర్త తరపు అనేక కుటుంబాలకు అండగా నిలిచింది. మడీ, తడీ జాస్తి.  అయినా మనసు వెన్న. ఆవిడకి మా కుటుంబంలో అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని తాపత్రయం. మూడో అమ్మాయిని మిలిటరీ పేరు చెప్పి మా నాన్న ఇవ్వను అని మొహం మీదే చెప్పినా, తన  కోడల్ని ఆ కుటుంబం నుంచే తీసుకురావాలని ఆవిడ మొండి పట్టు పట్టింది. కేసులు తేలిపోయాయి కనుక సంబంధం వద్దు అనడానికి మునుపటిలా మా నాన్నకు కారణం కనపడక సరే అన్నాడు. వూరికి  కరణం కాబట్టి, కంభంపాడు నుంచి తాలూకా కేంద్రం నందిగామ వెళ్ళాలి అన్నా, బెజవాడలో కాపురం ఉంటున్న మూడో కుమార్తెను చూడాలి అన్నా పెనుగంచిప్రోలు మీదుగానే వెళ్ళాలి. పొరుగూరు సంబంధం. కూతురు దగ్గరలోనే వుంటుంది. ఇత్యాది కారణాలు కూడా నాన్న సరే అనడం వెనుక వున్నాయి. ఆ విధంగా మా అన్నపూర్ణక్కయ్య వివాహం  దాపునే ఉన్న పెనుగంచిప్రోలు కరణం అప్పారావు గారితో జరిగిపోయింది. మా అక్కయ్య లంకంత ఇంటిలో కోడలిగా అడుగు పెట్టింది.  చిన్న చిన్న ఇత్తడి గంటలతో, మేలైన కలపతో  అందంగా చెక్కిన  ఇంటి ప్రధాన ద్వారం ఓ ప్రధాన ఆకర్షణ. ఇంటి గోడలు ఎంత మందంగా ఉండేవి అంటే ఆ ఇంటికి కరెంటు పెట్టించినప్పుడు ఆ గోడలకు రంధ్రాలు పెట్టలేక పనివాళ్లు చేతులు ఎత్తేశారు. అంత పటిష్టంగా నిర్మించిన మేడ అది.

పేరుకు ఇల్లు కానీ నిజానికి అదొక పిల్లల హాస్టల్. హైస్కూలు ఉన్న ఊరు కావడంతో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోని చుట్టపక్కాల పిల్లలు చాలామంది అక్కడే వుండి చదువుకునే వారు. మా అన్నయ్యలు ఇద్దరు కూడా అక్కడనే  హైస్కూలు చదువు పూర్తి చేశారు. కులాల పట్టింపు లేని ఇల్లు కావడంతో అన్ని కులాలకు చెందిన బీదవారికి కూడా ఆ ఇల్లు అండగా మారింది. మిలిటరీలో కొంతకాలం పనిచేసి వచ్చిన మా బావగారు పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లారు. ఏటా దసరా నవరాత్రులు చాలా నిష్టగా, ఘనంగా చేసేవారు. పాడిపంటలకు లోటులేని కుటుంబం కావడంతో, మా అక్కగారి ఆధ్వర్యంలో ఆ ఇల్లు ఆమె పేరుకు తగ్గట్టే  అన్నపూర్ణ సత్రంగా మారింది.

చిన్నప్పటి నుంచి ఆమెకు నేనంటే చెప్పలేనంత ఆపేక్ష. బెజవాడలో చదువుకుంటున్నప్పుడు సెలవులకు మా ఊరు వెళ్ళాలి అంటే పెనుగంచిప్రోలులో బస్సు దిగి వెళ్ళాలి. మా అక్కయ్య ఇంట్లో భోజనం చేసిన తర్వాతనే మా ఊరి బాట పట్టేవాడిని. దబ్బకాయంత వెన్నముద్ద, ఆవకాయ, గడ్డ పెరుగుతో మా అక్కయ్య పెట్టే భోజనం అమృత సమానంగా వుండేది.  ఆదరణ ముందు పుట్టి తర్వాత అన్నపూర్ణక్కయ్య పుట్టిందేమో అన్నట్టుగా వుండేది ఆమె అభిమానం. ఈ విషయంలో ఆమెకు స్వపర బేధం లేదు. ఆ పుణ్యం ఊరికే పోలేదు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. పెద్దవాడు శ్రీరామచంద్రమూర్తి  వాళ్ళ నాన్న గారి మాదిరిగానే ఆధ్యాత్మిక మార్గం. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకులో సుదీర్ఘ కాలం పనిచేశాడు. అతడి భార్య కరుణ, అత్తగారి మాదిరిగానే అన్నపూర్ణ. రెండో వాడు గోపాలకృష్ణమూర్తి మద్రాసు ఐఐటి.  ఎల్. అండ్.టి. కంపెనీలో చాలా పెద్ద హోదాలో వివిధ దేశాల్లో పనిచేసి హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డాడు. భార్య లక్ష్మిది కూడా ఇటువంటి విషయాల్లో  పెద్దమనసు. మిగిలిన పిల్లలు తమ తలితండ్రుల మంచితనాన్ని పుణికిపుచ్చుకున్నారు.  ఆ ఇంట్లో వుండి చదువుకుని, తర్వాత జీవితంలో పైకి వచ్చి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కుదురుకున్నవారు కూడా అన్నపూర్ణక్కయ్యకు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడే వాళ్ళు.

ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ చదువుకుని వుంటే చాలా సులభంగా ఐ ఎ ఎస్ కాగలిగిన తెలివితేటలు కలిగిన మనిషి. పత్రికలు, పుస్తకాలు చదవడం ఆమెకు హాబీ. చదివిన వాటిని గుర్తు పెట్టుకుని సందర్భోచితంగా సంభాషణల్లో వాడేది. ఒక పల్లెటూర్లో పుట్టి, మరో పల్లెటూర్లో పెరిగిన మనిషి అనేక పుస్తకాలు రాసింది. తాను దర్శించిన పుణ్య క్షేత్రాలను గురించి, పెనుగంచిప్రోలులో ప్రసిద్ధి చెందిన తిరుపతమ్మ దేవత క్షేత్ర మహిమ గురించి, మా అమ్మగారు చనిపోయినప్పుడు మా కుటుంబంలో ముప్పయిమందిమి కలిసి కాశీ వెళ్లి అక్కడే అంత్య విధులను నిర్వర్తించిన తీరు గురించి రాసిన పుస్తకాలు రచయిత్రిగా ఆమెకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టాయి. హైదరాబాదు  రేడియోకి కూడా అనేక ప్రోగ్రాములు చేసేది. ఈ కార్యక్రమాలను ఆరోజుల్లో పర్యవేక్షించిన నా గురు పుత్రిక పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అమ్మాయి, పుట్టపర్తి పద్మినీదేవి  మా అక్కయ్య రాసే శైలి, వాచికం నచ్చి తగిన ప్రోత్సాహం ఇచ్చేవారు. నేను అక్కడే పనిచేసేవాడిని కానీ బయట తిరిగే ఉద్యోగం కాబట్టి ఆమె స్వయంగా రేడియో స్టేషన్ కు వెళ్లి రికార్డింగు అదీ పూర్తి చేసుకునేది.  అక్కడ పనిచేసే ఇతర రేడియో సిబ్బందితో కూడా చాలా కలుపుగోలుగా మాట్లాడుతూ వుండేది. తర్వాత వాళ్ళ మాటల ద్వారానే నాకు తెలిసేది ఆమె సంపాదించుకున్న మంచి పేరు గురించి.          

మొత్తం మీద అరకొర ఆర్ధిక పరిస్థితుల్లో కూడా మా నాన్న తన చేతులమీదుగానే అయిదుగురు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళికి  వున్నారు. మగపిల్లలు చిన్నవాళ్లు. తన వాటాకు వచ్చిన నూట యాభయ్ ఎకరాల్లో ఒక్క సెంటు అమ్మకుండా నెట్టుకు వచ్చాడు.  ఆడపిల్లలకు మాత్రం కలిగిన సంబంధాలే చేశాడు. మా అక్కయ్యలు సంపన్న కుటుంబాల్లో అడుగు పెట్టడం, మా కుంగిన ఆర్ధిక పరిస్థితుల్లో మిగిలిన ఇద్దరు అక్కయ్యల పెళ్లిళ్లకు, మగపిల్లల చదువులకు బాగా అక్కరకు వచ్చింది.

ఆరో అక్కయ్యది పేరుకు  తగ్గట్టే ప్రేమ వివాహం. మా కుటుంబంలో మొట్టమొదటి ప్రేమ వివాహం. మా బావగారిది వరంగల్ జిల్లా మానుకోట (మహబూబా బాద్) దగ్గర ఈదుల పూసపల్లి. దేశ ముఖ్ లు. వందల ఎకరాల ఆస్తిపరులు. చాలా సింపుల్ గా మా వూర్లో జరిగిన  పెద్దన్నయ్య పెళ్ళిలో మా వదిన తరపు చుట్టంగా ఆయన వచ్చి, మా ప్రేమక్కయ్యను చూసి, తొలి చూపు ప్రేమ అంటారే, అలాంటి ప్రేమలో పడి, అటువారిని, ఇటువారిని ఒప్పించి మొత్తం మీద తాను కోరుకున్న విధంగా మా అక్కయ్యను పెళ్ళాడాడు. ఆ పెళ్లి కూడా  తాటాకు పందిరి కింద నిరాడంబరంగా జరిగిన వివాహమే.

మా బావ గారు వాళ్లది పెద్ద కుటుంబం. గొప్ప కుటుంబం కూడా. ప్రేమక్కయ్యది చాలా అణకువగా వుండే స్వభావం. మంచి మనసు. అందర్నీ చాలా ఆదరంగా చూసేది. మెట్టినింటిలో అంతా ఆమెను దొరసాని అని పిలిచేవాళ్ళు. ఈ పిలుపు ఆమెకు కొత్తగానూ, కొంత ఇబ్బందిగాను వుండేది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ కనిపెట్టి, కలుపుగోలుగా వ్యవహరించే  చూసే ఆమె స్వభావం అక్కడి వారికి ఆశ్చర్యకరంగా వుండేది. ఆ రోజుల్లో రైళ్ళలో మూడు తరగతులు ఉండేవి. మొదటి తరగతికి, మూడో తరగతికి నడుమ మరో తరగతి వుండేది. మా బావగారు మానుకోట నుంచి ఎప్పుడు ఖమ్మం వచ్చినా అదే తరగతిలో ప్రయాణం చేసేవారు. ఆయన వెంట హమేషా వుండే మనిషి, పక్కనే  మూడో తరగతి బోగీలో ఉండేవాడు. డోర్నకల్ స్టేషన్ లో రైలు ఆగినప్పుడు కప్పూ సాసర్ లో కాఫీ తెచ్చి ఇచ్చేవాడు. మొదట్లో మా అక్కయ్యకు ఈ తతంగం అంతా విడ్డూరంగా అనిపించేది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. జయ, మణి (ఫేస్ బుక్ రచయిత్రి,), ఫణి (చిత్రకారుడు రాంపా భార్య). ఒక మొగ పిల్లవాడు శ్రవణ్. మా అక్కయ్య పుట్టింటికి ఎప్పుడు వచ్చినా ఆగా అనే పనివాడు ఆమె వెంట వచ్చేవాడు. నా మేనల్లుడు శ్రవణ్ కు అతడు బాడీగార్డు. నీడలా పిల్లాడి వెంటనే ఉండేవాడు. ఆడుకునే చోట ఏమాత్రం తడి నేల కనిపించినా శ్రవణ్ కాలు కింద పెట్టేవాడు కాదు, అంత శుభ్రం. పిల్లి శుభ్రం అంటారే, అలా అన్నమాట.   వెంటనే, వెంట వున్న  ఆగా,  పిల్లాడిని ఎత్తుకుని దాన్ని దాటించేవాడు. మా శ్రవణ్ బాల్యం అంత అపురూపంగా గడిచింది. ఎంతో అబ్బరంగా పెరిగాడు. ఇంత గారాబంగా పెరిగినా కూడా జమీన్ దారీ అహంకారం అతడ్ని అంటుకోలేదు. చక్కటి వర్చస్సు. నా మేనళ్ళులలో అందగాడనే పేరు. మంచిగా చదువుకుని, ప్రభుత్వ బీమా సంస్థలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద స్థాయిలో పదవీ విరమణ చేశాడు. అమ్మాయికి మంచి సంబంధం చేశాడు. ఒక్కగానొక్క  పిల్లాడు. బీ టెక్ చేశాడు. సినిమా రంగంలో స్థిరపడాలని అభిలాష. ఆ దిశగా చాలా కృషి చేశాడు. అమెరికా చాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండిపోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. అతడి దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా,  డీజే టిల్లు పెద్ద హిట్టయింది.

డీ.జే. టిల్లు! ఇదేం! పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే. విమల్ మొదటి చిత్రం  డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.   అన్నట్టు నాది  పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవతరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది. 

జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు  మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన కుర్ర బృందానికి అభినందనలు.

పొతే, ఈ సినిమాలో హీరోగా వేసిన సిద్దూతో మరో బాదరాయణ సంబంధం. అతగాడు ఒకానొక రోజుల్లో నా రేడియో సహోద్యోగి శారదగారి అబ్బాయి. సినిమా విజయవంతం అయిన పుత్రోత్సాహంతో ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకీ విషయం తెలిసింది. సినిమా నిర్మాణ సమయంలో తరచూ తమ ఇంటికి వచ్చి వెడుతుండే కుర్ర డైరెక్టర్  విమల్  నా మేనల్లుడి కుమారుడు అని నేను చెప్పేదాకా ఆమెకు తెలియదు.  

చిన్నప్పుడు వాళ్ళ నాన్న శ్రవణ్ కు కూడా సినిమాల్లో నటించాలి అనే అనే ధ్యాస వుండేది.   ఆ వ్యామోహంలో పడి, చాలా చిన్న వయసులో  ఒకసారి ఇంట్లో చెప్పకుండా రైలెక్కి మద్రాసు వెళ్ళిపోయాడు.
1971 నాటి వృత్తాంతం అది. ఆ మహా నగరంలో దిక్కుతోచక తిరుగుతూ  కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం, తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం  అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంధ్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము. మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. కళా దర్శకుడు రామలింగేశ్వరరావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు,  ఆంధ్రజ్యోతిలో ఫోటో చూసి, కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని పాటించాడు. అందరం గర్వపడేలా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. కృష్ణగారు తన పట్ల చూపిన అభిమానానికి గుర్తుగా కొడుకుకు 'విమల్ కృష్ణ అని, కుమార్తెకు 'రమ్యకృష్ణ'  అని పేర్లు పెట్టుకున్నాడు. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న కృష్ణ దంపతులు,  శ్రవణ్ కుటుంబాన్ని హైదరాబాదులోని  తమ ఇంటికి ఆహ్వానించి యోగక్షేమాలను ఆరా తీయడంతో దశాబ్దాల కిందటి శ్రవణ్ సినిమా కధకు శుభం కార్డు పడింది.

కింది ఫోటోలు :

అన్నపూర్ణక్కయ్య, అప్పారావు బావ దంపతులు, ప్రేమక్కయ్య, మధుసూదన రావు బావ దంపతులు, హీరో కృష్ణ దంపతులుతో శ్రవణ్ కుటుంబం












(ఇంకా వుంది)  

 

1 కామెంట్‌: